Sri Lanka Crisis: శ్రీలంకలో దారుణ పరిస్థితులు.. సంచలన ప్రకటన చేసిన ఆ దేశ అధ్యక్షుడు..
Emergency in Srilanka: శ్రీలంకంలో పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆహారం, చమురు, విద్యుత్ కొరత..
Emergency in Sri Lanka: శ్రీలంకంలో పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆహారం, చమురు, విద్యుత్ కొరత.. పెరుగుతున్న ధరలతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏకంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే (Gotabaya Rajapaksa) ఇంటిని ముట్టడించారు. దీంతో దేశంలో పరిస్థితులు చేయిదాటుతుండటం, హింస చెలరేగుతుండటంతో గోటబయ రాజపక్స శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ గెజిట్‌ను విడుదల చేశారని స్థానిక మీడియా శుక్రవారం రాత్రి నివేదించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, సమాజానికి అవసరమైన సౌకర్యాల కల్పన, సేవల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని రాజపక్సే గెజిట్‌ను విడుదల చేసినట్లు డైలీ మిర్రర్ నివేదించింది. పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ (చాప్టర్ 40)లోని సెక్షన్ 2 ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం శ్రీలంక అధ్యక్షుడు గెజిట్‌ను జారీ చేశారని పేర్కొంది. అంతేకాకుండా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో ఆరు గంటల పాటు పోలీసు కర్ఫ్యూ కూడా విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పశ్చిమ ప్రావిన్స్‌లో అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 2 (రేపు) ఉదయం 6.00 గంటల వరకు పోలీసు కర్ఫ్యూ అమలులో ఉంటుంది అని పోలీసు ప్రతినిధి తెలిపినట్లు డైలీ మిర్రర్ తెలిపింది.
శ్రీలంక గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరతతో వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలసబాటపడుతున్నారు. నిరంతర విద్యుత్ కోతలతోపాటు పెరుగుతున్న నిత్యవసర ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇంధన కొరతతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో (Sri Lanka economic crisis) ప్రజలు గురువారం రాత్రి అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ వందలాది మంది లంకేయులు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కాస్త అర్ధరాత్రి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో పది మందికి తీవ్రగాయలయ్యాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో రాజపక్సే దేశంలో ఎమర్జెన్సీ విధించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: