సినిమా సీన్‌ను తలపించిన రెస్క్యూ..! కారు విండోస్ పగలగొట్టి ఐదుగురిని కాపాడిన పోలీస్ దంపతులు
లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమిత్, అర్చన అనే పోలీస్ దంపతులు చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం ఐదుగురు ప్రాణాలను కాపాడింది. కారు బోల్తా పడి ఐదుగురు ప్రయాణికులు చిక్కుకుపోగా, అమిత్ తన సర్వీస్ రైఫిల్‌తో కారు కిటికీలు పగలగొట్టి వారిని రక్షించారు. అర్చన కూడా సహాయం చేశారు. ఈ వీరోచిత చర్య నెటిజన్ల ప్రశంసలు పొందింది, సకాలంలో స్పందిస్తే ప్రాణాలను రక్షించవచ్చని చాటిచెప్పింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ దంపతులు చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి ప్రశంసలు అందుకుంటోంది. 171 కిలోమీటర్ల కట్ సమీపంలో రోడ్డుపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణికులు చిక్కుకుపోయి సహాయం కోసం కేకలు వేస్తున్నారు. అదే సమయంలో కానిస్టేబుల్ అమిత్ టెయోటియా తన భార్య, కానిస్టేబుల్ అర్చన సింగ్‌తో కలిసి సౌరిఖ్ నుంచి కనౌజ్ వైపు వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే వారు తమ వాహనాన్ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని చూసిన అమిత్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు.
కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు వాహనం విండోస్ పగలగొట్టాల్సి వచ్చింది. దీంతో అమిత్ తన సర్వీస్ రైఫిల్‌ను ఉపయోగించి కారు కిటికీలను పగలగొట్టి లోపలికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్న ఐదుగురినీ ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అర్చన కూడా సహకరించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని వెంటనే సౌరిఖ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు తరలించారు. అక్కడ వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో సమయానికి స్పందించి బాధితులను రక్షించిన పోలీస్ దంపతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలను లెక్కచేయకుండా ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడిన అమిత్, అర్చన ధైర్యసాహసాలను నెటిజన్లు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
