అరె ఎంతకు తెగించార్రా.. జాతిపితకు అవమానం.. బీర్లపై మహాత్ముని ఫొటో!
బీర్లపై భారత జాతి పిత మహాత్మా గాంధీ ఫొటో ముద్రించినట్లు ఉన్న టిన్స్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ బీర్ ఏ దేశానికి చెందింది? దానిపై గాంధీ ఫొటోను ఎందుకు ముద్రించారు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

మన దేశంలో చలామణిలో ఉన్న ప్రతి కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫొటో ఉంటుంది. ఆయన మన జాతి పిత, స్వాతంత్ర్య సమరయోధుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశానికి స్వతంత్ర తెచ్చేందుకు అహింసా మార్గంలో వెళ్లి బ్రిటిష్ వారిని ఈ దేశం వదిలి వెళ్లేలా చేసిన గొప్ప నాయకుడు. అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించడం కోసం మన దేశ కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోను ముద్రించడం జరుగుతోంది. అయితే.. తాజాగా ఓ దేశంలో ఏకంగా బీర్లపై గాంధీ తాత ఫొటో, పేరు, ఆయన సంతకం ముద్రించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రీవోర్ట్స్ హాజీ ఐపీఏ పేరుతో బీరు టిన్స్ కనిపిస్తున్నాయి. దానిపై మహాత్మా గాంధీ ఫొటో, మహాత్మా జీ, ఆయన సంతకం ముద్రించి ఉన్నాయి. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప నాయకుడిని అవమానించేలా ఆయన ఫొటోను బీర్లపై ముద్రించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాంధీ తాత మద్యపానం నిషేధించాలని కోరిన వ్యక్తి. జీవితం మొత్తం శాఖాహారిగా, మద్యపానం ముట్టని వ్యక్తిగా ఉన్న ఆయన ఫొటోను ఎలా బీర్ టిన్స్‌పై ముద్రిస్తారంటూ నెటిజన్లు సైతం ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ బీర్లు రష్య దేశానికి చెందినవిగా తెలుస్తోంది. 2018లో ఈ IPA-శైలి బీర్ ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్-ఫైనల్స్‌లో ఈ బీర్ హైలెట్‌గా నిలిచింది.
రష్యాలోని నిజ్నీ నొవ్‌గోరోడ్‌లోని ఒక బార్‌లో ఫుట్‌బాల్ అభిమానులు భారత స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెట్టబడిన బీరు తాగడం ద్వారా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బ్రేవరీ గాంధీకి అంకితం చేయబడిన టిన్స్‌ను మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ నాయకుల పేర్లు, ఫొటోలు ముద్రించిన బీర్ల టిన్స్‌ను కూడా విక్రయిస్తోంది. మదర్ థెరిసా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేర్లతో కూడిన బీర్లను కూడా రివోర్ట్ ఉత్పత్తి చేసినట్లు సమాచారం. అయితే మహాత్మా గాంధీ ఫొటోతో ఉన్న బీర్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. పదేళ్ల క్రితం ఓ యూఎస్ కంపెనీ కూడా గాంధీ ఫొటోను బీర్ బాటిల్‌పై ముద్రించింది. ఈ అంశంపై హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కంపెనీ క్షమాపణలు చెప్పింది.
బీర్లపై మహాత్మా గాంధీ ఫొటో ఉన్న వీడియో
View this post on Instagram
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
