Andhra Pradesh: ఏపీ అభివృద్ధికి 3 ఎకనామిక్ రీజియన్లు.. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మెగా ప్లాన్..
ఏపీ సమగ్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మూడు ప్రాంతాల వనరులకు అనుగుణంగా ప్రత్యేక రంగాలను అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఐటీ, ఉద్యోగాల విప్లవం నుంచి.. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల హబ్ వరకు, రాజధాని అమరావతిలో రూ.4.65 లక్షల కోట్ల మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్ వరకు ప్రభుత్వం సిద్ధం చేసిన రోడ్‌మ్యాప్ వివరాలు తెలుసుకుందాం.

విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రంగా మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల గ్రౌండింగ్‌పై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో వివిధ శాఖల పరిధిలో 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 64 పనులను ప్రారంభించింది. విశాఖ స్టీల్ , కాకినాడ ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణపైనా దృష్టి సారించారు. కొత్తగా 15 నుంచి 20 ఐటీ సంస్థలను ఆకర్షించడంతో పాటు.. ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రాయలసీమను పారిశ్రామికంగా బలోపేతం చేసే దిశగా తిరుపతి ఎకనమిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, స్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటోమొబైల్, ఈవీ, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నాలెడ్జ్ రంగాలను ప్రధానంగా ఎంచుకుంది. రాష్ట్రంలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 66 ప్రాజెక్టుల పెట్టుబడులు ఈ రీజియన్ పరిధిలోనే ఉండబోతున్నాయి. హార్టికల్చర్ హబ్‌లో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మీట్ అండ్ పౌల్ట్రీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ఈ ప్రాంతంలోని 14 పట్టణాలను వివిధ పరిశ్రమలకు అనువైన పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు.
రాజధాని అమరావతి కేంద్రంగా మరో కీలక ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. ఈ ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 4.65 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కోస్టల్ టూరిజంలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.
