Donald Trump: అగ్రరాజ్యంలో.. తెలుగోడి ఆకలిరాజ్యం! బయటికొస్తే ఖేల్‌ఖతం

అక్రమ వలసదారులకు అమెరికాలో బేడీలు . ఇప్పటివరకు 3వేలమందికిపైనే అరెస్ట్‌. యుద్ధఖైదీల్లా తరలింపు. విదేశాల నిరసన భారతీయుల పరిస్థితేంటి? బిక్కుబిక్కుమంటున్న మన విద్యార్థులు. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ. పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ని నమ్ముకున్న మన స్టూడెంట్స్‌ పరిస్థితేంటి? ఆ వివరాలు

Donald Trump: అగ్రరాజ్యంలో.. తెలుగోడి ఆకలిరాజ్యం! బయటికొస్తే ఖేల్‌ఖతం
Trump
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 28, 2025 | 10:00 PM

డాలర్‌డ్రీమ్స్‌. ఆ కలల సాకారానికే ఎంతోమంది అమెరికావైపు పరుగులు తీస్తుంటారు. ఫైనాన్షియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారు అక్కడి కాలేజీల్లో చేరి.. తర్వాత అక్కడే సెటిలవుతుంటారు. ఇంకొందరు జాబ్‌ సంపాదించి వర్కింగ్‌ వీసాతో అగ్రరాజ్యంలో వాలిపోవాలనుకుంటారు. ఈ రెండూ కుదరనివారు ఏదో ఒక రూట్లో అమెరికా వెళ్లిపోయి ఎక్కడోచోట తలదాచుకుని చివరికి అక్కడే స్థిరపడాలనుకుంటారు. ఇప్పుడు వీళ్లందరినీ ట్రంప్‌ రూపంలో బ్యాడ్‌లక్‌ వెంటాడుతోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని వెతికి పట్టుకుని ఇండియా పంపించేయాలని చూస్తున్నారు. స్టూడెంట్స్‌పై నిఘా పెరిగింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తుంటే వారినీ వదలడంలేదు. ఇక అన్నీ సక్రమంగా ఉన్నా ఎయిర్‌పోర్టులోనే నో ఎంట్రీ బోర్డుతో.. అగ్రరాజ్యంలో సరికొత్త సవాల్‌ ఎదుర్కుంటున్నారు ఇండియన్స్‌. అసలే తేడా. అందుకే వచ్చీరాగానే సర్దేసుకోండి పెట్టేబేడా అంటున్నారు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌. కాస్త టైమ్‌ ఇస్తారేమో అనుకున్నారు. నో.. నెవ్వర్‌.. అమెరికా ఫస్ట్‌ అంటూ అక్రమంగా ఉంటున్నవారిని ఏరిపారేసే పనిలో పడ్డారు. సరైన పత్రాలు లేనివారిని సంకెళ్లతో బంధించడమే కాదు వారిని వెనక్కి పంపేందుకు సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ విమానాల్ని అనుమతించేది లేదన్న దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించి దారికి తెచ్చుకుంటున్నారు. ట్రంప్‌ దెబ్బకు మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతోపాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్‌సాల్వడార్‌లాంటి దేశాలు అమెరికా చర్యలపై ఆగ్రహంగా ఉన్నా, ఆక్రోశం వెళ్లగక్కడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో అమానవీయంగా ఆర్మీ విమానాల్లో తరలించడాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న దేశాలు అమెరికా చర్యలతో తల పట్టుకుంటున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ప్రధాన ప్రచారాస్త్రమే అక్రమ వలసల అంశం. అందుకే వచ్చీరాగానే దేశంలో అనధికారికంగా ఉంటున్నవారిని వెతికెతికి పట్టుకుంటున్నారు. ఐస్‌.. కూల్‌ కాదు హాట్‌. అక్రమంగా వలసవచ్చిన, అనుమతి లేకుండా దేశంలో ఉంటున్నవారిని గుర్తిస్తోంది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌. ఐస్‌ దాడులతో అక్రమంగా ఉంటున్న ఇతర దేశాల ప్రజలే కాదు.. సరైన పత్రాలు లేని భారతీయులు కూడా వణికిపోతున్నారు. ఎఫ్‌ 1 వీసాలతో అమెరికాలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు.. ఎక్కడ తమను బలవంతంగా ఫ్లైట్‌ ఎక్కిస్తారోనని హడలిపోతున్నారు. యూనివర్సిటీలు, కోర్సులతో సంబంధం లేకుండా.. ఖర్చుల కోసం పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణం. ట్రంప్‌ ప్రమాణస్వీకారం తర్వాత గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారువారంతా. అధ్యక్షుడే ఆదేశించాక అధికారులు ఆగుతారా.. అనుమానమొస్తే చాలు ఇళ్లలోకైనా జొరబడుతున్నారు. ప్రార్థనామందిరాల్లోకి కూడా వచ్చేస్తున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. పైగా తాగడానికి నీళ్లుకూడా ఇవ్వలేదని, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారనే వార్తలతో అమెరికాలో ఉంటున్న వలస ప్రజల కంటిపై కునుకు లేదు. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రార్థనా మందిరాల్లో తనిఖీలపై సిక్కులు ఆగ్రహించినా.. ఎవరినీ ఉపేక్షించేది లేదనే సంకేతాలిస్తోంది అమెరికా. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఏరివేత ఆగదంటున్నారు ట్రంప్‌. సరైన పత్రాల్లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించినవారిని స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయంటున్నారు. దీంతో అక్కడి భారతీయులకు కూడా సెగ మొదలైంది. మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులైతే ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన కార్యాచరణ ప్రకటించారు డొనాల్డ్‌ ట్రంప్‌. తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని కోరుకునే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అక్రమ వలసదారులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని ఒక్క కలంపోటుతో రద్దుచేసి పడేశారు. దేశంలో విదేశీయుల ప్రవేశానికి కూడా కొత్త నిబంధనలు విధించింది అగ్రరాజ్యం. పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అమెరికా వచ్చేవారికి రిటన్‌ ఎయిర్‌ టికెట్‌ తప్పనిసరి చేసింది. ట్రంప్‌ ఆదేశాలతో రిటన్‌ టికెట్‌ లేదనే కారణంతో ఒక్కరోజే వందమంది భారతీయులు ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి రావాల్సి వచ్చింది. నిబంధనలకు అనుగుణంగాకనీసం 3వేల డాలర్లు లేని మరో వంద మంది భారతీయుల్ని కూడా అమెరికా అనుమతించలేదు. డిపోర్టేషన్‌కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా.. వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో మానవవనరుల కొరత ఏర్పడుతుందనే ఆందోళన ఉన్నా తగ్గేదే లేదంటున్నారు ట్రంప్‌. వలసదారుల్ని వెనక్కి పంపే విషయంలో సున్నితంగా వ్యవహరించాలని కొందరు సూచిస్తున్నా.. కఠినవైఖరిని అవలంబిస్తున్నారు. అమెరికా పంపిన విమానాన్ని మెక్సికో మొదట అనుమతించలేదు. అయితే ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అమెరికా నుంచి అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా దిగుమతి వస్తువులపై 25శాతం టారిఫ్‌ విధిస్తామనే వార్నింగ్‌తో దిగొచ్చింది. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగటంతో అగ్రరాజ్యంలో ఏమూల చూసినా అలజడి.

