China – Malaysia Tensions: కయ్యాలమారి చైనా దురహంకారం.. దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు

China - Malaysia Standoff: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ కంట్రీ అరాచకాలు మితిమీరుతున్నాయి. మలేషియా సముద్ర సరిహద్దులోకి చైనా యుద్ద విమానాలు చొచ్చుకురావడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

China - Malaysia Tensions: కయ్యాలమారి చైనా దురహంకారం.. దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు
South China Sea
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 03, 2021 | 5:57 PM

China – Malaysia Tensions: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ కంట్రీ అరాచకాలు మితిమీరుతున్నాయి. మలేషియా సముద్ర సరిహద్దులోకి చైనా యుద్ద విమానాలు చొచ్చుకురావడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చైనా కవ్వింపుల చర్యలకు మలేషియా ధీటుగా సమాధానం చెప్పింది. చైనా యుద్ద విమానాలను మలేషియా ఫైటర్‌ జెట్‌లు తరమికొట్టాయి. కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా తీరుతో దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తన భూభాగానికి సుదూరంగా ఉన్న మలేషియా సరిహద్దులో సముద్ర జలాలు మావేనంటూ చైనా  అడ్డంగా వాదిస్తోంది. ఇప్పుడు మలేషియా సముద్ర  సరిహద్దులోకి తమ యుద్ధ విమానాలను పంపడం ద్వారా చైనా మరింత బరితెగింపును ప్రదర్శించింది.

చైనా అతిక్రమణే అంటున్నమలేషియా.. మే నెల 31న మలేషియాలోని సార్వాక్‌ ప్రాంతంలో చైనా యుద్ధ విమానాలు సంచరించాయి. 16 చైనా యుద్ధ విమానాలు అక్కడి సముద్ర జలాలపై ప్రయాణించాయి. వ్యూహాత్మక ఫార్మేషన్‌లో ప్రయాణించిన యుద్ద విమానాలు..సమరానికి సై అంటూ సంకేతాలు పంపాయి. వెంటనే అప్రమత్తమైన మలేషియా సైన్యం….చైనాకు ధీటుగానే స్పందించింది. చైనా విమానాలతో బోర్నియో ద్వీపం నుంచి కమ్యునికేషన్‌లోకి వచ్చిన మలేషియా అధికారులు…తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. ఈ హెచ్చరికలను  చైనా అధికారులు ఖాతరు చేయకపోవడంతో..లబౌన్‌ ఎయిర్‌బేస్ నుంచి మలేషియా యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. వెనక్కి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనాకు అర్థమయ్యే భాషలోనే చెప్పింది మలేషియా. దీంతో అక్కడి నుంచి చైనా యుద్ధ విమానాలు నిష్క్రమించాయి.

చైనా యుద్ధ విమానాలు తమ దేశ సరిహద్దుల వరకు రావడాన్ని మలేషియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తమ సముద్ర గగన తలంలోకి ఎందుకు వచ్చారో వివరణ ఇవ్వాలని మలేషియాలోని చైనా రాయబారికి సమన్లు పంపింది.  సింగపూర్‌ విదేశాంగ మంత్రి హిషమ్మొద్దీన్‌ హుస్సేన్‌ ఇచ్చిన సమ్మన్లపై స్పందించిన కౌలాలంపూర్‌లోని చైనా రాయబార కార్యాలయం…ఈ ఘటనపై ఒక ప్రకటన జారీ చేసింది. తమ విమానాలు ఎలాంటి అతిక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చింది. అది రొటీన్‌గా జరిగే వాయుసేన సాధనలో భాగమేనని, తాము అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే గగనతలంలో ప్రయాణించామని పేర్కొంది. ఏ దేశ ప్రాదేశిక గగనతలంలోకి తాము చొరబడలేదని సమర్థించుకున్న చైనా.. మలేషియాతో స్నేహపూర్వక సంబంధాలకే కట్టుబడి ఉన్నామంటూ నక్క జిత్తులు ప్రదర్శించింది. 2020లో చైనాకు చెందిన ఒక సర్వే నౌక మలేషియా జలాల్లో తిష్టవేసిన ఘటనపై నెలకొన్న వివాదం చల్లారక ముందే మరో ఘటనతో మలేషియా అప్రమత్తమయ్యింది.

ఫిలిప్పీన్స్‌తోను చైనా వివాదం

కయ్యాలమారి డ్రాగన్ దేశంలో పొరుగుదేశాలన్నిటితోనూ ఇదేరకంగా వ్యవహరిస్తోంది. దక్షిణ చైనా సముద్రతీరంపై సర్వహక్కులు తనకేనన్నట్లు మొండిగా వాదిస్తోంది. ఇటీవల ఫిలిప్పీన్స్‌తోనూ గొడవపడింది. మార్చి 7,2021న వివాదాస్పద జూలియన్‌ ఫిలిప్పే ద్వీపం వద్దకు చైనాకు చెందిన 220 చేపల వేట ఓడలు చొచ్చుకొచ్చాయి. ఈ ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలపించాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతిచ్చింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోనే ఈ ద్వీపం ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో ఫిలిప్పీన్స్ దేశాధినేత రోడ్రిగా డ్యుటెరెట్టి స్నేహంగా ఉంటున్నారు. రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు కూడా డ్యుటెరెట్టి ప్రయత్నించారు. చివరకు డ్రాగన్‌ చర్యలతో విసిగి పోయిన ఫిలిప్పీన్స్‌..మే 3, 2021న చైనాపై ట్విటర్లో విరుచుకుపడింది.  ట్విటర్లో రాయలేని పదాలతో బూతులు అందుకున్నారు ఫిలిప్పీన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి టియోడోరో లోక్సిన్‌. ఈ ట్వీట్ల పరంపర అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. చివరకు ఆ నౌకలను చైనా వెనక్కి పిలవకపోవడంతో ఫిలిప్పీన్స్ లోలోన రగిలిపోతోంది. ఈ విషయంలో గత వారం మరోసారి చైనా తీరుకు ఫిలిప్పీన్స్ దౌత్య నిరసన వ్యక్తం చేసింది. 2016లో డ్యుటెరెట్టి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది చైనాకు వ్యతిరేకంగా చేపట్టిన 84వ దౌత్య నిరసన..! చైనా ముప్పును గ్రహించిన ఫిలిప్పీన్స్  గస్తీని ముమ్మరం చేసింది. మార్చి 1 నుంచి మే 25 వరకు స్పార్ట్‌లీ ద్వీపాల వద్దకు 53సార్లు గస్తీ దళాలను పంపింది.

చైనాది సముద్ర దాహం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌, వియత్నాం, తైవాన్‌, బ్రునై, మలేషియా దేశాలకు వాటాలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో అతి తక్కువ భాగమే చైనాకు దక్కుతుంది. కానీ డ్రాగన్‌ దక్షిణ చైనా సముద్రాన్నే మింగేయాలనుకుంటోంది. ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉండటంతో మొత్తం చైనా సముద్రాన్ని సొంతం చేసుకునే వ్యూహంలో ఉంది చైనా. ఇక్కడి చాలా దీవులు తనవే అని బుకాయిస్తున్న చైనా..ఆ దీవుల ముసుగులో దక్షిణ చైనా సముద్రం కూడా తనదేనంటూ దురహంకారాన్ని ప్రదర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి..

సౌదీ అరేబియా సర్కార్ సంచలన నిర్ణయం.. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు

షాకింగ్: కుక్కపై కోపంతో కాల్పులు జరిపింది.. గురితప్పి కొడుకు శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది..