AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navanethem Pillay: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం.. ఎవరీ నవి పిళ్లై?

అంతర్జాతీయ న్యాయరంగంలో విశేష సేవలందించిన దక్షిణాఫ్రికా న్యాయ నిపుణురాలు, భారత సంతతికి చెందిన నవనీతం ‘నవి’ పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి స్థాపన, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, మానవ హక్కుల కోసం ఆమె చేసిన దశాబ్దాల కృషిని గుర్తిస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అంతర్జాతీయ స్థాయిలో న్యాయం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో ఆమె పోషించిన పాత్రకు ఈ గౌరవం దక్కింది.

Navanethem Pillay: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం.. ఎవరీ నవి పిళ్లై?
Navanethem Pillay, Nobel Peace Prize
Balaraju Goud
|

Updated on: Oct 09, 2026 | 3:09 PM

Share

అంతర్జాతీయ న్యాయరంగంలో విశేష సేవలందించిన దక్షిణాఫ్రికా న్యాయ నిపుణురాలు, భారత సంతతికి చెందిన నవనీతం ‘నవి’ పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి స్థాపన, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, మానవ హక్కుల కోసం ఆమె చేసిన దశాబ్దాల కృషిని గుర్తిస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అంతర్జాతీయ స్థాయిలో న్యాయం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో ఆమె పోషించిన పాత్రకు ఈ గౌరవం దక్కింది.

తమిళ మూలాలు.. దక్షిణాఫ్రికాలో జననం!

నవనీతం నవి పిళ్లై 1941 సెప్టెంబర్ 23న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించారు. భారతీయ తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన ఆమె, న్యాయ విద్యను అభ్యసించి అంతర్జాతీయ న్యాయ నిపుణురాలిగా ఎదిగారు. నాటల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత న్యాయ పట్టాలు పొందారు.

వర్ణవివక్ష కొనసాగుతున్న సమయంలోనే ఆమె తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆ కాలంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారు. జైళ్లలో ఖైదీలపై హింస, అమానవీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా గళమెత్తారు. మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం కూడా నిరంతరం కృషి చేశారు.

దక్షిణాఫ్రికా న్యాయరంగంలో చరిత్ర

1995లో దక్షిణాఫ్రికా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైన నవి పిళ్లై, ఆ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా గుర్తింపు పొందారు. వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఆమె ప్రస్థానం అంతర్జాతీయ న్యాయరంగంలోనూ కీలక బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసింది. 1995లో రువాండా అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నికైన ఆమె, 1999 నుంచి 2003 వరకు ఆ న్యాయస్థానానికి అధ్యక్షత వహించారు. అనంతరం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలపై విచారణలు, బాధితులకు న్యాయం అందించే ప్రక్రియల్లో అంతర్జాతీయ న్యాయ వ్యవస్థల పాత్రను బలోపేతం చేయడంలో ఆమె సేవలు కీలకంగా నిలిచాయి.

ఐక్యరాజ్యసమితిలో కీలక బాధ్యతలు

2008 నుంచి 2014 వరకు నవి పిళ్లై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేశారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు, వివక్ష, మహిళలపై హింస వంటి అంశాలపై దృష్టి సారించారు. బాధితులకు న్యాయం అందించడంతోపాటు, ప్రభుత్వాలు తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలనే అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు.

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్‌కు సంబంధించిన అంశాలపై విచారణ జరిపిన ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు కూడా ఆమె అధ్యక్షత వహించారు. ఈ కమిషన్ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు, అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించింది. వివిధ వర్గాల బాధ్యత, జవాబుదారీతనంపై కమిషన్ నివేదికలు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి.

న్యాయం, శాంతి కోసం జీవితకాల పోరాటానికి గుర్తింపు

నవి పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలు, మానవ హక్కుల పరిరక్షణ ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెప్పింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా న్యాయవాదిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఐక్యరాజ్యసమితి అత్యున్నత బాధ్యతల వరకు కొనసాగింది. శాంతి అంటే కేవలం యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదని, న్యాయం, సమానత్వం, మానవ గౌరవం, చట్టాల అమలు కూడా అందులో భాగమని ఆమె సుదీర్ఘ ప్రస్థానం గుర్తుచేస్తోంది. భారతీయ తమిళ మూలాలున్న దక్షిణాఫ్రికా మహిళకు దక్కిన ఈ అంతర్జాతీయ గౌరవం ఆమె జీవితకాల సేవలకు గుర్తింపుగా నిలిచింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us