మరో కీలక ఘట్టానికి కౌంట్‌డౌన్ షురూ.. ట్రంప్ జస్ట్ స్టాంప్ అధ్యక్షుడిగా మిగిలిపోతాడా..?
అమెరికాలో మరో కీలక ఘట్టానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ వేడి పెరుగుతోంది. ఓవైపు ఇరాన్‌తో వార్, మరోవైపు దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకత.. ఈరెండూ కలిసి డొనాల్డ్ ట్రంప్ ఫ్యూచర్‌పై ప్రభావం చూపబోతున్నాయా..? మిడ్‌టర్మ్‌లో ఓడిపోతే, ట్రంప్ జస్ట్ స్టాంప్ అధ్యక్షుడిగానే మిగిలిపోతాడా..? నో కింగ్ ఆందోళనలు ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాయా ?

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అంటే చాలా కీలకం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ మొత్తం సభ్యులు, అలాగే సెనేట్‌లోని దాదాపు మూడో వంతు సభ్యులు ఎన్నికవుతారు. 2026 నవంబర్‌లో జరిగే ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది ఈ ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం మిడ్‌టర్మ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ తనకు తాను స్ట్రాంగ్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా, ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యుద్ధం వల్ల ఆర్థిక ఒత్తిడి, ఆయిల్ ధరల పెరుగుదల, గ్లోబల్ టెన్షన్ ఇలా అన్నీ ట్రంప్‌పై వ్యతిరేకతను పెంచుతున్నాయి.
యుద్ధం కారణంగా అమెరికాలో ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. అలాగే సైనిక వ్యయం, అమెరికా డిఫెన్స్ ఖర్చులు మరింత పెరిగాయి. దీంతో ప్రభుత్వ బడ్జెట్‌పై ఒత్తిడి పెరగడంతో, సోషల్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్‌పై ఖర్చు తగ్గాయి. దీని వల్ల మధ్యతరగతి, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో “నో కింగ్” అనే నినాదంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి.ఇవి ట్రంప్‌పాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఈనేపద్యంలో డెమోక్రాట్లు ఈ పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ తీసుకువస్తున్న ఓటర్ ఐడీ చట్టం, మెయిల్ ఇన్ ఓటింగ్‌పై పరిమితులు, పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత పేరుతో తీసుకుంటున్న చర్యలు అన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు.
మరోవైపు ట్రంప్ మాత్రం ఈ చట్టాలను ఎన్నికల పారదర్శకత కోసమే తీసుకొచ్చానని చెబుతున్నాడు. ఓటర్ ఐడీ కఠినంగా ఉండాలని, మెయిల్ ఇన్ ఓటింగ్ పరిమితం చేయాలని, లేకుంటే ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయన్నది ట్రంప్ వెర్షన్. అయితే ఇప్పటివరకు పెద్ద ఎత్తున అక్రమ ఓటింగ్ జరిగినట్లు ఆధారాలు లేవని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. అంతేకాదు రీడిస్ట్రిక్టింగ్..అంటే నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం పైనా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమకు అనుకూలంగా మ్యాప్స్ ను కూడా మార్చేశాయి. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇరాన్ యుద్ధం, దేశీయ నిరసనలు, ఎన్నికల చట్టాలపై వివాదాలు.. ఇవన్నీ కలిపి మధ్యంతర ఎన్నికలను సాధారణ ఎన్నికలకు మించిన టెన్షన్ వాతావరణం సృష్టించాయి. ఒకవైపు ట్రంప్ “స్ట్రాంగ్ లీడర్” ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తుంటే, మరోవైపు డెమోక్రాట్లు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదంతో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే, ఇరాన్ యుద్ధం ఈ ఎన్నికలపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
