Corona virus: ఇప్పటి వరకు టచ్ చేయని ఆ దేశాన్ని కూడా టచ్ చేసింది మాయదారి కరోనా..!
Corona virus: రెండు వేవ్‌ల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా మహమ్మారి. కానీ ఆ ఒక్క దేశం మాత్రం ఇప్పటివరకు బచాయించింది. ఇప్పుడు ఆ దేశాన్ని కూడా టచ్ చేసింది
Corona virus: రెండు వేవ్‌ల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా మహమ్మారి. కానీ ఆ ఒక్క దేశం మాత్రం ఇప్పటివరకు బచాయించింది. ఇప్పుడు ఆ దేశాన్ని కూడా టచ్ చేసింది మహమ్మారి. ప్రపంచ దేశాలను చుట్టేస్తూ అలజడి సృష్టిస్తోంది కొవిడ్ మహమ్మారి. కొత్త కొత్త వేరియంట్లతో.. ఎప్పటికప్పుడు సవాల్ విసురుతోంది. కట్టడి చర్యలు చేపడుతోన్నా, చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. అయితే, వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కొవిడ్ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్‌లో, శనివారం మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆ దేశంలో అలజడి మొదలైంది. ఇటీవలే కుటుంబంతో సహా అక్కడికి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్న ఓ పదేళ్ల బాలుడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు ఆ దేశ ప్రధాని మార్క్ బ్రౌన్. ఆ కుటుంబం న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు కుక్ ఐలాండ్స్ అధికారులు.
సుమారు 17 వేల జనాభా కలిగిన కుక్ ఐలాండ్స్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీకా రేటు కలిగి ఉన్న దేశాల్లో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంలో అర్హులైన వారిలో దాదాపు 96 శాతం మందికి రెండు డోసులూ వేశారు సిబ్బంది. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే కుక్ ఐలాండ్స్ ఇతర దేశాలతో రాకపోకలు తెంచుకుంది. ఇటీవలే జనవరి 14 నుంచి న్యూజిలాండ్‌తో క్వారంటైన్ రహిత ప్రయాణాలను పునఃప్రారంభించే విషయమై ప్రణాళికలు ప్రకటించింది. ఈ తరుణంలో మొదటి కేసు బయటపడింది. పర్యాటకుల కోసం సరిహద్దులను తిరిగి తెరిచేందుకు సన్నద్ధమవుతున్న వేళ మొదటి కేసును పట్టుకోవడం, తమ అప్రమత్తత తీరును చూపుతోందని అన్నారు ప్రధాని బ్రౌన్. మహమ్మారి ఏ వేరియంట్‌లో విజృంభించినా, ఇన్నాళ్లు తమ దేశాన్ని కాపాడుకున్నామని, ఇప్పుడు కూడా అదే స్పూర్తితో పనిచేస్తున్నామని చెబుతున్నారు కుక్ ఐలాండ్స్ అధికారులు. పాజిటివ్ వచ్చిన బాలుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందం పనిచేస్తోందని చెప్పారు ఆఫీసర్లు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం