AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran US Tensions: ఇరాన్ జలాల్లో LPG ట్యాంకర్‌పై దాడి.. 28 మంది భారతీయులు సేఫ్, మరో ఘటనలో ఒకరు మృతి

DISHA LPG Tanker: ఇరాన్ ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తున్న LPG ట్యాంకర్ DISHAపై దాడి జరిగినప్పటికీ, అందులోని 28 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరోవైపు, బ్లాక్ సీ సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Iran US Tensions: ఇరాన్ జలాల్లో LPG ట్యాంకర్‌పై దాడి.. 28 మంది భారతీయులు సేఫ్, మరో ఘటనలో ఒకరు మృతి
Iran Waters Attack
Rajashekher G
|

Updated on: Jul 25, 2026 | 9:44 AM

Share

LPG Tanker Attacked in Iranian Waters: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, శుక్రవారం ఇరాన్ ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తున్న మొజాంబిక్ జెండా కలిగిన ఎల్పీజీ (LPG) ట్యాంకర్ “డిషా (DISHA)”పై దాడి జరిగింది. ఈ నౌకలో 28 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారంతా క్షేమంగా ఉన్నారని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ (X) వేదికగా స్పందిస్తూ, “ఇరాన్ జలాల్లో డిషా నౌకపై దాడి జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నౌకలో 28 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, వారందరూ సురక్షితంగా ఉన్నట్లు ధృవీకరించాం” అని పేర్కొంది.

అయితే, ఈ దాడి ఎలా జరిగింది? ఎవరు దాడి చేశారు? నౌకకు ఎంత మేర నష్టం జరిగింది? వంటి వివరాలను రాయబార కార్యాలయం వెల్లడించలేదు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

సముద్ర మార్గాలపై దాడులు అంగీకారయోగ్యం కావు: జైశంకర్

ఈ ఘటనకు ముందు రోజు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. సముద్ర భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో పనిచేసే సిబ్బంది, పౌర నౌకలు, కీలక మౌలిక వసతులపై ఎలాంటి దాడులనైనా భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “అంతర్జాతీయ సముద్ర మార్గాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి. నావికులు, పౌర నౌకలు లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేము” అని జైశంకర్ పేర్కొన్నారు.

మరో ఘటనలో భారతీయుడు మృతి

మరోవైపు, గత శనివారం బ్లాక్ సీ (Black Sea) గుండా ప్రయాణిస్తున్న MV OMORFI అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం రాత్రి వెల్లడించింది. జూలై 18న రష్యా ప్రాదేశిక జలాల సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది.

దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అదే సమయంలో నౌకలో ఉన్న మిగిలిన ఇద్దరు భారతీయులు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Follow Us