Sitrang: సిత్రాంగ్ ఎఫెక్ట్.. 16 మంది మృతి.. విద్యా సంస్థలకు సెలవు..
సిత్రాంగ్ చుక్కలు చూపుతోంది. బంగ్లాదేశ్‌పై తుపాన్ విరుచుకుపడుతోంది. సైక్లోన్ ధాటికి విలవిల్లాడుతోంది బంగ్లా. బంగ్లాదేశ్‌పై సిత్రాంగ్ ఎఫెక్ట్ భారీగానే ఉంది. సిత్రాంగ్ తుపాన్ ప్రభావంతో...

సిత్రాంగ్ చుక్కలు చూపుతోంది. బంగ్లాదేశ్‌పై తుపాన్ విరుచుకుపడుతోంది. సైక్లోన్ ధాటికి విలవిల్లాడుతోంది బంగ్లా. బంగ్లాదేశ్‌పై సిత్రాంగ్ ఎఫెక్ట్ భారీగానే ఉంది. సిత్రాంగ్ తుపాన్ ప్రభావంతో బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాజధాని ప్రాంతం ఢాకా తుపాన్ ధాటికి అల్లాడుతోంది. కుండపోత వానలతో ఢాకా నగరం జలమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలో పలు ఇళ్లల్లోకి వరద వచ్చి చేరింది. వరదల ధాటికి జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటి వరకూ బంగ్లాలో 16 మంది చనిపోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది జనాలు ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరిగాయి. దాదాపు 15 జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది మంది చిమ్మచీకట్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
వరద ప్రభావంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. దక్షిణ బంగ్లాదేశ్‌లో తీరం దాటింది సిత్రాంగ్ తుపాన్. తీరం దాటిన సమయంలో భారీ ఈదురుగాలులు వీచాయి. గాలుల తీవ్రతకు జనం వణికిపోయారు. తుపాన్ తీవ్రతను ముందుగానే పసిగట్టిన బంగ్లా ప్రభుత్వం లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఫలితంగా ప్రాణ నష్టం భారీగా తప్పింది. ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీరాన్ని తాకిన తుపాను పలు చోట్ల విధ్వంసం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ తుఫానులో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. బర్గునా, నరైల్, సిరాజ్‌గంజ్ జిల్లాలు, భోలా ద్వీప జిల్లాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..