Karachi Bus Fire: పాకిస్తాన్‌లో హృదయ విదారక ఘటన.. 18 మంది వరద బాధితులు కాలి బూడిద..
వారిని దురదృష్టం వెంటాడింది. వరదల నుంచి బయటపడ్డామని సంతోషించేలోగా మంటలు చుట్టుముట్టాయి. వారి అరుపులు కేకలు ఎవరికి వినిపించలేదు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వరద ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న వారిని వెంటాడిన మృత్యువు. పాకిస్తాన్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరాచీలో బుధవారం (అక్టోబర్ 12) రాత్రి బస్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బస్సులోని 18 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వరద బాధితులను తీసుకెళ్తున్న బస్సు కరాచీ నుంచి ఖైర్‌పూర్ నాథన్ షా ప్రాంతానికి వెళ్తుండగా సూపర్ హైవేపై నూరియాబాద్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఓడరేవు నగరమైన కరాచీని హైదరాబాద్, సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో నగరాలతో కలిపే ఎం-9 మోటర్‌వేలో ఈ సంఘటన జరిగింది. వరద తాకిడికి గురైన ప్రజలు ఈ బస్సులో తమ ఇళ్లకు వెళ్తున్నారు.
బస్సు అగ్ని ప్రమాదంలో 18 మంది మృతి
పార్లమెంటరీ ఆరోగ్య కార్యదర్శి సిరాజ్ ఖాసిం సూమ్రో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించారని.. 10 మంది గాయపడినట్లు చెబుతున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన సమాచారం ప్రకారం, బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన వ్యక్తులని.. జంషోరో జిల్లా కమిషనర్ ఆసిఫ్ జమీల్ తెలిపారు. వీరంతా దాదు జిల్లాలోని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వరదలో చిక్కుకున్న వారిని తీసుకెళ్లేందుకు బస్సులో..
బస్సులో దాదాపు 35 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం దగ్ధమైంది. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి దూకినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. సింధ్ ప్రావిన్స్‌లో వరద ప్రభావిత జిల్లాల్లో దాదు జిల్లా ఒకటి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం