Helicopter Crash: ఘోర విషాదం.. హెలికాప్టర్ కూలి 14 మంది మృతి
సౌదీ అరేబియాలోని రాస్ తానూరా ప్రాంతంలో సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా సౌదీ జాతీయులేనని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించిన కీలక చమురు టెర్మినల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

సౌదీ అరేబియాలోని ప్రముఖ చమురు సంస్థ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం తూర్పు ప్రావిన్స్‌లోని రాస్ తానూరా ప్రాంతంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది మృతి చెందినట్లు సౌదీ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. మృతులందరూ సౌదీ జాతీయులేనని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనపై సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా, హెలికాప్టర్‌లో ఉన్న వారిని రక్షించలేకపోయాయి. హెలికాప్టర్ ఎందుకు కూలిందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేదా మరేదైనా కారణమా అనే కోణాల్లో సంబంధిత అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.
రాస్ తానూరా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఈ టెర్మినల్ ద్వారా సౌదీ అరేబియా భారీ స్థాయిలో ముడి చమురును ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇటీవల మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అక్కడి కార్యకలాపాలు దాదాపు నాలుగు నెలల పాటు ప్రభావితమయ్యాయి. అయితే పరిస్థితులు కొంతమేర సాధారణ స్థితికి రావడంతో గత శుక్రవారం నుంచి రాస్ తానూరా టెర్మినల్‌లో చమురు లోడింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇలాంటి కీలక సమయంలో అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా ప్రస్తుతం చమురు సరఫరాలను వేగవంతం చేసే ప్రయత్నాల్లో ఉండగా, ఈ ప్రమాదం చమురు రంగంలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
