Hypersonic Weapon: గాలి కంటే ఐదు రేట్ల వేగం.. హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ద్వారా గగనతలం నుంచి అత్యంత వేగంగా దాడులు చేయగలిగే ఏజీఎం-183ఏ ను అమెరికా ప్రయోగించింది. అది నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించి.. గమ్యానికి చేరిందని అమెరికా ప్రకటించింది.
US Air Force – hypersonic weapon test: అగ్రరాజ్యం అమెరికా మరో అత్యాధునిక ఆయుధాన్ని రూపొందించింది. ధ్వని కంటే ఐదురేట్లు అధికవేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్‌ను యూఎస్ మిలటరీ విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటికే పలు దేశాలు క్షిపణుల ప్రయోగాలు చేస్తూ.. అధునాతన ఆయుధాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల యూఎస్ మిలటరీ అధికారులు సంతోషం వ్యక్తంచేశారు. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ద్వారా గగనతలం నుంచి అత్యంత వేగంగా దాడులు చేయగలిగే ఏజీఎం-183ఏ ను అమెరికా ప్రయోగించింది. అది నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించి.. గమ్యానికి చేరిందని అమెరికా ప్రకటించింది. గతంలో ఇందుకోసం మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా.. విఫలమయ్యాయి. తాజాగా ఈ ప్రోటోటైప్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా పేర్కొంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఈ పరీక్ష నిర్వహించారు. ఉక్రెయిన్‌తో.. రష్యా యుద్ధం చేస్తోన్న సమయంలో అమెరికా చేసిన ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ విజయవంతం కావడం గమనార్హం.
ఫిబ్రవరి 24 యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా పలుసార్లు హైపర్ సోనిక్ క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడులు చేసింది. కింజల్ హైపర్ సోనిక్ క్షిపణులను కూడా మోహరించింది. ఈ క్షిపణులు ధ్వని వేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయని రష్యా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా చేసిన ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.