AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chabahar Port: అమెరికా దాడులు.. ఇరాన్‌లో భారత వ్యూహాత్మక ప్రాజెక్టుపై నీలినీడలు..

US Iran War Updates: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు (Chabahar Port) ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పోర్టు సమీపంలో అమెరికా జరిపిన వైమానిక దాడులు భారత్ మధ్య ఆసియా వాణిజ్యానికి కీలకమైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంటోంది.

Chabahar Port: అమెరికా దాడులు.. ఇరాన్‌లో భారత వ్యూహాత్మక ప్రాజెక్టుపై నీలినీడలు..
Chabahar Port In Iran
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 1:27 PM

Share

పశ్చిమాసియాలో మళ్లీ రగులుతున్న యుద్ధ జ్వాలలు (US – Iran War) భారత్‌ను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌లో భారత్‌ వ్యూహాత్మక ప్రాజెక్టు అయిన చబహార్ పోర్టు పరిసరాల్లో అమెరికా బలగాలు బాంబు దాడి జరిపాయి. దీంతో అక్కడ భారత్ చేపట్టిన కీలక ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌ను దాటి, మధ్య ఆసియా దేశాలకు భారత్ వేసిన ‘వ్యూహాత్మక వంతెన’ ప్రమాదంలో పడినట్టయింది. ఇరాన్‌లోని చబహార్ పోర్టు సమీపంలోని ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా సేనలు దాడులు చేయడంతో భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చబహార్ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతుందన్న కారణం చూపుతూ అమెరికా ఈ దాడులకు పాల్పడింది.

భారత్‌కు చబహార్ ఎందుకంత ముఖ్యం?

భారత్ వ్యూహాత్మక ప్రయోజనాల్లో చబహార్ పోర్టుది అత్యంత కీలక పాత్ర. ఇది భారత్‌కు కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాదు, ఎన్నో ప్రయోజనాల గని. పాకిస్థాన్ భూభాగం మీదుగా వెళ్లకుండానే, నేరుగా ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకునేందుకు చబహార్ ఒక మార్గం. భారత్, ఇరాన్, రష్యా, మధ్య ఆసియా దేశాలను కలిపే ‘ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్’ (INSTC)కు చబహార్ గుండెకాయ వంటిది. దీని ద్వారా యూరప్‌కు ఎగుమతులు వేగవంతం, చౌకగా జరిపేందుకు వీలుంటుంది.

పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టులో చైనా భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. దానికి సమాంతరంగా, చైనా-పాక్ కూటమికి గట్టి బదులిచ్చేలా చబహార్‌ పోర్టు ద్వారా భారత్ తన ఉనికిని చాటుకుంటోంది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర తీరంలో కీలకమైన ప్రాంతంలో ఉండటం వల్ల, భారత్ తన నావికా దళ భద్రతను పర్యవేక్షించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం.

ఇవి కూడా చదవండి

భారత్‌కు ఆందోళన ఎందుకు?

ప్రస్తుతం భారత్‌కు చెందిన ‘ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్’ (IPGL) ఈ పోర్టులోని ఒక టెర్మినల్‌ను నిర్వహిస్తోంది. దీనిపై భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒకవేళ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే.. భారత్ పెట్టిన పెట్టుబడులకు ప్రయోజనం లేకుండా పోతుంది. అలాగే మధ్య ఆసియా దేశాలకు కనెక్టివిటీ దెబ్బతింటుంది. ప్రాంతీయ వాణిజ్య మార్గాలు దెబ్బతిని ఇంధన భద్రతపై ప్రభావం పడవచ్చు.

భవిష్యత్తు ఏంటి?

అమెరికా సైనిక చర్య తర్వాత చబహార్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు భారత్ తన దౌత్య మార్గాల ద్వారా ఈ ప్రాంతంలో శాంతిని కోరుకుంటూ, తన ప్రాజెక్టులను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ మారుతున్న ఈ పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల శాఖ నిశితంగా గమనిస్తోంది. తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్ ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us