Naomi Osaka: మానసిక ఆందోళనతో ఫ్రెంచ్ ఓపెన్‌కు గుడ్‌బై చెప్పిన నవోమి ఒసాకా
జపాన్ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి, రెండో సీడ్ నవోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. అందుకు కారణం ఆమె కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతుండటమే!
జపాన్ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి, రెండో సీడ్ నవోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. అందుకు కారణం ఆమె కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతుండటమే! ప్రస్తుతం తన మెంటల్ కండీషన్ బాగోలేదని, అందుకే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నానని ఆమె తెలిపారు. తొలి రౌండ్ విజయం తర్వాత నవోమి ఓసాకా మీడియా సమావేశానికి హాజరుకాలేదు. దాంతో ఒసాకాకు రిఫరీ 15 వేల డాలర్ల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్యతో పాటు మరో మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఓసాకా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అటెండ్ కాకపోవడం వెనుక కారణం కూడా ఆమె మెంటల్ కండీషన్ బాగోలేకపోవడమే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య మాట్లాడాలంటే తనకు ఓ రకమైన బెరుకు వస్తుందని, ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతానని ఓసాకా అన్నారు. ఈ మానసిక ఆందోళన కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నానని అన్నారు.
ముందే తప్పుకుంటున్నట్టు ప్రకటించడం టోర్నమెంట్‌కు, ఇతర క్రీడాకారులకు, శ్రేయోభిషాలకు మంచిది కాబట్టే ఇప్పుడీ ప్రకటన చేస్తున్నానని అన్నారు. 2018 యూఎస్ ఓపెన్ నుంచే తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని ఆమె తెలిపారు. ఈ సమస్యను అధిగమించడం కోసం తానెంతో కష్టపడ్డానని అన్నారు.. పారిస్ టోర్నమెంట్‌లో కూడా ఆందోళనగా ఉన్నాను. అందుకే స్వీయ సంరక్షణ చర్యలు తీసుకోవడానికే మీడియా సమావేశాన్ని నిరాకరించాను తప్ప అందులో వేరే ఉద్దేశం లేదన్నారు. తానెప్పుడు పరధ్యానంగా ఉండాలని అనుకోలేదని, ప్రస్తుతం తన టైమ్ బాగోలేదని అన్నారు. ఇతర క్రీడాకారులు ఆటపై దృష్టి పెట్టాలని, తిరిగి పుంజుకోవాలని ఓసాకా సూచించారు. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంతోనే తనకు జరిమానా విధించారని, ఇక ముందు కూడా ఇలాగే మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటే తనపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని ఓసాకా అన్నారు.
ఈ మధ్య చాలా మంది క్రీడాకారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి వాళ్లే బయటకు చెప్పుకుంటున్నారు. ధైర్యంగా అప్పట్లో ఆటకు విరామం ప్రకటించాడు. మార్కస్ ట్రెస్కోథెక్, ఫ్లింటాఫ్, టెయిట్, హోగార్డ్, ట్రాట్, హార్మిసన్, మాడిసన్, హేల్స్, సారా టేలర్ వీరందరూ ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడినవారే! ఎక్కడో ఒక చోట మ్యాచ్ మ్యాచ్ ఆడుతుంటారు. కానీ సడన్‌గా మనసులో ఏదో తెలియని నైరాశ్యం అలముకుంటుంది. ఆడింది చాలనిపిస్తుంది. అర్జెంట్‌గా ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుంది. వీరిలో కొందరు ఆటకు కాసేపు అంతరాయం ఇచ్చి కోలుకోగలిగారు. కొందరైతే ఆటనే ముగించారు. మహిళా క్రికెటర్ సారా టేలర్ అయితే 30 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించారు. అందుకు కారణం మానసిక ఆందోళనే! నిజానికి ఆటలు మానసికోల్లాసాన్ని కలిగించాలి.. మానసిక ఒత్తిళ్ల నుంచి దూరం చేయాలి. ఇదేమిటో ఇప్పుడు క్రీడాకారులకే ఇలాంటి సమస్యలు రావడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివరకు ఏం జరిగిందంటే