ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి.. భారత్ కంటే అక్కడే ఎందుకు అలా..?
మన దేశంలో ఎండలు 48 డిగ్రీలు దాటినా రాని రచ్చ... ఐరోపా ఖండంలో 43 డిగ్రీలకే ఎందుకు వస్తోంది? అక్కడ జనం ఎందుకు అంతలా అల్లాడిపోతున్నారు? ఎండ వేడికి రోడ్ల మీద గుడ్లు ఫ్రై అవుతున్న వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రస్తుతం ఐరోపా ఖండం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోంది. పలు దేశాల్లో ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి.. ఏకంగా 43 నుండి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రోడ్లపై ఎండ వేడికి గుడ్లు ఫ్రై అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తీవ్రమైన పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జూన్ 21 నుంచి గడిచిన 9 రోజుల్లోనే ఐరోపాలో ఎండల దెబ్బకు 13,000 మందికి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుందని WHO హెచ్చరించింది.
మన దగ్గర 48 డిగ్రీల ఉన్నా లేని రచ్చ.. అక్కడ 43 డిగ్రీలకే ఎందుకు?
యూరప్ ఎండలపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఒక భారతీయ నెటిజన్ ప్రశ్నిస్తూ.. ‘‘భారత్‌లో ఎండలు 48 డిగ్రీలు తాకినా ఇంత రచ్చ చేయం.. యూరప్‌లో 43 డిగ్రీలకే ఎందుకు అంత గోల చేస్తున్నారు?’’ అని అడిగాడు. దీనికి ఎనర్జీ అండ్ క్లైమేట్ పాలసీ నిపుణుడు సిద్ధార్థ్ సింగ్ శాస్త్రీయంగా సమాధానమిచ్చారు. థర్మామీటర్‌లో నంబర్ ఒకటే అయినప్పటికీ.. భౌగోళిక పరిస్థితులు, గృహ నిర్మాణాలు, వాతావరణ పద్ధతుల వల్ల భారత్‌లో 43 డిగ్రీలకు, యూరప్‌లో 43 డిగ్రీలకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుందని ఆయన వివరించారు. భారత్‌లో కూడా 43 డిగ్రీల ఎండలకు పేదలు, రేకుల ఇళ్లలో ఉండేవారు తీవ్రంగా నరకం చూస్తున్నారని.. కాకపోతే మన దగ్గర హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అంతగా రిపోర్ట్ కావడం లేదని ఆయన అన్నారు.
సూర్య కిరణాల కోణం
యూరప్ భూమధ్యరేఖకు చాలా దూరంగా, ఉత్తరంగా ఉంది. భారత్‌లో సూర్యుడు నెత్తిమీద నుండి నిట్టనిలువుగా కిరణాలను ప్రసరింపజేస్తాడు. కానీ యూరప్‌లో సూర్యకిరణాలు ఒక కోణంలో పడతాయి. దీనివల్ల అక్కడ పగటి సమయం చాలా ఎక్కువగా ఉండి, రోజంతా ఇళ్లు, రోడ్లు తీవ్రమైన సోలార్ లోడ్‌ను నిరంతరాయంగా పీల్చుకుంటాయి.
భారతదేశ కాలుష్యం.. సూర్యుడికి ఒక కవచం
భారతదేశ వాతావరణంలో దుమ్ము, ధూళి, పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సూర్యకిరణాలను కొంతవరకు అడ్డుకుని, చెల్లాచెదురు చేస్తాయి. అందుకే ఇక్కడ ఎండ నేరుగా చర్మానికి గుచ్చుకోదు. కానీ యూరప్‌లో ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా చాలా తీవ్రంగా చర్మాన్ని కాల్చేస్తాయి.
గాలి ఆడకపోవడం
ఇటీవలి కాలంలో యూరప్‌లో సంభవిస్తున్న హీట్‌వేవ్స్ సమయంలో గాలి అస్సలు వీచడం లేదు. చెట్ల ఆకులు కూడా కదల్లేనంత జీరో విండ్ పరిస్థితులు ఉండటం వల్ల ఉక్కపోత పెరిగి, ఊపిరి ఆడనంత ఊపిరాడకుండా చేస్తోంది.
ఇళ్ల నిర్మాణం చలి కోసం.. ఎండ కోసం కాదు..
యూరప్‌లోని ఇళ్లను వందల ఏళ్లుగాచలిని తట్టుకునేలా.. వేడిని లోపలే పట్టి ఉంచేలా నిర్మించారు. చెక్క ఫ్లోరింగ్, ఇన్సులేటెడ్ గోడలు, ముదురు రంగు పైకప్పులు వేడిని లోపలే బంధిస్తాయి. మన భారత్‌లో ఇళ్లు ఎండలను తట్టుకునేలా గాలి ఆడేలా కడతాం. కానీ యూరప్ ఇళ్లు వేసవిలో ఓవెన్‌లా మారిపోతాయి.
ఏసీలు లేకపోవడం
భారత్‌లో ఎండలను తట్టుకోవడానికి ఏసీలు, కూలర్లు వాడుతుంటాం. కానీ యూరప్‌లో గతంలో ఎన్నడూ ఇంతటి వేడి లేకపోవడం వల్ల 90శాతానికి పైగా ఇళ్లలో అసలు ఏసీలే ఉండవు. పైగా అక్కడి అర్బన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం ఇళ్ల బయట ఏసీ కంప్రెసర్లు పెట్టడానికి చారిత్రక భవనాల రూపాన్ని బట్టి అనుమతులు కూడా ఉండవు.
ఐరోపా అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం
WHO చీఫ్ టెడ్రోస్ ప్రకారం.. ప్రపంచ సగటు పెరుగుదల కంటే రెండు రెట్లు వేగంగా ఐరోపా ఖండం వేడెక్కుతోంది. ప్రస్తుతం 15 కోట్ల మంది ప్రజలు అక్కడ తీవ్రమైన ఎండల నడుమ బతుకుతున్నారు. గ్రిడ్‌లు ఫెయిల్ అవుతున్నాయి, పాఠశాలలు మూతపడ్డాయి. గతంలో తరానికి ఒకసారి వచ్చే హీట్‌వేవ్స్.. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ప్రతి ఏటా వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టడానికి యూరప్ దేశాలు అత్యవసరంగా హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్స్ అమలు చేయాలని WHO పిలుపునిచ్చింది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని కాపాడుకుంటూ, నగరాల వేడిని తగ్గించేలా ప్రణాళికలు వేయకపోతే ఈ సైలెంట్ కిల్లర్ మరిన్ని ప్రాణాలను బలిగొంటుందని హెచ్చరించింది.
