Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ ఊచకోత..15 బంతుల్లోనే 50.. సచిన్, ద్రవిడ్ రికార్డులు బ్రేక్
Vaibhav Sooryavanshi :గత సీజన్‌లో కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు 15 ఏళ్ల వయసులో విధ్వంసానికి కొత్త అర్థం చెబుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి రికార్డుల దుమ్ముదులిపేశాడు.

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడే మొదలైంది.. కానీ అప్పుడే అసలు సిసలు సినిమా చూపించేస్తున్నాడు ఒక కుర్రాడు. గత సీజన్‌లో కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు 15 ఏళ్ల ప్రాయంలో విధ్వంసానికి కొత్త అర్థం చెబుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ చిన్నారి సంచలనం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి రికార్డుల దుమ్ముదులిపేశాడు.
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య గువహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ మీదే ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు రాజస్థాన్ పేసర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో, ఇంత తక్కువ స్కోరైనా వైభవ్ ఎలా ఆడతాడో అన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఆ కుర్రాడు తన సహజసిద్ధమైన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. మొదటి బంతికే క్యాచ్ డ్రాప్ అవ్వడంతో బతికిపోయిన వైభవ్, ఆ తర్వాత మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించి కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
లెజెండ్స్ రికార్డులు బద్దలు
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 17 బంతుల్లో 52 పరుగులు చేసి 5 సిక్సర్లు బాదాడు. ఈ 5 సిక్సర్లతో అతను ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే వైభవ్ ఖాతాలో ఇప్పుడు 29 సిక్సర్లు ఉన్నాయి.
సచిన్ టెండూల్కర్: క్రికెట్ గాడ్ సచిన్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం (78 మ్యాచ్‌లు)లో 29 సిక్సర్లు కొట్టగా, వైభవ్ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డును సమం చేశాడు.
ద్రవిడ్, సంగాక్కర: తన మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (28 సిక్సర్లు), ప్రస్తుత కోచ్ కుమార సంగాక్కర (27 సిక్సర్లు) రికార్డులను వైభవ్ దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పవర్ హిట్టింగ్ చూస్తుంటే భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు మారుతాయో అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ధోనీ లేని చెన్నైకి దెబ్బ మీద దెబ్బ
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ప్లేయింగ్-11లో లేకపోవడం చెన్నైకి శాపంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో ధోనీ లేకుండా చెన్నై బరిలోకి దిగడం ఇది కేవలం ఆరోసారి మాత్రమే. 2010లో ధోనీ లేని మ్యాచ్‌లో చెన్నై గెలిచినప్పటికీ, ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ (తాజా మ్యాచ్‌తో కలిపి) వరుసగా ఓడిపోయింది. ధోనీ లేకపోతే చెన్నై జట్టు తన ఆత్మను కోల్పోతుందనే వాస్తవం మరోసారి రుజువైంది. 16 ఏళ్లలో ధోనీ లేకుండా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ చెన్నై పరాజయం పాలవ్వడం ఒక చెత్త రికార్డుగా నిలిచిపోయింది.
రాజస్థాన్ రాయల్స్ ఆధిపత్యం
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. బౌలింగ్‌లో రాజస్థాన్ పేసర్లు చెలరేగగా, బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవడంతో చెన్నైకి కోలుకునే అవకాశం కూడా చిక్కలేదు. వైభవ్ సాధించిన ఈ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది.
