Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం.. ముఖం చాటేసిన మిత్ర దేశాలు..
Pakistan Economic Crisis: పాకిస్తాన్ షెహబాజ్ ప్రభుత్వానికి కూడా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మిత్ర దేశాలు అయిన చైనా, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సహాయం లభించలేదు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిన అనంతరం నూతనగా ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షెహబాజ్ ప్రభుత్వానికి కూడా గడ్డు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతతో సతమతమవుతున్నారు. తాజాగా.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక వారం రోజుల విదేశీ పర్యటన తర్వాత దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో సౌదీ, UAE నాయకులతో పాటు 2017లో అధికారం కోల్పోయిన అతని సోదరుడు నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్నారు. షెహబాజ్‌తో అతని క్యాబినెట్ బృందం మొత్తం ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిని, ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొవాలనే దానిపై మాజీ ప్రధాన మంత్రి నుంచి పలు సూచనలు పొందినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే UKలో పర్యటించారు.
ఇదంతా ఒకటైతే.. షెహబాజ్ వచ్చిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి గంటలో 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 10 గంటలకు.. ఇండెక్స్ 2.44 శాతం లేదా 1,061.98 పాయింట్ల నష్టంతో 42,424.48 వద్ద ట్రేడవుతోంది. అయితే.. ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ప్రకటన దీనికి మరింత ఆజ్యం పోసింది. ప్రభుత్వం ప్రస్తుతానికి పెట్రోల్ ధరలను పెంచడం లేదని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తన రుణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం కోసం విధించిన ముఖ్యమైన ముందస్తు షరతును రద్దు చేస్తు్న్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే స్టాక్ ఎక్ఛేంజ్ పతనమైంది.
ఇంధన సబ్సిడీని ఉపసంహరించుకోవడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిరాకరించడంతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1,000 పాయింట్లకు పైగా పడిపోయినట్లు ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మే 20న PTI ఆధ్వర్యంలో ఇస్లామాబాద్‌లో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
పాకిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులు, స్టాక్ ఎక్స్ఛేంజ్ పతనంపై వ్యాసకర్త ప్రశాంత్ సక్సేనా న్యూస్9కు ప్రత్యేక వ్యాసం రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
అనిశ్చితితో సతమతమవుతున్న ప్రభుత్వం..
దేశాన్ని దివాలా తీయకుండా కాపాడేందుకు నిధులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అసమర్థత, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితితో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ప్రశాంత్ సక్సేనా పేర్కొన్నారు. ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటున్న ఏ దేశమైనా పాకిస్థాన్ నుంచి ఆశించేది చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలు ఉన్నాయి.. దానితో పాటు రాజకీయ పతనం కూడా కనిపిస్తుంది. ఒకవైపు దేశంలోని పాలక వర్గం.. మరో వైపు ప్రతిపక్ష వర్గం ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఇప్పటికే.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను తొలగించిన విధానం.. హత్య చేసేందుకు కుట్ర పన్నారని.. చెబుతూ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఇంతలో అధికార PML-N నేత.. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అతని సోదరుడి నుంచి ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కే సలహాలు పొందేందుకు మొత్తం మంత్రివర్గంతో UKకు వేళ్లారు. అక్కడ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు. దీని మధ్య దేశం విదేశీ మారక నిల్వలు కేవలం 10.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇది దిగుమతి బిల్లులను 40 రోజులకు మించకుండా తీర్చడానికి సరిపోతుంది. ఏప్రిల్‌లో పాకిస్థాన్ నెలవారీ దిగుమతి బిల్లు 6.6 బిలియన్ డాలర్లు. మీడియా నివేదికల ప్రకారం.. 10.5 బిలియన్ల డాలర్లలో చైనా 4 బిలియన్ల డాలర్లు, 3 బిలియన్ల డాలర్లు సౌదీ అరేబియా, 2.5 బిలియన్ల డాలర్ల UAE డిపాజిట్లు ఉన్నాయి.
ప్రధాని ఎదుట రెండు ఎంపికలు..
మీడియా నివేదికల ప్రకారం.. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ రెండు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవాలి.. మొదట పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ దూకుడు వైఖరిని నియంత్రించడానికి సాధారణ ఎన్నికల తేదీని ప్రకటించాలి. రెండవది ఆర్థిక సంక్షోభాన్ని నియంత్రించడానికి కృషి చేయాలి.
ఆదివారం పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లో జరిగిన ర్యాలీలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ తేదీని మే 20న ప్రకటిస్తానని.. ప్రజలంతా దేశ రాజధానికి చేరుకుంటారని.. ఎన్నికల తేదీ ప్రకటన వరకు తిరిగి రారని తెలిపారు.
కాగా.. మే 14న, ఇమ్రాన్ తనను చంపడానికి పన్నిన కుట్ర గురించి కూడా చెప్పారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్న వారందరి పేర్లతో కూడిన వీడియోను తాను రికార్డు చేశానని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే ఆ వీడియోను పబ్లిక్‌లో పెడతానని తెలిపారు.
నిపుణుల హెచ్చరిక..
వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ పతనం, రాజకీయాలు పాకిస్తాన్ దివాళా తీయడం ఖాయమంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణగ్రహీతలకు చెల్లించడంలో డిఫాల్ట్ కావడం త్వరలోనే చూస్తామని పేర్కొన్నారు. US డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి వేగంగా పడిపోవడంతో వారి భయాలు మరింత బలపడ్డాయి. శనివారం డాలర్‌కి పాకిస్తాన్ రూపాయి దాదాపు 195 గా ఉంది.
ఈ సమయంలో సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ తలత్ హుస్సేన్ ఇలా ట్వీట్ చేశారు.. “(PML-N Quaid) నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ వినాశకరమైన పాలనలో రాజకీయాల కోసం ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారు. ఏమీ చేయని ప్రధానమంత్రిగా ఉన్న షెహబాజ్ షరీఫ్‌కు ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేయడం.. ఎన్నికలకు పిలుపు ఇవ్వడం లాంటివే మిగిలి ఉన్నాయంటూ పరోక్షంగా పేర్కొన్నారు.
ఇంతలో, డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ద్వారా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రక్రియను ముందస్తుగా చేయడంపై PTI నాయకులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 కింద విచారణ ప్రారంభించాలని చెప్పడం మరో దుమారానికి దారి తీసింది.
మిత్రదేశాలతో.. నిరాశే..
ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలి పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా, యుఎఇతో భేటీ అయ్యారు. అయితే.. మిత్ర దేశాల నుంచి ప్యాకేజీలను పొందడంలో దేశం విజయవంతం కాలేదు. దీంతోపాటు చైనా కూడా ఎలాంటి సాయం అందించలేదు.
పాకిస్తాన్ ప్రభుత్వం మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అధికారుల మధ్య సమావేశం మే 18న దోహాలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దివాలా తీయకుండా ఉండటానికి దేశానికి పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని పొందలంటే ఐఎంఎఫ్ తో జరిగే సమావేశమే కీలకం కానుంది.
ఈ క్రమంలో మే 15 నుంచి ఇంధన రాయితీలను ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ సుముఖతపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి రుణాన్ని $ 8 బిలియన్లకు పొడిగించడానికి విధాన స్థాయి చర్చల కోసం ఖతార్‌లో ఇరుపక్షాలు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.
ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ పునరుద్ధరణపై పాకిస్తాన్‌తో చర్చల కోసం మే 18న ఒక వారం పాటు దోహాకు మిషన్‌ను పంపవచ్చని IMF ప్రభుత్వానికి తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంధన సబ్సిడీలపై షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో కొత్త రుణ ఒప్పందాలను ఖరారు చేయడంలో.. జాప్యం జరుగుతున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
గత సంవత్సరం.. దేశం 3.8 శాతం వడ్డీ రేటుతో వాయిదా చెల్లింపుపై $1.2 బిలియన్ వార్షిక చమురు సౌకర్యాన్ని (నెలకు $100 మిలియన్లు) పొందింది. అయితే, సౌదీ అరేబియా ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాణిజ్య విభాగం – ఇంటర్నేషనల్ ఇస్లామిక్ ట్రేడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐటిఎఫ్‌సి) లేదా అంతర్జాతీయ అభివృద్ధి కోసం పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) నుంచి చమురు సౌకర్యాన్ని స్వీకరించడానికి పాకిస్తాన్‌కు సదుపాయం కల్పిస్తుందని మీడియా నివేదికలు తెలిపాయి.
ఐటిఎఫ్‌సి – ఒపెక్ ఫండ్ సౌకర్యాలు, పాకిస్తాన్ కోరుతున్న దానికి భిన్నంగా ఉంటాయి. పాకిస్థాన్‌లో ఇప్పటికే 4.5 శాతం వడ్డీ రేటుతో ఐటీఎఫ్‌సీ చమురు సౌకర్యం ఉందని సక్సేనా రాశారు.