Israel-Palestine War: పదేళ్ల క్రితమే ముప్పేట దాడికి హమస్ ప్లాన్.. ఇజ్రాయిల్ నిఘావర్గాల హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..
ఇజ్రాయిల్‌పై హమస్ ఉగ్రవాదుల మెరుపుదాడి ప్లాన్ పదేళ్ల క్రితానిదే. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకోని ఇజ్రాయిల్ నేడు జరిగిన భీకరదాడి చూసి బిత్తరపోయింది. వందలాది మంది అమాయకపౌరులు చనిపోవడంతో షాక్ నుంచి తేరుకోలేకపోతోంది ఇజ్రాయిల్.
భూ,వాయు,జల మార్గాల నుంచి హమస్ జరిపిన ముప్పేట ఆకస్మికదాడితో ఇజ్రాయిల్ ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు ఏకంగా దేశంలోకి జొరబడి అనేక మంది పౌరులను, సైనికులను బందీలుగా చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఇజ్రాయిల్. తేరుకుని ప్రతిదాడులకు సిద్ధపడేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయారు. ఇజ్రాయిల్ చరిత్రలోనే ఊహించనంత భీకరంగా దాడి చేశారు హమస్ ఉగ్రవాదులు. ఆపరేషన్ ఆల్ అఖ్సా స్టార్మ్ పేరిట జరిపిన ఈ మెరుపుదాడికి పదేళ్లకు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు జరిగిపోయాయి.
2014లో దీనిపై హెచ్చరికలు వచ్చినా ఇజ్రాయెల్ పెద్దగా పట్టించుకోలేదు. ఉగ్రవాదులను విదేశాలకు పంపి వారికి అక్కడ శిక్షణ ఇప్పించింది హమాస్. దీనికి తోడు విదేశాల నుంచి టెక్నాలజీని కూడా సంపాదించింది. హమాస్ ఉగ్రవాదులు మోటారైజ్డ్ పారా గ్లైడర్లు వాడగలరని ఇజ్రాయెల్ ఊహించలేకపోయింది. ఇజ్రాయిల్‌లోకి చొచ్చుకొచ్చిన హమస్ మోటారైజ్డ్ పారా గ్లైడర్లు వందల సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. ఇజ్రాయిల్‌లో దిగగానే దొరికిన పౌరులు, సైనికులను బందీలుగా పట్టుకొన్నారు.
మూడు దారుల్లో అంతా ఒక్కసారిగా..
మరోవైపు మధ్యదరా సముద్రం నుంచి చిన్నచిన్న పడవల్లో గాజా మీదుగా ఇజ్రాయెల్‌లోకి అడుగుపెట్టారు హమస్ ఉగ్రవాదులు. అటు కంచెను బుల్ డోజర్లతో పడగొట్టి భూ మార్గం గుండా అనేక వాహనాల్లో ఇజ్రాయిల్‌లోకి దూసుకొచ్చారు. ఏకకాలంలో మూడు మార్గాల్లోనూ ఇంత సమన్వయంతో హమాస్ దాడి చేస్తుందని ఇజ్రాయెల్ బలగాలు ఊహించలేకపోయాయి.
పదేళ్ల క్రితమే ఇజ్రాయెల్ వెబ్‌సైట్‌లో కథనం..
పారా గ్లైడర్లతో దాడిచేసి ఇజ్రాయెల్ పౌరులను అపహరించేందుకు హమాస్ కుట్ర పన్నుతోందని 2014లోనే ఇజ్రాయిల్ నిఘావర్గాలకు సమాచారం అందింది. దీనికి సంబంధించి పదేళ్ల క్రితమే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారిక వెబ్‌సైట్‌లో కథనం ప్రచురితమైంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంలో ఓ హమాస్ కమాండర్‌ను ఇజ్రాయెల్ బలగాలు అదుపులోకి తీసుకొని విచారించి.. పలు విషయాలు రాబట్టాయి.
మలేషియాలో హమస్ కమాండర్ శిక్షణ..
అప్పటికే హమస్ ఆ కమాండర్‌తో పాటు పది మందిని మలేషియాకు పంపించి పారాగ్లైడింగ్‌లో శిక్షణ ఇప్పించిందని గుర్తించారు. పారాచూట్ల సాయంతో ఇజ్రాయెల్‌లో దిగి.. ప్రజలను, సైనికులను కిడ్నాప్ చేయడానికి రచించిన పథకం అది. అయితే ఆ తర్వాత హమాస్ దాడులకు పారాగ్లైడర్లను వాడకపోవడంతో ఇజ్రాయెల్ బలగాలు తేలిగ్గా తీసుకొన్నాయి. ఇదే నిర్లక్ష్యం ప్రస్తుతం ఇజ్రాయిలీల కొంపముంచింది.
కొద్దిపాటి ఉదాసీనత..
ఎయిర్‌ఫోర్స్ విమానాల ద్వారా పాలస్తీనాలోని లక్ష్యాలను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తున్నా దేశంలోకి చొచ్చుకొచ్చిన హమస్ ఉగ్రవాదులను గుర్తించడానికి ఇజ్రాయిల్ బలగాలకు చుక్కలు కనపడుతున్నాయి. ఈలోగానే వందలాది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొద్దిపాటి ఉదాసీనత ఇజ్రాయిల్ బలగాలను కోలుకోలేని దెబ్బతీసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి