INDIA STRATEGY: అమెరికా బెదిరింపులకు జడవని భారత్.. అక్కసు కక్కుతూనే అభినందించిన ఇమ్రాన్.. ఇది కదా దౌత్య నీతంటే..!

ఇండియా బలంగా మారిందనడానికి బ్రిటన్ ఉన్నతాధికారి చేసిన ప్రకటనను ఇమ్రాన్ ఉటంకించారు. ‘‘ హిందుస్థాన్‌కు ఓ శక్తివంతమైన దేశం మద్ద‌తిస్తూ మాట్లాడింది.. ఇండియా ఓ స్వ‌తంత్ర దేశ‌ం.. భారత్‌కు ఏమీ చెప్ప‌లేమ‌ని బ్రిట‌న్ విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి అన్నారు..

INDIA STRATEGY: అమెరికా బెదిరింపులకు జడవని భారత్.. అక్కసు కక్కుతూనే అభినందించిన ఇమ్రాన్.. ఇది కదా దౌత్య నీతంటే..!
India's foreign policy
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 01, 2022 | 8:58 PM

INDIA STRATEGY CRUCIAL AMERICA THREATENS HINDUSTAN: యుక్రెయిన్(Ukraine), రష్యా(Russia)ల యుద్దం నేపథ్యంలో భారత్(India) పాత్ర ఏమిటి ? భారత్ విధానం తటస్థమా ? లేక రష్యాకు అనుకూలమా ? రెండు దేశాలను సమదృష్టితో చూస్తూ స్వతంత్ర విధానాన్ని అవలంభిస్తున్న భారత్‌పై అమెరికా(America) ఎందుకు మండిపడుతోంది? పరోక్షంగా హెచ్చరికలను ఎందుకు జారీ చేస్తోంది? అవసరమైతే ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోమన్న సంకేతాలను ఎందుకు ఇస్తోంది ? ఇవిప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు. నిజానికి భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం. 1971లో భారత్, పాక్(Pakistan) యుద్దసమయంలో దాదాపు 18 దేశాలు భారత్‌పై దాడికి సిద్దమైన తరుణంలో వాటన్నింటినీ వెనక్కి తగ్గేలా చేసి, భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిన దేశం రష్యా. చేసిన సాయాన్ని మరవని దేశం మనది. ఏనాడు కయ్యానికి కాలుదువ్వని దేశం మనది. ఎవరైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే తిప్పి కొట్టడంలో అందెవేసిన చేయి కూడా. దేశం స్వతంత్రం పొంది పదిహేనేళ్ళ కాలగమనంలో అంతగా సైనిక పాటవం సాధించని తరుణంలో డ్రాగన్ కంట్రీ చైనా దురాక్రమణకు దిగితే.. ఓటమి పాలైనా పెద్దగా నష్టపోని దేశం భారత్. ఆ తర్వాత జరిగిన ఏ యుద్దంలోను భారత సైన్యం వెన్ను చూపలేదు. 1999 కార్గిల్ యుద్దం(Kargil War) అందుకు ఉదాహరణ. సరే.. యుద్దం సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం రష్యా.. యుక్రెయిన్‌పై దురాక్రమణ చేస్తోందా ? లేక ప్రత్యేక పరిస్థితుల్లో సైనిక చర్యకు దిగిందా ? భారత దౌత్యవిధానాన్ని సునిశితంగా పరిశీలించిన వారికి రెండోదే కరెక్టనిపిస్తోంది. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. రష్యన్ విదేశాంగ శాఖా మంత్రి లావ్రోవ్‌తో కలిసి ఏప్రిల్ ఒకటిన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జయశంకర్.. రష్యా చర్యను స్పెషల్ మిలిటరీ యాక్షన్‌గానే చూస్తున్నట్లు ప్రకటించారు.

