iran israel war: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా?

ఇజ్రాయెల్ దాడి చేస్తే.. ఇరాన్ తట్టుకోగలదా? తిరిగి ప్రతిఘటించగలదా? ఎందుకంటే.. ఇరాన్ దగ్గరున్న వైమానికదళం ఇజ్రాయెల్ తో పోటీ పడలేదు. దీని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంతంతమాత్రమే. పోనీ వేరే దేశాలు ఏమైనా హెల్ప్ చేస్తాయా అంటే.. పశ్చిమదేశాల ఆంక్షల వల్ల చాలా ఏళ్లుగా ఇరాన్ ఇబ్బందులు పడుతోంది. అయినా ఇరాన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఏమిటి?

iran israel war: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా?
Iran Isreal War
Follow us
Gunneswara Rao

|

Updated on: Oct 17, 2024 | 9:08 PM

ఇరాన్ పై ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది. తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అదును కోసం వేచి చూస్తోంది. ఈసారి ఇరాన్ పై దాడి చేయడమంటూ జరిగితే.. ఆ దేశం అస్సలు కోలుకోలేకుండా ఉండేలా దెబ్బ తీయాలని పక్కా స్కెచ్ ను రెడీ చేస్తోంది. ఇరాన్ లో ఏఏ ప్రాంతాల్లోని.. ఏఏ స్థావరాలపై అటాక్ చేయాలో ఇప్పటికే ప్లాన్ ను రెడీ చేసింది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఏమాత్రం వెనక్కు తగ్గడానికి నెతన్యాహూ టీమ్ అస్సలు సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ దళాలు కూడా దాడి చేయడానికి ఊవ్విళ్లూరుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే.. నవంబర్ 5 లోపే అటాక్ చేయాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్. అంటే రెండు నుంచి మూడు వారాల లోపే ఇజ్రాయెల్ తన ప్లాన్ ను అమలు చేయబోతోందని అర్థమవుతోంది. మరి ఈ దాడి జరిగితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే మిగిలిన దేశాలు దానికి సిద్ధమవుతున్నాయా? అమెరికాతో పాటు.. ఇతర దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి? యుద్ధమంటూ జరిగితే.. మన దేశం స్టాండ్ ఏమిటి? ఏ దేశాన్ని సపోర్ట్ చేయబోతోంది? లేక.. తటస్థంగా ఉంటుందా?

ఇరాన్ లో ఏఏ లక్ష్యాలను గురిపెట్టాలి అన్నదానిపై.. ఇజ్రాయెల్ సైన్యం బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దీనిని దేశ ప్రధాని నెతన్యాహుతోపాటు డిఫెన్స్ మినిస్టర్ కు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సో.. టార్గెట్స్ ఫిక్స్ అయినట్టే. ప్రభుత్వం ఎప్పుడు దాడి చేయమంటే.. అప్పుడు అటాక్ మొదలుపెట్టడమే ఆలస్యం అని అర్థమవుతోంది. ఇరాన్ లో ఎక్కడెక్కడ దాడి చేస్తామన్నదానిపై ఇజ్రాయెల్.. ఇప్పటికే అగ్రరాజ్యానికి బ్రీఫింగ్ ఇచ్చిందని సమాచారం. దేశ పరిస్థితుల దృష్ట్యా కొన్ని వివరాల గురించి చెప్పకపోయినా.. ఆల్ మోస్ట్.. అమెరికాతో కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టే. కాకపోతే లాస్ట్ మినిట్ లో టార్గెట్స్ మార్చే అవకాశం లేకపోలేదు. ఇజ్రాయెల్ స్కెచ్ ను పసిగట్టినట్టే ఉంది ఇరాన్. అందుకే తమ జోలికి వస్తే తడాఖా చూపిస్తాం అని క్లియర్ కట్ గా చెబుతోంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే.. ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? దాడికి ఎలాంటి స్కెచ్ వేసింది?

దాడుల విషయానికి వస్తే, నెతన్యాహు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అలా ఎవరైనా అనుకున్నా అది కరెక్ట్ కాదనే చెప్పాలి. నిజానికి హెజ్ బొల్లా కన్నా.. ఇరాన్ పై దాడి చేయాలని.. దేశంలో ఆయనపై చాలా ప్రెజర్ ఉంది. అందుకే ఇప్పుడు ఇరాన్ పై దాడి కోసం యుద్ధతంత్రాలను సిద్ధం చేశారు. దళాలను రెడీ చేశారు. ఇజ్రాయెల్ సన్నాహాలు చూస్తుంటే.. పశ్చిమాసియాకు ముప్పు వాటిల్లక తప్పదా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు దేశాలు యుద్ధానికి దిగితే.. భారీ వినాశనం తప్పదు. ఇప్పుడు ఇతర దేశాల భయం కూడా అదే. నిజానికి ఇరాన్ పై దాడి చేస్తే.. ఆ దేశం ఊరికే కూర్చొనే పరిస్థితి లేదు. దాని నుంచి గట్టి ప్రతిఘటన తప్పదు. అయినా సరే వెనకడుగు వేయడానికి ఇజ్రాయెల్ ఇష్టపడడం లేదు. ఒకవేళ లెబనాన్, సిరియా, యెమెన్, గాజా.. వీటన్నింటితో ఒకేసారి సమరం చేయాల్సి వచ్చినా దానికి ఇజ్రాయెల్ రెడీగా ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే.. యుద్ధం ఎప్పుడు చేయాలి అన్నదానికన్నా.. ఆ దాడి ఎంత తీవ్రంగా ఉండాలన్న దానినే ఇజ్రాయెల్ ఆలోచిస్తున్నట్టుంది. అందుకే అది ఇరాన్ లో ఎక్కడెక్కడ దాడి చేయాలో ముందే ప్లాన్ చేసింది. దీనికోసం తమ గూఢచార సంస్థ మొసాద్ తో పాటు.. ఇరాన్ లో ఉన్న తమ ఏజెంట్లు ఇచ్చిన సమాచారం, అలాగే అమెరికా శాటిలైట్ల ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడిందని తెలుస్తోంది.

ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటే.. తొలుత ఇరాన్ క్షిపణి స్థావరాలను టార్గెట్ చేయచ్చు. అంటే వీటిని ప్రయోగించే ప్రాంతాలు, చమురు నింపే ప్రదేశాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, స్టోరేజ్ బంకర్ లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. వీటిని ఆపరేట్ చేసే వ్యక్తులు.. ఇలా ముఖ్యమైన వాటిపైన ఇజ్రాయెల్ ఫోకస్ పెట్టవచ్చు. ఇక అణ్వస్త్రాల సంగతిని చూస్తే.. ఇరాన్ దగ్గర అవసరానికి మించి… అంటే అణు విద్యుత్ కోసం అవసరమైన దానికంటే.. దాదాపు 20 శాతం ఎక్కువ యురేనియం ఉందని ఇజ్రాయెల్ అనుమానపడుతోంది. అలాగే.. అణుబాంబు తయారీ విషయంలోనూ దానిపై అనుమానాలున్నాయి. ఇక న్యూక్లియర్ బాంబ్ కు సంబంధించిన కార్యక్రమానికి కీలక స్థావరంగా చెప్పే పర్చిన్ తో పాటు మరికొన్ని కీలక ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దాడి అంటూ జరిగితే.. అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సర్కారు ఆస్తులతో పాటు పవర్ ప్లాంట్లు, పెట్రో కెమికల్ ప్లాంట్లు.. ఇలా ఈ లిస్టులో చాలా ఆస్తులు ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు మరికొన్ని కీలకమైన వాటిపైనా దాడులు జరగొచ్చు. వీటికి ఏం జరిగినా.. ఇరాన్ కు ఆర్థికంగా దెబ్బ తప్పదు.

ఇజ్రాయెల్ దాడి చేస్తే.. ఇరాన్ తట్టుకోగలదా? తిరిగి ప్రతిఘటించగలదా? ఎందుకంటే.. ఇరాన్ దగ్గరున్న వైమానికదళం ఇజ్రాయెల్ తో పోటీ పడలేదు. దీని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంతంతమాత్రమే. పోనీ వేరే దేశాలు ఏమైనా హెల్ప్ చేస్తాయా అంటే.. పశ్చిమదేశాల ఆంక్షల వల్ల చాలా ఏళ్లుగా ఇరాన్ ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ నమ్ముకున్నది బాలిస్టిక్ తో పాటు ఇతర మిస్సైళ్లనే. వీటితోపాటు ఎక్కడికైనా సరే.. పేలుడు పదార్థాలను తరలించే డ్రోన్లు కూడా దీనికి బలమే అని చెప్పాలి. ఇక మిలీషియాల సపోర్ట్ కూడా దీనికి అదనపు బలంగా కనిపిస్తోంది. మిలీషియాల గురించి చెప్పాలంటే.. 2019లో సౌదీ అరేబియా చమురు కేంద్రాల ఘటనను గుర్తు చేయాల్సి ఉంటుంది. అమెరికా ఐదో ఫ్లీట్ యుద్ధ నౌకను కూడా దెబ్బకొట్టగలిగే స్థాయిలో చిన్న నౌకలు ఉన్నాయి. ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. శత్రువును మట్టుబెడతాయి. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బ కొడతాయి. ఎలా అంటే.. హర్ముజ్ జలసంధిలో కాని ఇవి మందుపాతరలు పెడితే.. అంతే సంగతులు. ప్రపంచంలో ఆయిల్ ట్రాన్స్ పోర్టులో 20 శాతం రవాణాకు ఈ మార్గమే దిక్కు. సో.. ఈ మార్గం కాని మూసుకుపోతే.. కష్టమే. అందుకే ఇరాన్ పై యుద్ధం చేయాల్సి వస్తే.. దాని వల్ల కలిగే లాభనష్టాల విషయంలో ఇజ్రాయెల్ జాగ్రత్తగా ఆలోచిస్తోంది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి