AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ

ప్రపంచంలో ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు ఘర్షణలు కొనసాగుతున్న వేళ యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే సమస్యలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.

PM Modi: యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం: ప్రధాని మోదీ
PM Narendra Modi
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2026 | 3:40 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యలకు యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, పరస్పర చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, ఫిన్లాండ్ దేశాలు రెండూ కూడా చట్ట పరిపాలన, చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తాయని మోదీ తెలిపారు. యుద్ధం ద్వారా సమస్యలు పరిష్కరించలేమని ఇరు దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు కొనసాగుతున్న ఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలకాలని, శాంతి దిశగా జరిగే ప్రతి ప్రయత్నానికీ భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు, సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించాలన్న లక్ష్యంలో భారత్‌, ఫిన్లాండ్ దేశాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయని వెల్లడించారు.

ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు ప్రారంభించగా, గల్ఫ్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. లెబనాన్‌కు చెందిన సాయుధ సంస్థ హిజ్బుల్లా కూడా ఈ ఘర్షణలో చేరడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక మరోవైపు ఉక్రెయిన్‌పై పుతిన్ నేతృత్వంలోని రష్యా దాడులు కొనసాగుతుండటంతో యూరప్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రపంచం మొత్తం అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్-యూరప్ సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటీవల యూరోపియన్ సమాఖ్యతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇరు పక్షాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. భారత్-యూరప్ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, అభివృద్ధి, పరస్పర సౌభాగ్యానికి కొత్త బలం ఇస్తుందని ఆయన అన్నారు.

Follow Us