సహజంగానే భారత్, రష్యా పట్ల ఎంతో కొంత సానుకూల వైఖరినే కొనసాగిస్తోంది. అదే సమయంలో యుక్రెయిన్‌పై రష్యా సైనికచర్యను ఇప్పటివరకు బహిరంగంగా సమర్థించలేదు. సరికదా.. ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమన్న శాంతి ప్రవచనాన్నే చెబుతూ వస్తోంది. యుక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న కీలక సమయంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ ఇండియాకు రావడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య కీలక సమాలోచనలు జరుగుతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో ఏప్రిల్ 1న లావ్రోవ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జయశంకర్‌.. ఇండియా ఎప్పుడూ‌ ఏ వివాదమైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. ఇదేసందర్భంలో లావ్రోవ్ చేసిన ప్రకటన సహజంగానే అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన లావ్రోవ్.. మనదేశంతో సంబంధాల బలోపేతంపైనా మాట్లాడారు. ఇండియా ఎలాంటి దిగుమతులను కోరినా.. సరఫరా చేసేందుకు రష్యా మొగ్గు చూపుతుందని ఆయన అన్నారు. సరిగ్గా ఇదే మాట అగ్రరాజ్యం అమెరికాకు మంట పుట్టించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతులను గణనీయంగా పెంచుకోబోతోందని కథనాలు ఇదివరకే మొదలయ్యాయి. ఇదే జరిగితే అది రష్యాకు అనుకూలంగా మారుతుందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదేశంపై తాము విధించిన ఆంక్షలు నిష్పలమవుతాయని అమెరికా ఆందోళన చెందుతోంది. కానీ.. సువిశాల భారత దేశంలో 140 కోట్ల ప్రజానీకం అవసరాలకు అనుగుణంగా ముడిచమురును అందుబాటులో వుంచాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై వుంది. అదేసమయంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో చాలా దేశాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీలంక అయితే రావణకాష్టంగా మారింది. మనదేశంలోను మార్చి మూడో వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరలను నియంత్రించాలంటే రష్యా 35 శాతం డిస్కౌంట్‌తో ఆఫర్ చేసిన ముడిచమురును దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. దిగుమతి విషయంలో భారత్ రష్యా ఆఫర్‌ను అంగీకరిస్తే దానిని ఆదేశ అనుకూల వైఖరిగానో.. యుక్రెయిన్ వ్యతిరేక వైఖరిగానో చూడాల్సిన అవసరం లేదు. విశాల భారత ప్రయోజనాల కోసమే రష్యా ఆఫర్‌ను స్వీకరించినట్లుగా భావించాలి. లేకపోతే మనదేశం ఆర్థిక ద్రవ్యోల్పణం దిశగా పయనించడం ఖాయం. శ్రీలంక లాంటి చిన్న దేశంలో ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడితే.. ఏదేశమైనా ఆదుకోవచ్చు. కానీ భారత్ లాంటి రెండో అధిక జనాభా కలిగిన దేశంలో ద్రవ్యోల్పణానికి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల దారితీస్తే తట్టుకోవడం చాలా కష్టం. బహుశా అందుకే రష్యా ముడిచమురు ఆఫర్‌ను భారత్ ప్రభుత్వం అంగీకరిస్తోంది. ఇక్కడ లావ్రోవ్ చేసిన మరో ప్రకటనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ‘‘భార‌త్‌తో ఏ విష‌యంపైన అయినా చ‌ర్చించ‌డానికి కూడా సిద్దం.. అంతర్జాతీయ ఆదేశాలను సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.. భారత్​, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేశాం..’’ ఇది లావ్రోవ్ చేసిన ప్రకటన. ఈ ప్రకటన మనదేశం అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి గౌరవాన్ని పొందుతుందో చెప్పకనే చెబుతోంది.

చిరకాల మిత్ర దేశానికి ఏ మాత్రం దూరం జరగకుండానే.. యుక్రెయిన్‌తో వివాదాలను సైనిక చర్య ద్వారా కాకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇండియా రష్యా విదేశాంగ శాఖా మంత్రి లావ్రోవ్‌కు సూటిగా చెప్పింది. కారణం ఏదైనా మిలిటరీ ఆపరేషన్ కరెక్టు కాదని రష్యాకు సూచించింది. అదేసమయంలో ఇండియాకు ఏమంత మిత్రదేశం కానప్పటికీ.. యుక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి తటస్థంగానే వుంది. రష్యా మిత్ర దేశం కాబట్టి గుడ్డిగా ఆ దేశం చేపట్టిన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్‌ను ఇండియా సమర్థించడం లేదు. నిజానికి యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా మనదేశం రష్యా అనుకూల వైఖరిని తీసుకున్నా దాన్ని సమర్థించుకోగలిగిన కారణాలు మనకున్నాయి. ఎందుకంటే మనదేశం సైనిక సంపత్తిని పెంచుకునేందుకు, బలమైన దేశంగా మారేందుకు చేసిన ప్రతీ ప్రయత్నాన్ని యుక్రెయిన్ తప్పుపడుతూనే వస్తోంది. 1998 ఫోఖ్రాన్ అణుపరీక్షలను యుక్రెయిన్ వ్యతిరేకించింది. ఇండియాపై అమెరికా విధించిన ఆంక్షలను సమర్థించింది. ఐక్యరాజ్యసమితిలోను ఇండియాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ వ్యతిరేకించింది. ఈ కారణాలను ప్రస్తావించడం ద్వారా ఇండియా రష్యాకు అనుకూల ప్రకటన చేసి వుండొచ్చు. కానీ యుద్దాల విషయంలో వ్యతిరేకతను చాటుకుంటూ.. భారత ప్రభుత్వం తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. దాన్ని యుక్రెయిన్ కూడా అర్థం చేసుకున్నది కాబట్టే ఆదేశ ముఖ్యనాయకులు, భారత్‌లో యుక్రెయిన్ రాయభారి సైతం రష్యా సైనికచర్యను విరమించేలా ఇండియా ఒప్పించాలంటూ పలుమార్లు ప్రకటనలు చేశారు. కానీ అమెరికా మాత్రం ఇండియా, రష్యాల మైత్రిబంధం బలోపేతం అవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ముడిచమురు దిగుమతిని సాకుగా చూపించి ఆంక్షలు విధిస్తామంటూ హూంకరిస్తోంది.

అమెరికా బెదిరింపులకు భారత ప్రభుత్వం తలొగ్గే సంకేతాలు ప్రస్తుతానికి మాత్రం కనిపించడం లేదు. అదేసమయంలో రష్యా సైనిక చర్యను బహిరంగంగా సమర్థించనూ లేదు. అత్యంత కీలకసమయంలో మరింత జాగ్రత్తగా.. ఇంకా చెప్పాలంటే పకడ్బందీ వ్యూహంతో భారత్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా ఇదే భారత్‌కు భవిష్యత్తులో పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని ఇస్తుందేమో అన్న అభిప్రాయాలు అంతర్జాతీయ అంశాల విశ్లేషకుల నుంచి వినబడుతున్నాయి. భారత్ బలమైన దేశంగా మారుతుందనడానికి తాజాగా పదవీచ్యుతుడు కాబోతున్న దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తాయి. ఏ సందర్భం దొరికినా ఇండియా వైఖరిని తప్పు పట్టే పాక్ నోట .. మనదేశంపై పరోక్ష పొగడ్తలు వినబడడం ఆశ్చర్యం కలిగించకమానదు. రేపొ, ఎల్లుండో నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే పదవి కోల్పోబోతున్న ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ ఒకటిన దేశ భద్రతపై ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సెమినార్‌లో మాట్లాడారు. తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమంటూ మరోసారి అక్కసు వెళ్ళగక్కిన ఇమ్రాన్.. తాను యుక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రష్యా పర్యటనకు వెళ్ళడమే బైడెన్‌కు ఆగ్రహం తెప్పించిందన్నారు. అదేసమయంలో ఇండియా బలంగా మారిందనడానికి బ్రిటన్ ఉన్నతాధికారి చేసిన ప్రకటనను ఇమ్రాన్ ఉటంకించారు. ‘‘ హిందుస్థాన్‌కు ఓ శక్తివంతమైన దేశం మద్ద‌తిస్తూ మాట్లాడింది.. ఇండియా ఓ స్వ‌తంత్ర దేశ‌ం.. భారత్‌కు ఏమీ చెప్ప‌లేమ‌ని బ్రిట‌న్ విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి అన్నారు.. అయితే, భారత్‌కు మద్దతు ఇచ్చినందుకు నాకేమీ బాధలేదు.. పాకిస్తాన్‌ నేతల వల్లే సమస్య’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇమ్రాన్ ఆవేదన వెనుక కారణమైదైనా కావచ్చు..కానీ ఇండియా ప్రబలమైన దేశంగా మారిందని చిరకాల శతృదేశం వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషంగా పరిగణించాలి. రష్యా సైనిక చర్యను సమర్థించకుండానే.. చర్చలకు రెడీ కావాలని సూచిస్తూనే మనదేశ ప్రయోజనాల కోసం ముడి చమురును దిగుమతి చేసుకోవడం నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక విదేశాంగ విదేశీ విధానానికి నిదర్శనమని చెప్పక తప్పదు.