AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamsheer Vayalil: దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల భారీ సాయం..

బతుకుదెరువు కోసం ఎంతో ఆశతో దుబాయ్ వెళ్లారు.. కానీ ఊహించని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఒక ఘోర ప్రమాదం ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుని.. వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. అయితే ఆ కష్టకాలంలో ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు డాక్టర్ షంషీర్ వాయలిల్ తీసుకున్న నిర్ణయం అందరి మనసు గెలుచుకుంటుంది.

Shamsheer Vayalil: దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల భారీ సాయం..
Dr Shamsheer Vayalil Humanitarian Recovery Program
Krishna S
|

Updated on: Jun 13, 2026 | 10:15 AM

Share

గల్ఫ్ దేశంలో బతుకుదెరువు కోసం వెళ్లి ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త, బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్ అండ్ సీఈఓ డాక్టర్ షంషీర్ వాయలిల్ ముందుకొచ్చారు. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాద బాధితుల కోసం ఆయన రూ.2.6 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన ఏడుగురు కార్మికుల కుటుంబాలతో పాటు గాయపడిన తొమ్మిది మందికి ఈ ఆర్థిక సాయం అందనుంది.

ఎవరెవరికి ఎంత సాయం?

బాధిత కుటుంబాలకు తక్షణ ఉపశమనం అందించడంతో పాటు, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ ప్యాకేజీని ఏర్పాటు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 26 లక్షల వంతున ఆర్థిక సాయం అందజేస్తారు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది బాధితుల వైద్య, రికవరీ ఖర్చుల నిమిత్తం మొత్తం రూ. 47 లక్షలు కేటాయించారు. బాధితుల కుటుంబ సభ్యుల అత్యవసర ప్రయాణాలు, వసతి కోసం రూ.18 లక్షలు కేటాయించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాల్లోని చిన్న పిల్లల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా రూ.13 లక్షల నిధిని ఏర్పాటు చేశారు.

మృతుల్లో ముగ్గురు తెలంగాణ వాసులు..

ఒక సాంకేతిక లోపం వల్ల రోడ్డుపై ఆగిపోయిన ట్రక్కును, ఓ కంపెనీకి చెందిన మినీబస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇండియా, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన కార్మికులు బాధితులుగా మిగిలారు. మరణించిన ఏడుగురిలో ఆరుగురు భారతీయులు కాగా, ఒకరు శ్రీలంక పౌరుడు. భారతీయుల్లో ముగ్గురు తెలంగాణ, ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు కావడం గమనార్హం. అలాగే గాయపడిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది భారతీయులు, ఒకరు నేపాల్ పౌరుడు ఉన్నారు. గాయపడిన వారిలో ఐదుగురు డిశ్చార్జ్ కాగా, ముగ్గురు భారతీయులు ప్రస్తుతం దుబాయ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా..

ఈ సహాయక కార్యక్రమాలను సమన్వయం చేయడానికి డాక్టర్ షంషీర్ బృందం దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. ‘‘భారతీయ కుటుంబాలకు సాయం అందించే విషయంలో మేము ఇండియన్ కాన్సులేట్‌తో మాట్లాడుతున్నాం. అయితే దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా.. మానవత్వమే పరమావధిగా ఈ ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందుతుంది’’ అని డాక్టర్ షంషీర్ స్పష్టం చేశారు. కుటుంబాలను పోషించడం కోసం సొంత ఊళ్లను, దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశంలో శ్రమిస్తున్న కార్మికుల త్యాగాలు, వారి ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని డాక్టర్ షంషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సాయం పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేదని, కానీ కష్టకాలంలో ఉన్న ఆయా కుటుంబాలకు ఇది కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ బాధితులకు ఆయన రూ. 6 కోట్ల భారీ సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.

Follow Us