‘సరదాగా చూసిన ఫిక్షన్ ఎపిసోడ్‌లు ఖగోళ శాస్ర్తవేత్తను చేశాయి’.. భారత ఖ్యాతిని అగ్రరాజ్యంలో చాటిన స్వాతి లైఫ్ స్టోరీ..
Nasa Scientist Swati Mohan Life Story: అగ్రరాజ్యం అమెరికా అంతరిక్ష చరిత్రలో శుక్రవారం అద్భుతం జరిగింది తెలిసిందే. ఈ ఘనత వెనక భారతీయ సంతతికి చెందిన స్వాతీ మోహన్ ఉందన్న విషయం యావత్ భారతీయులను గర్వపడేలా చేసింది..
Nasa Scientist Swati Mohan Life Story: అగ్రరాజ్యం అమెరికా అంతరిక్ష చరిత్రలో శుక్రవారం అద్భుతం జరిగింది తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకుగాను ప్రయోగించిన పర్సీవరెన్స్ ప్రయోగం విజయవంతమైంది. ఇది ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే ఓ అద్భుతం. అయితే ఈ ఘనత వెనక భారతీయ సంతతికి చెందిన స్వాతీ మోహన్ ఉందన్న విషయం యావత్ భారతీయులను గర్వపడేలా చేసింది. పర్సీవరెన్స్ రోవర్‌కి ల్యాండింగ్ ఇన్‌ఛార్జిగా స్వాతీ మోహన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి స్వాతి అసలు ఎప్పుడు అమెరికా వెళ్లింది. తను ఖగోళ శాస్ర్తవేత్తగా మారడానికి గల కారణలేంటి లాంటి ఆసక్తికర విశేషాలు మీకోసం.. భారత్‌లోని బెంగళూరులో జన్మించిన స్వాతి ఏడాది వయసులో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో అడుగుపెట్టింది. నార్తర్న్ వర్జినీయాలో విద్యాభ్యాసం చేసిన స్వాతికి చదువుకునే సమయంలో చిన్న పిల్లల డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ చిన్నతనంలో తాను చూసిన ‘స్టార్ ట్రెక్’ అనే సైన్స్ ఫిక్షన్ ఎపిసోడ్‌లు తన ఆలోచనను మార్చేశాయి. అప్పటి వరకు డాక్టర్ కావాలనుకున్న స్వాతి.. సైంటిస్ట్ కావాలని నిశ్చయించుకుంది. అంతలా ఆమెను అంతరిక్షం ఆకర్షించింది. విశ్వంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని, విశ్వ రహస్యాలను బయటపెట్టాలనే కోరిక పుట్టింది. దీంతో ఆ దిశలోనే తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది స్వాతి. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీ ఎమ్‌ఐటీలో ఎరోనాటిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన స్వాతి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటిలో శాస్ర్తవేత్తగా విధులు నిర్వర్తిస్తోంది. విశ్వ రహస్యాలపై పరిశోధనలు చేస్తోన్న స్వాతిలోని ప్రతిభను గుర్తించిన నాసా అధికారులు అరుణ గ్రహంపై చేపట్టిన పరిశోధన టీమ్‌కు ఆమెను లీడర్ చేశారు. మార్స్ 2020 గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ వంటివి స్వాతి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈరోజు అరుణ గ్రహంపై పర్సీవరెన్స్ ప్రయోగం విజయం వెనక స్వాతి జట్టు ఎనిమిదేళ్ల కృషి ఉంది. లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి పని చేస్తూ క్షణం తీరిక లేకుండా కృషి చేశాము కాబట్టే ఇది సాధ్యమైందని చెబుతోంది స్వాతి. ఇక స్వాతి వ్యక్తిగత విషయాలకొస్తే.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
The parachute has been deployed! @NASAPersevere is on her way to complete her #CountdownToMars: pic.twitter.com/i29Wb4rYlo
— NASA (@NASA) February 18, 2021
నుదుట బొట్టుతో ఆకట్టుకున్న స్వాతి..
పేరుకు పుట్టింది భారత్‌లోనే అయినా స్వాతి పెరిగింది మొత్తం అమెరికాలోనే. భారత్‌తో పెరిగిన జ్ఞాపకాలు తనలో లేకపోయినా.. భారతీయ సంస్కృతిని మాత్రం స్వాతి తూచా తప్పుకుండా పాటిస్తుంది. తాజాగా పర్సీవరెన్స్ ప్రయోగం జరిగే సమయంలో స్వాతి వేషాదరణ దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ప్రయోగం జరుగుతున్నంత సేపు టీమ్‌కు దిశా నిర్ధేశం చేస్తోన్న స్వాతి నుదుట బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అచ్చమైన భారతదేశ వనితగా కనిపించిన స్వాతి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది.