Kishan Reddy: ఫామ్‌హౌజ్ సీఎం రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే చప్పగా ఉంది.. పాత ముచ్చటను పదే పదే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు..
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నేతల కొనుగోలు వ్యవహారం అగ్గిరేపుతోంది. కేసీఆర్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే చప్పగా ఉంది...ముందు ముందు కేసీఆర్ చూపించబోయే సినిమా కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్,బీజేపీ మధ్య ఓ రేంజ్‌లో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. అసలు ఆ వీడియోలో ఎక్కడ కూడా బీజేపీ నేతల ప్రస్తావనే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా అని ప్రశ్నించారు.. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో ఫామ్‌హౌజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ముచ్చటను పదే పదే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ కీలక నేతలైన అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోశ్లపై కేసీఆర్ చేసిన ఆరోపణలు అర్థరహితమని ఆయన ఖండించారు. కేసీఆర్ చూపించిన వీడియోలో ఉన్నవారితో.. బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి దాన్ని నిజం అని చెప్పేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.
మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీ నాయకులు లేరన్నారు…టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే దౌర్భాగ్యం బీజేపీకి లేదన్నారు.అంతా ఊహాజనితం అన్నారు కిషన్‌రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం బలహీనమైన ప్రభుత్వామా? రోహిత్ రెడ్డి నిజాయితీ పరుడా? తెలంగాణ రత్నాలు ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఇతర పార్టీ నాయకులను చేర్చుకునే శక్తి మాకు లేదా? స్వామిజీలు మాకు అవసరామా? బ్రోకర్లు అవసరమా? మీకు అవసరం ఏమో,,,మాకు లేదన్నారు కిషన్‌రెడ్డి. ఫాంహౌస్‌లో పడుకునే మీరు ప్రజాస్వామ్యం గురించి మీకు మాట్లాడే హక్కు లేదన్నారు.
పవన్‌కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ..
పవన్‌కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం తప్పన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దర్యాప్తు జరపాలన్నారు. రెండు రాష్ట్రాలు కోరితే మేం దర్యాప్తు చేస్తామన్నారు. పవన్‌కల్యాణ్‌కు భద్రత పెంచాలని కోరారు ఎంపీ సీఎం రమేష్. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే రెక్కీ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పార్టీ కార్యకర్తలా మారిన పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు సీఎం రమేష్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం