Power Crisis in Pakistan: ‘పాక్‌లో కరెంట్ పోయింది..!’ దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..
పాకిస్తాన్ దేశవ్యాప్తంగా చీకటి అలుముకుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ బ్రేక్‌డౌన్ కావడంతో సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఆ దేశ విద్యుత్ మంత్రిత్వ శాఖ మంత్రి..
పాకిస్తాన్ దేశవ్యాప్తంగా చీకటి అలుముకుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ బ్రేక్‌డౌన్ కావడంతో సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఆ దేశ విద్యుత్ మంత్రిత్వ శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ వెల్లడించింది. పాక్‌లో కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ సహా అన్ని ప్రధాన నగరాలలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో లక్షల మంది ప్రజలు గాండాంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడచిన మూడు నెలల్లో ఈ విధంగా విద్యుత్ నిలిచిపోవడం ఇది రెండోసారికావడం గమనార్హం. సౌత్ పాకిస్తాన్‌లో ‘ఫ్రీక్వెన్సీ వేరియేషన్’ కారణంగా గ్రిడ్ విఫలమైందని, త్వరలోనే విద్యుత్ పునరుద్ధరిస్తామని ఆ దేశ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ తెలిపారు.
ఇప్పటికే కొన్ని గ్రిడ్‌లను పునరుద్ధరించామని, మొత్తం అన్ని గ్రిడ్‌లు పునరుద్ధరించడానికి మరో 12 గంటల సమయం పడుతుందని ఆయన అన్నారు. చలికాలంలో విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా రాత్రిపూట విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని, ఈ రోజు ఉదయం విద్యుత్ సరఫరాను ప్రారంభించినప్పుడు దక్షిణ పాకిస్తాన్‌లో వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడి, ఒక్కొక్కటిగా అన్ని విద్యుత్ కేంద్రాల్లో సరఫరా ఆగిపోయిందని దస్తగిర్ మీడియాకు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు ఆగిపోయాయి. ఇళ్లల్లో ఫ్యాన్లు, లైట్లు పనిచేయడం లేదు. ఆసుపత్రులు, పెద్ద వ్యాపార సంస్థల్లో జనరేటర్లు ఉండటం వల్ల సాధారణ ప్రజానికం నేరుగా ప్రభావితమయ్యారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ విద్యుత్ వ్యయం తగ్గించుకోవడానికి రాత్రి 8.30 తర్వాత మార్కెట్లు, 10 గంటల తర్వాత మాల్స్ మూసివేయాలనే నిబంధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.