Sri Lanka: శ్రీలంకలో టెన్షన్ టెన్షన్.. ఆర్థిక సంక్షోభంపై అధ్యక్షుడి భవనాన్నే ముట్టడించిన లంకేయులు..
Protest At Sri Lanka President's Home: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక కుదేలవుతోంది.
Protest At Sri Lanka President’s Home: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక కుదేలవుతోంది. దీంతో వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలసబాటపడుతున్నారు. నిరంతర విద్యుత్ కోతలు, పెరుగుతున్న నిత్యవసర ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. జలవిద్యుత్ కొరత నేపథ్యంలో రాత్రి వేళ విధి దీపాలను సైతం ఆర్పివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంధన కొరతతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో (Sri Lanka economic crisis) ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమంటూ ప్రజలు.. ఏకంగా అధ్యక్షుడి భవనాన్నే ముట్టడించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై శ్రీలంక వాసులు గురువారం రాత్రి కొలంబోలోని అధ్యక్షుడు గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. రాజపక్స రాజీనామా చేయాలంటూ వందలాది మంది లంకేయులు గళమెత్తారు. ఈ నిరసన కాస్త అర్ధరాత్రి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడగా.. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నట్లు శ్రీలంక మీడియా తెలిపింది.
మొదట.. రాజపక్స ఇంటి వద్దకు చేరుకోని నినాదాలు చేస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. ఇది ప్రభుత్వ వైఫల్యమేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో రాజపక్సే ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపాయి. అయితే.. ఈ కాల్పుల్లో రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారా..? లేదా.. నిజమైన బుల్లెట్లను ఉపయోగించారా అనేది స్పష్టంగా తెలియరాలేదు. నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు.
కొలంబోలోని మిరిహానా రెసిడెన్షియల్ క్వార్టర్‌లోని రాజపక్సే ఇంటికి వెళ్లే లేన్‌కి అడ్డంగా నిలిపి ఉంచిన ఆర్మీ బస్సుకు, అలాగే పోలీసు వాహనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతోపాటు భద్రతా దళాలపై రాళ్లు కూడా రువ్వారు. నిరసన సమయంలో రాజపక్సే ఇంట్లో లేరని, అయితే సంక్షోభంపై చర్చించేందుకు సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. హింసాకాండ నేపథ్యంలో రాజధానిలో నిరవధిక కర్ఫ్యూను విధించారు. రాజపక్సే ఇంటి చుట్టూ కఠిన భద్రతను ఏర్పాటు చేశారు. నగరం అంతటా భద్రతా బలగాలను మోహరించారు.
కరోనా నాటినుంచి..
శ్రీలంకలో (COVID-19) మహమ్మారి నుంచి పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. దీంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. దీంతోపాటు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కూడా దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. శ్రీలంక ప్రస్తుతం విదేశీ మారకద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఇంధనం, విద్యుత్, గ్యాస్, ఆహారం కొరతకు దారితీసింది. దీంతో శ్రీలంక ఆర్థిక సహాయం చేయాలంటూ మిత్ర దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలో భారత్ కూడా శ్రీలంకకు ఆపన్నహస్తం అందించింది. 1 బిలియన్ డాలర్ల రుణాన్ని శ్రీలంకకు అందించనున్నట్లు భారత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: