Afghanistan Crisis: ఇస్లామిక్ చట్టం ప్రకారం మహిళలకు హక్కులు..! తాలిబాన్ అధికార ప్రతినిధి ప్రకటన..
Afghanistan Crisis: ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆఫ్గాన్‌లో మహిళలకు హక్కులు కల్పిస్తామని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఆఫ్గాన్‌లో పగ్గాలు చేపట్టిన తర్వాత తాలిబాన్ యోధులు దేశాన్ని రక్షిస్తారని
Afghanistan Crisis: ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆఫ్గాన్‌లో మహిళలకు హక్కులు కల్పిస్తామని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఆఫ్గాన్‌లో పగ్గాలు చేపట్టిన తర్వాత తాలిబాన్ యోధులు దేశాన్ని రక్షిస్తారని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం లేదని అందరికి క్షమాభిక్ష ప్రసాదించామని తెలిపారు. జబివుల్లా ముజాహిద్ కొన్నేళ్లుగా తిరుగుబాటుదారుల తరపున రహస్యంగా ప్రకటనలు జారీ చేస్తున్నాడు. గత తాలిబాన్ పాలనలో మహిళల జీవితం, హక్కులపై కఠినమైన ఆంక్షలు ఉండేవి.
గతంలో స్త్రీల హక్కులకు తీవ్రభంగం కలిగించిన తాలిబన్లు ఈ దఫా ఆశ్చర్యకరంగా మహిళలపై సానుభూతి చూపుతున్నారు. అఫ్గాన్‌లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తెలిపారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. మహిళా విద్య, ఉద్యోగాలకు తగిన వాతావరణం కల్పిస్తామని, ఇస్లామిక్ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలను నియమిస్తామని చెప్పారు. అయితే ‘ఇస్లామిక్ చట్టం’ అంటే ఏంటనేది ఆయన వివరించలేదు.
ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని, ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలని ప్రకటించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతున్నదీ తాలిబన్లు తమ కల్చరల్ కమిషన్‌లో సభ్యుడైన ఎనాముల్లా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో తమను వ్యతిరేకించిన వారు, విదేశీయులకు మద్దతునిచ్చిన వారితో సహా అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఎనాముల్లా చెప్పారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టలేదు. పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తాలిబన్ ప్రతినిధుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ మీడియా “స్వేచ్ఛగా ఉండాలని” కోరుకుంటున్నట్లు ముజాహిద్ తెలిపాడు. అయితే జర్నలిస్టులు “దేశ విలువలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు” అని ప్రత్యేకంగా నొక్కిచెప్పాడు. ఆఫ్ఘన్, విదేశీ పౌరుల ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రయత్నించాడు.