ఇమ్మిగ్రేషన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​వైఖరి మొదట్నించీ కఠినమే. ఆయన ఫస్ట్‌టర్మ్‌లోనే ఇది కనిపించింది. ఇక రెండోసారి గెలిచినప్పుడే అగ్రరాజ్యంలో ఏ జరుగుతుందో చాలామందికి అర్ధమైపోయింది. ట్రంప్​ప్రమాణస్వీకారానికి ముందే భారతీయ విద్యార్థుల్లో చాలామంది పార్ట్ టైమ్​జాబ్స్‌ మానేశారు. మిగిలినవారు ఈ వారంరోజులుగా జాగ్రత్తపడుతున్నారు. అగ్రరాజ్యంలో అనిశ్చితి భారతీయ విద్యార్థులను మానసికంగా కుంగదీస్తోంది. ఆదాయవనరులు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడుతున్నారు. వీసా ఉన్నా సవాలక్ష కొర్రీలు. ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని వెంటాడుతున్న డేగకళ్లు. భారత్‌తో భాయీభాయీనే. కానీ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుంది ట్రంప్‌ తెంపరితనం. వారంరోజుల్లోనే ఆయన విశ్వరూపం చూసి బాబోయ్‌ అనేస్తున్నారంతా. టెంపరరీ జాబ్స్‌ మానేసి మన విద్యార్థులు జేబులు తడుముకుంటున్నారు. డాలర్స్‌ డ్రీమ్స్‌ కరిగిపోతుంటే.. దినమొక గండంగా అగ్రరాజ్యంలో రోజులు లెక్కబెట్టుకుంటున్నారు.

నిన్నటిదాకా కాస్త కష్టపడితే బతికేదెలాగన్న చింత లేదు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ దొరకదన్న బెంగ లేదు. కానీ వారంరోజుల్లోనే అంతా మారిపోయింది. కాదు ట్రంప్‌ మార్చేశారు. అమెరికన్ల దృష్టిలో హీరోగా మిగిలిపోవడానికి.. మిగిలిన దేశాలకు విలన్‌గా మారిపోతున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకున్నా, అనుమతి లేకుండా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసినా మీ దేశాలకు పార్శిల్‌ చేస్తామంటున్నారు. అగ్రరాజ్యంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అచ్చం ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. తెలుగురాష్ట్రాల్లోనే ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎందుకంటే ఏ మూల చూసినా ఏళ్లుగా మనోళ్లే. అలాంటిది ట్రంప్‌ సెకండ్‌ టర్మ్‌తో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తుపై భయం పట్టుకుంది మన భారతీయులకి. అమెరికాలో మూడున్నర లక్షలమందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. యూఎస్‌లోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 29శాతం మన భారతీయులే. వారిలో 56శాతం తెలుగు విద్యార్థులే. వీరిలో తెలంగాణ నుంచి దాదాపు 34శాతం, ఏపీ నుంచి 22శాతం మంది విద్యార్థులున్నారని అంచనా. హైదరాబాద్‌ కాన్సులేట్‌లో 2023తో పోలిస్తే 2024లో స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలు 30శాతం పెరిగాయి. ఈ ఏడాది ఇంకా పెరుగుతుందనుకున్న టైంలో ట్రంప్‌ దెబ్బకి అంతా ఉల్టాపల్టా అయ్యేలా ఉంది.

అమెరికాలో 50లక్షలమంది భారతీయులు నివసిస్తుంటే వారిలో 21శాతం మంది దగ్గర సరైనపత్రాలు లేవనే అంచనాలున్నాయి. 7లక్షల 25వేల మంది భారతీయులు తమ దేశంలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది అమెరికా అధికారయంత్రాంగం.వారిలో 18వేల మందితో జాబితా తయారుచేసింది. హెచ్‌1 బీ వీసాల్లో 70శాతం భారతీయులే. 2024లో అమెరికా పౌరసత్వం పొందినవారిలో మెక్సికో తర్వాత మనోళ్లే ఎక్కువ. అమెరికా ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర ఇండియన్స్‌దే. అయినా మనవాళ్ల విషయంలో ట్రంప్‌ సానుకూలంగా వ్యవహరిస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. పైగా గడచిన మూడేళ్లలో సగటున 90వేలమంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు. అందుకే ట్రంప్‌ నిర్ణయాలతో భారతీయుల్లో అలజడి పెరుగుతోంది. అమెరికాలో స్థిరపడాలన్న ఆశతో వచ్చారు. పార్ట్‌టైమ్‌ జాబ్స్‌తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు గడపదాటే పరిస్థితి లేదు. ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. అమెరికానుంచి పంపించేయకపోతే అంతే చాలన్నట్లుంది మన తెలుగు విద్యార్థుల పరిస్థితి. ఇన్నాళ్లూ పెద్దగా అభ్యంతరాలు లేకపోవటంతో బయట పార్ట్‌టైమ్‌ జాబ్స్‌తో ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఆకలికేకలు మొదలయ్యేలా ఉన్నాయి. స్వదేశంలో ఎడ్యుకేషన్‌లోన్‌తో అమెరికా విద్యాసంస్థల్లో చదువుకుంటూ పార్టీ టైమ్‌ జాబ్స్‌ చేస్తున్నవారికి ఇప్పుడు దిక్కుతోచడం లేదు. ఒకప్పుడు గంట పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తే 15 డాలర్లదాకా ఆదాయముండేది. బ్యాంక్‌ లోన్‌ వచ్చింది.. ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫీజ్‌ ఉంటే చాలు ఏదోలా బతికేయొచ్చనే నమ్మకంతో అగ్రరాజ్యానికి చేరితే ట్రంప్‌ దెబ్బతో కలలు కరిగిపోతున్నాయి.

అమెరికాలో చదువుతున్న చాలామంది విద్యార్థులు ఎఫ్‌-1 వీసాపై ఉన్నారు. వారు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఆయా క్యాంపస్‌లలోనే పనిచేయాలనే నిబంధన ఉంది. ఆ రూల్‌ని అతిక్రమిస్తే అమెరికా దౌత్య విధానం ప్రకారం వారిని దేశం నుంచి పంపేయొచ్చు. అయితే క్యాంపస్‌లలోనే అందరికీ ఉద్యోగాలు దొరకవు. అందుకే అక్కడికెళ్లే విద్యార్థులు రెస్టారెంట్లు, పెట్రోల్‌ పంప్‌లు, రిటైల్‌ స్టోర్లలో అనధికారికంగా పని చేస్తుంటారు. ఇప్పుడు అలాంటిచోట నిఘా పెరిగింది. తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో స్టూడెంట్స్‌ క్యాంపస్‌ గేటు దాటాలంటే భయపడుతున్నారు. చదువు పూర్తిచేస్తే మంచి జాబ్‌ వస్తుందనే ఆలోచనకంటే, ఏదో ఒక పనిచేస్తూ చదువుకోవచ్చనే ఆశతోనే ఎక్కువమంది ఛలో అమెరికా అంటున్నారు. అలాంటివారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న డల్లాస్‌లాంటి చోట నిఘాపెట్టి ఇప్పటికే కొందరిని లిఫ్ట్‌ చేశారు. అక్కడి రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఎక్కువమంది తెలుగోళ్లే. ఇదివరకు తెలుగు విద్యార్థులను తక్కువ డబ్బుకు పనిచేయించుకుంటూ మనోళ్లే శ్రమదోపిడీకి పాల్పడేవారు. ఇప్పుడు గంటకు పాతిక డాలర్లు ఇస్తామన్నా పనిచేయడానికి స్టూడెంట్స్‌ దొరకడం లేదు. ఏదో ఒక పనిచేసుకోకపోతే పూటగడవదనుకునే వాళ్లు మాత్రం.. బిక్కుబిక్కుమంటూ దినదినగండంగా పనిచేస్తున్నారు.

కొలంబియా, బ్రెజిల్‌, మెక్సికో.. ఇవన్నీ అమెరికా చిటికేస్తే భయపడే దేశాలు. కానీ భారత్‌తో అగ్రరాజ్యానికి మొదట్నించీ బలమైన బంధం ఉంది. ఫస్ట్‌ టర్మ్‌లో మన దేశంతో ట్రంప్‌ సంబంధాలు బాగున్నాయి. అదే బంధం కొనసాగుతుందా అంటే అప్పుడే అవునని చెప్పలేని పరిస్థితులున్నాయిప్పుడు. అమెరికా ఫస్ట్ అనే స్లోగన్‌తో వెళ్తున్నారు ట్రంప్‌. ఆల్రెడీ అమెరికాలో వైట్‌ వర్సెస్‌ బ్రౌన్‌ అనే నినాదం నడుస్తోంది. వాస్తవానికి మన స్టూడెంట్స్‌ ఎవరూ ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ కాదు. లీగల్‌గానే అక్కడికెళ్లినా కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. రాజకీయ కార్యకలాపాలు, అభిమానసంఘాలు, వ్యక్తిగత వివాదాలతో బయటివారు సిస్టమ్‌ని కలుషితం చేస్తున్నారనే అభిప్రాయం అక్కడ ఉంది. అందుకే.. ట్రంప్‌ టూవోలో కేవలం చదువులకోసం అయితేనే యూఎస్‌ ఓకే. పార్ట్‌టైమ్‌ జాబ్స్‌తో ఏదోలా సెటిలవుదామనుకుంటే మాత్రం ఇకపై కష్టమే. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ.. ఎలాంటి అనుమానం వచ్చినా డిపోర్టేషన్‌ చేస్తున్న అమెరికా.. ముఖ్యంగా మెక్సికన్లు, భారతీయులను టార్గెట్‌ చేసింది. అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని మన దేశం సమర్థించింది. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలసదారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే స్వాగతిస్తామన్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌. మరోవైపు వచ్చే నెల్లో ప్రధాని మోదీ అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంది.ట్రంప్‌కి ప్రధాని మోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆలోపు మనోళ్ల విషయంలో ట్రంప్‌ కాస్త మెతకవైఖరితో వ్యవహరిస్తారా.. తమ్ముడే తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఏరేస్తారా అన్నదే ప్రశ్న.

భారతీయ విద్యార్థులు పార్ట్‌టైమ్స్‌ జాబ్స్‌ చేసుకునేలా చట్టంలో ట్రంప్‌ ఏమన్నా సవరణలు తీసుకొస్తారా అన్న ఆశలు కూడా కొందరికున్నాయి. కానీ ఆశదోశ అప్పడం వడ. అసలే ట్రంప్‌. మహాఅయితే బేడీల్లాంటివి వేయకుండా డ్రాపింగ్‌ ఫెసిలిటీ ఏమన్నా ఇస్తారేమోగానీ.. మీ ఇష్టం దున్నేసుకోండనేంత పెద్ద మనసు చేసుకోకపోవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి