Hibiscus Flower: వామ్మో.. మందార పువ్వు కాండాన్ని తిని నెలల చిన్నారి మృతి!
మందార పువ్వు ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది. చెట్టు నుంచి కోసిన మందార పువ్వులతో పూజ గదితోపాటు ఇంటి గుమ్మం వద్ద ఉంచారు. అనంతరం అవి వాడిపోయాయి. అటుగా వచ్చిన నెలల చిన్నారి ఎండిన మందార పువ్వును తినుబండారంగా భావించి నోట్లో వేసుకుని మింగడంతో..

మైసూరు, మార్చి 31: ఇంటి ముందు అందంగా పెంచుకునే మందార పువ్వు మొక్క ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది. చెట్టు నుంచి కోసిన మందార పువ్వులతో పూజ గదితోపాటు ఇంటి గుమ్మం వద్ద ఉంచారు. అనంతరం అవి వాడిపోయాయి. అటుగా వచ్చిన నెలల చిన్నారి ఎండిన మందార పువ్వును తినుబండారంగా భావించి నోట్లో వేసుకుని మింగడంతో.. గొంతులో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటకలోని హుణసూరు తాలూకా హనగోడు హోబళి దొడ్డ హెజ్జూరు గ్రామంలో సుదర్శన్, నవ్య దంపతుల రెండో కుమారుడు చిన్మయ్‌గౌడ (6 నెలలు). శనివారం చిన్మయ్ తన అన్నతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఇంటి గుమ్మం వద్ద ఉంచిన ఎండిన మందార పువ్వును చూశాడు. తినుబండారం అనుకొని మందారపువ్వు కాండాన్ని తినేశాడు. ప్రమాదవశాత్తు అది గొంతులో ఇరుక్కుంది. వెంటనే చిన్మయ్ అన్న దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో చిన్మయ్ దానిని మింగేశాడు. అది గొంతు లోపల ఇరుక్కుపోవడంతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న హనగోడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో కన్నోళ్లు గుండెలవిసేలా రోదించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హుణసూరు గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటుండగా నాణెం మింగిన చిన్నారి మృతి చెందింది. యూపీలో జరిగిన ఇంకో ఘటనలో ఆటబొమ్మలోని ప్లాస్టిక్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో చిన్నారి ఊపిరాడక తల్లడిల్లింది. ఏడాదిలోపు చిన్నారులు ఉన్న ఇంట్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే దానిని నోట్లో పెట్టుకుని పరిశీలించే అలవాటు ఉంటుంది. గింజలు, విత్తనాలు, నాణేలు, బొమ్మల భాగాలు, చివరికి ఎండిన పువ్వుల వంటి వస్తువులు కూడా క్షణాల్లో శ్వాస మార్గాన్ని అడ్డుకుంటాయి. అందుకే పిల్లలపై తల్లిదండ్రులు, సంరక్షకులు నిఘాపెట్టి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




