UK PM Race: చరిత్రకు కొన్ని రౌండ్ల దూరం.. భారత సంతతి వ్యక్తి చేతికి బ్రిటన్‌ ప్రభుత్వ పగ్గాలు.. రిషి సునాక్ గురించి ఆసక్తికర విషయాలు

భారత దేశానికి వ్యాపారం కోసమంటూ వచ్చి.. దేశాన్ని ఆక్రమించుకుని దాదాపు 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిష్ వారిని ఇప్పుడు ఒక భారతీయ సంతతి పరిపాలించనున్నాడు. బ్రిటన్‌ ప్రధాని పదవి ఒక భారత సంతతి వ్యక్తికి దక్కితే అది చరిత్రలోనే చెరగని ఒక అపురూప ఘటనగా మిగిలిపోతుంది.

UK PM Race: చరిత్రకు కొన్ని రౌండ్ల దూరం.. భారత సంతతి వ్యక్తి చేతికి బ్రిటన్‌ ప్రభుత్వ పగ్గాలు.. రిషి సునాక్ గురించి ఆసక్తికర విషయాలు
Uk New Pm Elections
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2022 | 6:21 PM

UK PM Race: వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధాని ఎవరనేది  ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ప్రధాని ఎన్నికల పరిణామాలు నిజమైతే త్వరలో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. బ్రిటన్‌ పాలనా పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఇదే జరిగితే.. భారత దేశానికి వ్యాపారం కోసమంటూ వచ్చి.. దేశాన్ని ఆక్రమించుకుని దాదాపు 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిష్ వారిని ఇప్పుడు ఒక భారతీయ సంతతి పరిపాలించనున్నాడు. బ్రిటన్‌ ప్రధాని పదవి ఒక భారత సంతతి వ్యక్తికి దక్కితే అది చరిత్రలోనే చెరగని ఒక అపురూప ఘటనగా మిగిలిపోతుంది.

ఆధిక్యంలో రుషి: 

ఇప్పటికే మొదటి రెండు రౌండ్లలో ఆధిక్యం సాధించిన రిషి సునాక్‌…ఇక.. రిషి బ్రిటన్ ప్రధానమంత్రి కావాలంటే.. మరో మూడు రౌండ్లలో తన అధిక్యతను ప్రదర్శిస్తే సరిపోతుంది. రెండో రౌండ్‌ లో.. రిషి సునాక్‌కు 101 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న పెన్నీ మార్డాంట్‌కు 83 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న విదేశాంగ మంత్రి లిజ్ ట్ర‌స్ 64 ఓట్లు వచ్చాయి. కన్జర్వేటివ్‌పార్టీ నేత, బ్రిటన్‌ ప్రధాన మంత్రి పదవులకు జరిగే ఈ ఎన్నికలో ఆ పార్టీ ఎంపీలు పాల్గొంటారు. ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించి.. చివరికి ఒకరిని ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా జరిగే ఈ పోటీలో.. ఇద్దరు అభ్యర్ధులు మిగిలే వరకూ కౌంటింగ్‌ కొనసాగుతుంది. చివరగా మిగిలిన వ్యక్తే ప్రధాని అవుతారు. తొలి రౌండ్‌లో రిషి సునాక్‌కు 88 ఓట్లు, పెన్నీ మొరౌంట్‌కు 67, లిజ్ ట్రూస్‌కు 50 ఓట్లు వ‌చ్చిన సంగతి తెలిసిందే

ఇవి కూడా చదవండి

రిషి సునాక్‌ ఎవరంటే..?

రిషి సునాక్‌ పూర్వీకులది పంజాబ్‌. మొదట తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రిషి తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రాజకీయాల్లోకి అడుగు పుట్టకముందు కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు.

బ్రిటన్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ..

రుషి చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్‌ పార్టీలో కొంతకాలం ఇంటర్నిష్‌ చేశారు. 2014లో రాజకీయాల్లోకి పూర్తి స్తాయిలో ఎంట్రీ ఇచ్చారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. హిందువైన సునాక్‌.. పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి.. బోరిస్‌ జాన్సన్‌కు మద్దతిచ్చారు. దీంతో బోరిస్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. బోరిస్‌ జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో ‘రైజింగ్‌ స్టార్‌’ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిషి పని తీరు అందరిని ఆకట్టుకుంది. దీంతో 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌ గా పదవి లభించింది. 2020 మార్చిలో సునాక్‌ పార్లమెంట్‌లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

కరోనా సమయంలో అనేక నిర్ణయాలతో పాపులర్  కరోనా సంక్షోభ సమయంలో రిషి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే నిర్ణయాలను తీసుకుని అందరి ప్రశంసలను పొందారు. బిలియన్‌ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను ప్రకటించిన రిషి .  వ్యాపారస్తులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు తీసుకొచ్చారు. రిషి  తన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్‌ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అప్పట్లో ఆయన ఫొటోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేవి.

కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న సమయంలో ప్రధాని బోరిస్‌ ప్రవర్తన, పాలన తీవ్ర విమర్శలకు దారితీసింది. బోరిస తన సహచరులతో కలిసి నిబంధనలు విరుద్ధంగా పార్టీ చేసుకోవడం బ్రిటన్‌ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్ర విమర్శలతో పాటు.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపించింది. ఒకవేళ బోరిస్‌ దిగిపోవాల్సి వస్తే.. నెక్స్ట్ ప్రధాని ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ సమయంలో రిషికి ఉన్న పాపులారిటీతో ఆయన పేరు పీఎం రేసులో ఎక్కువగా వినిపించింది. బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ రిషి సునాక్‌ ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేశారు

వివాదాలు.. రిషి సునాక్‌ కి సంబంధించి కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల్లో ప్రధానమైనది.. భార్య అక్షతా మూర్తి పన్ను వివాదం. అక్షతా మూర్తిపై  వినిపించిన పన్ను ఎగవేత ఆరోపణలు సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ హోదాలో నివసిస్తున్నారు. ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఈ హోదా ఉన్నవారు  విదేశాల్లోని సంపాదనకు బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారంటూ ప్రతిపక్షాల ఆరోపణ చేశాయి, అయితే తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి అప్పట్లో తెలిపారు.

ఇదే విషయంపై అక్షతా మూర్తి స్పందిస్తూ..  ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా చట్టబద్ధమేనని తెలిపారు. భారత్‌ నుంచి వస్తోన్న సంపాదనపైనా ఇకపై పన్నులు కడతానని స్పష్టం చేశారు. ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను నుంచి ఏ మాత్రం ప్రయోజనం పొందబోనని తెలిపారు. తన భర్త పదవికి ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు అక్షితా మూర్తి

ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన రిషి.. తన భార్యపై వస్తోన్న ఆరోపణలను రిషి సునక్ ఖండించారు. ‘నేను నా దేశమైన బ్రిటన్‌ను ఎలా ప్రేమిస్తున్నానో.. నా భార్య కూడా తన మాతృ దేశమైన భారత్‌ను అలాగే ప్రేమిస్తోంది. భవిష్యత్తులో తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం అక్షత భారత్‌కు తిరిగి వెళ్తుంది. కానీ నేనెప్పటికీ బ్రిటన్ పౌరసత్వాన్ని వదులుకొను. నన్ను పెళ్లి చేసుకున్నందున నా భార్యను తను పుట్టిన దేశంతో బంధం తెంచుకోవాలనుకోవడం సరికాదు. నేను పరిచయం కావడానికి ముందే, ఈ దేశానికి రావడానికి ముందే తనకు ఆస్తులున్నాయి’ అని సునక్ వ్యాఖ్యానించారు.

యూకే ప్రభుత్వంతో ఇన్ఫోసిస్‌కు కాంట్రాక్ట్‌లు

యూకే ప్రభుత్వంతో ఇన్ఫోసిస్‌కు కాంట్రాక్ట్‌లు ఉండటంతో..రిషి కి ఇబ్బందికరంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. నారాయణ మూర్తి కుటుంబ వ్యాపారానికి రష్యాతో లింకులు ఉండటం పట్ల కూడా సునక్‌‌ను ప్రతిపక్షాలు వివాదాస్పద కామెంట్స్ చేశాయి. అయితే తనకు ఇన్ఫోసిస్‌తో ఎటువంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన భార్య అక్షతా మూర్తికి కూడా ఇన్ఫోసిస్ తీసుకునే నిర్ణయాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

బ్రిటన్ రాణి కంటే అక్షత ఆస్తులే ఎక్కువ.. అక్షతా మూర్తి ఆస్తులు బ్రిటన్ రాణి ఎలిజబెత్ కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌లో అక్షత షేర్ల వాటా దాదాపు ఒక బిలియన్ డాలర్లకు చేరువలో ఉండగా.. బ్రిటన్ రాణి వ్యక్తిగత సంపద 460 మిలియన్ డాలర్లుగా ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. 1980లో భారత్‌లో జన్మించిన అక్షత.. 2009లో రిషి సునక్‌ను పెళ్లాడారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసిన ఆమె.. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ డచ్ టెక్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. 2010లో అక్షతా డిజైన్స్ పేరిట ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు.

ధరల, పన్నుల వివాదాలు… కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సునాక్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించిన ఆయన.. తర్వాత ఖజానాపై భారం పడకుండా కొన్ని వర్గాలపై పన్నులు పెంచారు. దీనికి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోయాయి. ఓవైపు పన్నుల పెంపు.. మరోవైపు ధరల పెరుగుదల ప్రజల్లో అసహనానికి కారణమైంది. దీనికి రిషి నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.

ప్రధాని రేసులో మరికొందరు… తదుపరి ప్రధాని రేసులో రిషి సునాక్‌తో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్‌ పోటీ పడుతున్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, విదేశాంగ మంత్రి టిజ్‌ ట్రస్‌, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌,మాజీ మంత్రి కెమీ బుదెనోచ్‌, టామ్‌ టుగేన్‌థాట్‌ కూడా పోటీలో ఉన్నారు.

ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుల్లోని ఎవరైనా ముందుకు రావొచ్చు. ప్రధాని పదవి కోసం ఎంతమంది ఎంపీలైనా బరిలో నిలవొచ్చు. పోటీలోని వారి సంఖ్యను తగ్గించేందుకు అనేక రౌండ్లలో ఎన్నికను నిర్వహిస్తారు. ఇదంతా రహస్య బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో తమకు ఇష్టమైన అభ్యర్థికి చివరి ఓటు వరకు ఓటు వేసే వీలు ఎంపీలకు ఉంటుంది. ప్రతి రౌండ్ లోనూ.. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా సాగే రౌండ్లు.. చివరకు ఇద్దరు మిగిలే వరకు సాగుతూనే ఉంటుంది. తర్వాత దాదాపు 2 లక్షల మంది ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేస్తారు.ఈ తుది పోటీలో సభ్యులు.. అప్పటి వరకూ పోటీలో నిలిచిన ఇద్దరిలో ఎవరికి మద్దతితస్తే వారే ప్రధాని అవుతారు. మొత్తంగా బ్రిటన్ ప్రధానమంత్రి పదవి ఎంపిక అన్నది పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..