Sri Lanka: శ్రీలంకలో నవ శకం.. కొత్త అధ్యక్షుడిగా వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే

Anura Kumara Dissanayake: శ్రీలంకలో నవశకం మొదలయ్యింది. ఆ దేశ ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేతకు పట్టంకట్టారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను దిసనాయకే మట్టికరిపించారు. ఆదివారంనాటి ఓట్ల లెక్కింపులో దిసనాయకే అత్యధిక మెజార్టీతో అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్నారు.

Sri Lanka: శ్రీలంకలో నవ శకం.. కొత్త అధ్యక్షుడిగా వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే
Anura Kumara Dissanayake
Follow us

|

Updated on: Sep 22, 2024 | 11:17 PM

శ్రీలంకలో నవశకం మొదలయ్యింది. ఆ దేశ ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేతకు పట్టంకట్టారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను దిసనాయకే మట్టికరిపించారు. ఆదివారంనాటి ఓట్ల లెక్కింపులో దిసనాయకే అత్యధిక మెజార్టీతో అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తనకు 10వ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలన్న దిసనాయకే వినతిని శ్రీలంక ఓటర్లు మన్నించారు. 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభం శ్రీలంకను కుదిపేసిన తర్వాత నిర్వహించిన తొలి అధ్యక్ష ఎన్నిక ఇదే కావడం విశేషం.

అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర కుమార సాధించినట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. విపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేకు కేవలం 17 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రణిల్.. ఆ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన్ను శ్రీలంక ప్రజలు పూర్తిగా నిరాకరించారు.

Anura Kumara Dissanayake

Anura Kumara Dissanayake

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (NPP) పార్టీ ప్రకటించింది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకేకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే దక్కగా.. ఇప్పుడు 42.31 శాతం ఓట్లు సాధించడం విశేషం. పెద్దగా రాజకీయ నేపథ్యం లేని దిసనాయకే.. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఓటే వేస్తున్న అనుర కుమార..

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ శనివారం జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట తొలి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించినప్పటికీ… అందులో విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో గెలుపును నిర్ధరించేందుకు రెండో రౌండ్‌ కౌంటింగ్‌ చేపట్టారు. ఇందులో మార్క్సిస్ట్‌ నేత కుమార దిసనాయకే విజయం సాధించారు. దేశ ప్రజలు మార్పు కోసం ఓటు చేశారన్న దిసనాయకే.. దేశ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు అధ్యక్షుడిగా పనిచేస్తానని చెప్పారు. ఇది ఒకరి విజయం కాదని.. దేశ ప్రజలందరి విజయమని పేర్కొన్నారు.

అనుర కుమార ట్వీట్..

శ్రీలంకలోని భారత హై కమిషనర్ సంతోష్ ఝా.. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనుర కుమార దిసనాయకేను కలిసి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అనుర కుమార నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి