Pakistan New Prime Minister: ఏడాదికి పైగా ప్రభుత్వాన్ని నెట్టుకురావడం షెహబాజ్‌ వల్ల అవుతుందా?

Pakistan New Prime Minister: ఏడాదికి పైగా ప్రభుత్వాన్ని నెట్టుకురావడం షెహబాజ్‌ వల్ల అవుతుందా?
Pak New Prime Minister

పాకిస్తాన్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారయ్యింది. పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ షరీఫ్‌ పార్టీకి చెందిన...

Balu

| Edited By: Ravi Kiran

Apr 12, 2022 | 10:03 AM

పాకిస్తాన్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారయ్యింది. పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ షరీఫ్‌ పార్టీకి చెందిన షెహబాజ్‌ను మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యతిరేక కూటమిలోని విపక్షాలన్నీ ప్రధానిగా ప్రతిపాదించాయి. కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ సమావేశం కానుంది. పాకిస్తాన్‌ చరిత్రలో ఇంతకు ముందు బేనజీర్‌ భుట్టో, షౌకత్‌ అజీజ్‌లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని గట్టెక్కారు కానీ ఇమ్రాన్‌ఖాన్‌కు అది సాధ్యం కాలేదు. బేనజీర్‌ కానీ షౌకత్‌ అజీజ్‌ కానీ అవిశ్వాస తీర్మానాల నుంచి బయటపడ్డారు కానీ అయిదేళ్ల పాటు అధికారంలో ఉండలేకపోయారు. ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా అంతే! పాకిస్తాన్‌లో మనలాగే ప్రధానమంత్రి పదవీకాలం అయిదేళ్లు. విచిత్రమేమిటంటే ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోవడం. ప్రతీసారి సైన్యం ప్రధానులు దింపేస్తూ వచ్చింది. 75 సంవత్సరాల పాకిస్తాన్‌లో 31 ఏళ్ల పాటు సైనిక పాలనే కొనసాగింది. 1958 నుంచి 1969 వరకు ఆయూబ్‌ ఖాన్‌, 1969 నుంచి 1971 వరకు యాహ్యాఖాన్‌, 1977 నుంచి 1988 వరకు జియా ఉల్‌ హక్‌, 1999 నుంచి 2008 వరకు పెర్వేజ్‌ ముషారఫ్‌ నియంతలుగా పాకిస్తాన్‌ను పరిపాలించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగి ఎవరైనా ప్రధానమంత్రి పదవిని అధిష్టించడమే పాపం.. సైన్యాధిపతులకు నిద్రపట్టేది కాదు. ప్రధానులకు అవినీతి మరకలు అంటించి వారిని గద్దె దింపేవారు. పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునేవారు.

పోనీ వీరు ఏమైనా గొప్ప పాలనను అందించారా అంటే అదీ లేదు. వారు అధికారంలో ఉండాలంటే సదా యుద్ధ వాతావరణం ఉండాలి. అలాగైతేనే బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించుకునే వీలుంటుంది. అందులోంచి డబ్బులు కాజేసి చక్కగా బతికేసేవారు. దేశంలో అభివృద్ధి కుంటుపడినా వారు లెక్క చేయరు. ప్రజలలో అసంతృప్తి పెల్లుబుకుతుందన్న సూచనలు కనిపించగానే మతఛాందసత్వాన్ని ముందుకు తెచ్చేవారు. అలా ప్రజల మనసులను పక్కదోవ పట్టించేవారు. సైన్యాధిపతుల పాలనలో సైన్యం చెలరేగిపోయేది. మత ఛాందసవాదులకు పట్టపగ్గాలుండేవి కావు. ప్రశ్నించేవారిని జైళ్లో తోసేవారు. ప్రజాస్వామికవాదులకు చుక్కలు చూపించేవారు. మీడియాను కంట్రోల్‌లోకి తెచ్చుకునేవారు. న్యాయవ్యవస్థలను కూడా తమ అదుపాజ్ఞాలలో పెట్టుకునేవారు. అయితే ప్రజలు మాత్రం సైన్యాధిపతుల పాలనపై ప్రతీసారి పోరాడేవారు. తిరగబడేవారు. కాకపోతే ప్రజల్లో ఐక్యత లేకపోవడంతో ఇన్నాళ్లపాటు వారి పెత్తనం సాగింది. 2010లో రాజ్యాంగ సవరణల తర్వాత ప్రజా ప్రభుత్వాలను సైన్యం ప్రత్యక్షంగా కూల్చివేసి అధికారం చేపట్టే వీలులేకపోయింది. అయినప్పటికీ సైన్యం గమ్మున ఉండటం లేదు. ప్రతీ ఎన్నికల్లో పరోక్షంగా జోక్యం చేసుకుంటూ వస్తోంది. న్యాయవ్యవస్థ కూడా అప్పుడప్పుడు సైన్యానికి మద్దతు ఇచ్చేది. 2008లో ముషారఫ్‌ దిగిపోయాడంటే అప్పుడు నిజాయితీ నిర్భీతి కలిగిన న్యాయాధికారులు ఉండటమే! ప్రజాస్వామ్య పార్టీల మధ్య ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకుండా హంగ్‌ పార్లమెంట్‌ వచ్చేట్టుగా సైన్యం చూసుకుంటుంది. సంపూర్ణ మెజారిటీ వస్తే ఎక్కడ తమ మాట వినరోనన్న భయం సైన్యానిది! ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్‌ పదవీచ్యుతుడవ్వడానికి వెనుక సైన్యం ఉందన్నది నిర్వివాదాంశం. ఆ మాటకొస్తే ఇమ్రాన్‌ను గద్దెనెక్కించింది కూడా సైన్యమే.

ఇప్పుడు ప్రధాని పదవి చేపట్టబోతున్న షెహబాజ్‌ షరీఫ్‌ వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే సాధారణ ఎన్నికల వరకు పదవిలో ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ ఇప్పుడు నవాజ్‌ షరీఫ్‌ పార్టీతో రాసుకు పూసుకు తిరుగుతున్నది కానీ పాత కక్షలను మర్చిపోకుండా ఎలా ఉంటుంది? మళ్లీ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉంటుందా? పురానా పాకిస్తాన్‌కు స్వాగతమని పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో చెప్పుకుంటున్నారే కానీ పాత పాకిస్తాన్‌లో ఏం జరిగిందో ఆయనకు తెలియకుండా ఉంటుందా? షెహబాజ్‌ మామూలు వ్యక్తేం కాదు. మూడు సార్లు పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన ఈయనపై అనేక అవినీతి కేసులున్నాయి. మనీలాండరింగ్‌ కేసుల్లో షెహబాజ్‌, ఆయన కుమారుడు హంజా అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని సజావుగా నడపగలరా? ఏడాదికి పైగా అధికారంలో ఉండటం సాధ్యమవుతుందా? విపక్షాలను ఒక్కతాటిపై నడటం చేతనవుతుందా? అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu