Imran Khan: కాల్పులపై తొలిసారిగా స్పందించిన మాజీ ప్రధాని.. ఏమన్నారో తెలుసా..
తనపై జరిగిన కాల్పులపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రన్ ఖాన్ స్పందించారు. తనకు దేవుడు పునర్జన్మ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారన్న ఆయన.. తన పోరాటాన్ని తిరిగి..

తనపై జరిగిన కాల్పులపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రన్ ఖాన్ స్పందించారు. తనకు దేవుడు పునర్జన్మ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారన్న ఆయన.. తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని వెల్లడించారు. తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని వివరించారు. ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ప్రసంగిస్తున్నారు. కంటైనర్ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ రెండు కాళ్లకు బుల్లెట్ తగిలి గాయమైంది. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని లాహోర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు వైద్యులు వివరాలు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకి గాయంతో పట్టి వేసుకొని ఆసుపత్రి బెడ్‌పై పడుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. ఈ ఘటనపై నిందితుడు మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్ ఖాన్‌ని చంపాలనుకున్నట్లు వెల్లడించాడు. లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నానని మండిపడ్డాడు. అందుకే ఆయన్ను చంపేందుకు ప్రయత్నించినట్టు వివరించాడు. ఇమ్రాన్ ఖాన్‌ను మాత్రమే తాను చంపాలనుకున్నానని, ఇంకెవరినీ కాదని స్పష్టం చేశాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఒక్కడినేనని, తనతో ఇంకెవరూ లేరని సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఈ ఘటనను పీఎంఎల్ – ఎన్ అధినేత, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి