పాకిస్తాన్ లోని హోటల్ లో బాంబు పేలుడు, నలుగురు మృతి, పలువురికి గాయాలు
పాకిస్తాన్ లోని క్వెట్టా సిటీలో గల ఓ ప్రముఖ హోటల్ పార్కింగ్ ప్రదేశంలో జరిగిన బాంబు పేలుడులో నలుగురు మరణించారు. 12 మందికి పైగా గాయపడ్డారు.

పాకిస్తాన్ లోని క్వెట్టా సిటీలో గల ఓ ప్రముఖ హోటల్ పార్కింగ్ ప్రదేశంలో జరిగిన బాంబు పేలుడులో నలుగురు మరణించారు. 12 మందికి పైగా గాయపడ్డారు. చైనా రాయబారి బస చేసిన ఈ హోటల్ పార్కింగ్ ఆవరణలో ఈ ఘటన జరిగిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని పాక్ హోమ్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. దీన్ని ఉగ్ర దాడిగా ఆయన అభివర్ణించారు. చైనా రాయబారితో సహా నలుగురు ప్రతినిధి బృంద సభ్యులు ఈ హోటల్లో బస చేశారు. వీరితో ఆ రాయబారి సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. బెలూచిస్థాన్ లోని సహజ వనరులను పాక్ ప్రభుత్వం, ఆర్మీ తమకు దక్కకుండా దోచుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇక్కడ తిరుగుబాటు జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జోరందుకున్నాయి. విపక్ష పార్టీల మద్దతుతో స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. బెలూచిస్థాన్ రాష్ట్ర రాజధాని అయిన క్వెట్టా లోకి చైనా నుంచి కొన్ని కోట్లాది డాలర్ల సొమ్ము అందుతోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఇలా ప్రతి నెలా చైనా డబ్బు ప్రవాహంలా వస్తోంది. కానీ ఈ సొమ్ము తమ ప్రయోజనాలకు దోహదపడడం లేదని స్థానికులు అంటున్నారు.
కాగా ఈ బాంబు పేలుడుకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. అటు ఈ ఘటన పట్ల చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్వెట్టా సిటీలో పలు లగ్జరీ హోటళ్లు ఉన్నాయి. సాధారణంగా వీటిలో చైనా నేతలు బస చేస్తుంటారు. వారిని చేసుకుని స్థానిక ఉగ్ర మూకలు దాడులకు దిగవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని చదవండి ఇక్కడ : Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు