Australia Elections: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్.. లిబరల్ పార్టీపై లేబర్ పార్టీ ఘన విజయం
Australia Elections: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశ కొత్త ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్ ఎన్నికయ్యారు.

Australia Elections: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశ కొత్త ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ పరాజయం పాలైంది. మారిసన్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్నిప్రతిపక్ష లేబర్ పార్టీ ఓడించింది. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే తన ఓటమి అంగీకరించారు మారిసన్. లేబర్ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా తదుపరి ప్రధాని కానున్నారు. మారిసన్ ఓటమిని ఒప్పుకోవడమే కాదు లిబర్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఒక నాయకుడిగా గెలుపు ఓటములకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇన్నాళ్లూ పార్టీకి, దేశానికి నాయకత్వం వహించే అదృష్టం దక్కినందుకు సంతోషపడుతున్నట్టు చెప్పారు.
కొత్త నాయకత్వం పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలనని ఆశిస్తున్నట్టు చెప్పారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న లిబరల్ పార్టీని ఆస్ట్రేలియన్లు ఇప్పుడు గద్దె దింపేశారు. ఇక ఆంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1996 నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవుతున్నారు. 2013లో ఉప ప్రధానిగా పనిచేశారు. 2007 నుంచి 2013 వరకు కేబినెట్ మినిస్టర్‌గా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆల్బనీస్ తన హామీలతో ఆస్ట్రేలియన్ల విశ్వాసం సంపాదించుకున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ఆస్ట్రేలియాలో ప్రజలకు మరింత ఆర్థిక సహాయం అందిస్తామని, సామాజిక భద్రతను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. వాతావరణ మార్పులపై ఆస్ట్రేలియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ అంశం కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఈ విషయంలో కూడా ఆల్బనీస్ పార్టీ స్పష్టమైన ప్రణాళికతో ప్రజలను ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆల్బనీస్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.