America Key Decision: మే 1నుంచి అమెరికా సేనల ఉపసంహరణ షురూ.. రెండు దశాబ్ధాలలో అగ్రరాజ్యం ఏంసాధించిందంటే?

America Key Decision: మే 1నుంచి అమెరికా సేనల ఉపసంహరణ షురూ.. రెండు దశాబ్ధాలలో అగ్రరాజ్యం ఏంసాధించిందంటే?
Usa Milatroy

తమ దేశంలో రెండు టవర్లను కూల్చి.. వందలాది మందిని హతమార్చిన తాలిబన్ల వేటకుగాను రెండు దశాబ్ధాల క్రితం అఫ్ఘానిస్తాన్‌లోని ఎంటరై అమెరికన్ ఆర్మీని ఎట్టకేలకు…

Rajesh Sharma

|

Apr 17, 2021 | 7:36 PM

America key decision to deport army from Afghanistan: తమ దేశంలో రెండు టవర్లను కూల్చి.. వందలాది మందిని హతమార్చిన తాలిబన్ల వేటకుగాను రెండు దశాబ్ధాల క్రితం అఫ్ఘానిస్తాన్‌లోని ఎంటరైన అమెరికన్ ఆర్మీని ఎట్టకేలకు ఉపసంహరించబోతున్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సేనల ఉపసంహరణ మే ఒకటవ తేదీన మొదలై సెప్టెంబర్ 11 నాటికిపూర్తి అవుతుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. గత పదిహేనేళ్ళుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సేనల ఉపసంహరణ కీలకాంశమే అయినా.. హామీ ఇచ్చిన ఏ అధ్యక్షుడు ఆ పనిని పూర్తి చేయలేదు. గత నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోను ఈ అంశం కీలకమైంది. అయితే జో బైడెన్ చెప్పినట్లుగానే అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ సేనలతోపాటు నాటో కూటమి సైన్యం కూడా వెనక్కి వచ్చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రాసెస్ మే 1 నుంచి సెప్టెంబర్ 11 (అమెరికాపై అల్ కాయిదా దాడి చేసిన తేదీ)నాటికి పూర్తి అవుతందని కూడా బైడెన్ వెల్లడించారు. దాంతో అమెరికా అఫ్ఘానిస్తాన్‌లో సాగించిన నరమేధానికి ఫుల్‌స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్నారు.

అఫ్ఘానిస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా సాగిస్తున్న ఖరీదైన యుద్ధానికి ముగింపు పలకబోతోంది అమెరికా. అఫ్గానిస్తాన్‌లో వున్నతమ 2,500 మంది సైనికులను అమెరికా తిరిగి తమ దేశానికి రప్పించుకోబోతోంది. అయితే.. రెండు దశాబ్దాల పాటు అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సాగించిన మారణహోమంతో ఏం సాధించిందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అమెరికా మూటగట్టుకున్న అతి పెద్ద వైఫల్యంగా చరిత్రలో అఫ్గానిస్తాన్ మారణహోమం నమోదవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2,448 మంది సైనికులను పోగొట్టుకొని, 2 లక్షల కోట్ల డాలర్ల వ్యయం చేసి అమెరికా అఫ్ఘానిస్తాన్‌లో మిగిల్చిందల్లా వైమానిక, ఉగ్రవాద దాడులతో అతలాకుతలమైన దేశాన్ని మాత్రమేనని అంటున్నారు. న్యూక్లియర్ వెపన్‌ని తప్ప తన అమ్ములపొదిలో వున్న సమస్త ఆయుధాలనూ అమెరికా అఫ్ఘానిస్తాన్‌లో వినియోగించింది. క్షిపణి దాడులతో ఆ దేశాన్ని చిగురుటాకులా వణికించింది. నలుగురు వ్యక్తులు ఓ చోట గుమిగూడితే చాలు వాళ్లను ఉగ్రవాదులుగా ముద్రవేసి వైమానిక దాడుల్లో హత మార్చడం చాలా సందర్భాల్లో జరిగింది. ఈ పాపాలకు సంబంధించి జూలియన్‌ అసాంజ్‌ బయట పెట్టిన ఎన్నో పత్రాలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఉగ్రవాదుల మాటేమో గానీ… వేలమంది సాధారణ పౌరులు అఫ్ఘానిస్తాన్‌లో చనిపోయారు. ఫలితంగా అక్కడ ఉగ్రవాదం మరింత తీవ్రమైంది. కానీ అమెరికా మాత్రం స్పష్టమైన లక్ష్యాలతో అఫ్ఘానిస్తాన్‌కు సైన్యాన్ని పంపామని, ఆ లక్ష్యాలు నెరవేరాయి కాబట్టే ఇపుడు సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నామని బైడెన్ చెప్పుకోవడం సొంత డబ్బా కిందనే పరిగణించాలి.

భూగోళంలో ఏమూలనవున్నా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రతిఙ్క్ష చేసి మరీ 2001లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ లక్షమందికి పైగా అమెరికన్ సైన్యాన్ని, అదనంగా నాటో దళాలను అఫ్గానిస్తాన్‌కు పంపారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనతో అమెరికా సైనికులతోపాటు నాటో కూటమికి చెందిన మొత్తం 7 వేలమంది సైనికులు కూడా అఫ్ఘానిస్తాన్ నుంచి బయటికి వస్తారు. ఏ దేశమైనా మరో దేశాన్ని దురాక్రమించటం, పెత్తనం సాగించటం, అక్కడి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేయటం అనాగరికమనే చెప్పాలి. రిపబ్లికన్ల ఏలుబడి ముగిసి ఒబామా నాయకత్వంలో డెమొక్రాటిక్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక అమెరికాకు జ్ఞానోదయమైంది. 2014నాటికల్లా అమెరికా దళాలు అఫ్ఘానిస్తాన్‌ నుంచి నాటో దళాలు నిష్క్రమిస్తాయని ఒబామా గతంలో ప్రకటించారు. కానీ తన ఎనిమిదేళ్ళ పరిపాలనా కాలంలో అదేమీ చేయలేకపోయారు ఒబామా. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ దీనిపై విశేషంగా ప్రచారం చేశారు. తాను వచ్చిన వెంటనే నాటో దళాలను వెనక్కి రప్పిస్తానని భీషణ ప్రతిఙ్ఞ చేశారు. కానీ అదేమీ జరగలేదు కానీ కొన్ని ప్రయత్నాలను ట్రంప్ చేశారనే చెప్పాలి. పాకిస్తాన్‌ ప్రాపకంతో తాలిబన్‌లతో పలు విడతలుగా చర్చలు జరిపి మొత్తానికి ఈ ఏడాది మే 1నుంచి మొదలుపెట్టి దశలవారీగా సైనిక దళాలను వెనక్కి తీసుకొస్తామని మొన్న నవంబర్ నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రకటించారు. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసింది. చివరకు బైడెన్‌ తాలి బన్‌లకు ట్రంప్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు.

అయితే అమెరికా సహా నాటో దళాలు అఫ్థానిస్తాన్‌లో ఏమి సాధించాయి అంటే ఒకటి వాస్తవంగా చెప్పుకోవాలి. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా అహాన్ని దెబ్బకొడుతూ న్యూయార్క్ ట్విన్ టవర్లను కూల్చిన అల్ కయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను మాత్రం అమెరికా హతమార్చగలిగింది. అతను స్థాపించిన అల్ కయిదాను చిన్నాభిన్నం చేయగలిగాయి నాటో దళాలు. ఈ క్రెడిట్ అమెరికాకు తప్పక దక్కుతుంది. అయితే.. అల్ కయిదా చిన్నాబిన్నం అయినా.. అంతకు మించిన డేంజరస్ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఏర్పాటైంది. ఆ తర్వాత ఉగ్రవాదులు అనేక గ్రూపులుగా విడిపోయి ప్రపంచంలో పలు దేశాలలో హింసాకాండ సృష్టిస్తూనే వున్నారు. ఇక అఫ్ఘానిస్తాన్‌లో మహిళల జీవితాలైతే దుర్బరమైపోయాయి. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామని, మహిళల హక్కులకు రక్షణ కలిపించగలిగామని అమెరికా చెప్పుకోవచ్చు గాక.. కానీ అది కేవలం రాజధాని ప్రాంతాల్లోనే సాధ్యమైందని, అది కూడా అంతంత మాత్రమేనన్నది వాస్తవం. నిజానికి అఫ్ఘానిస్తాన్‌లో పేరుకు ప్రభుత్వం వున్నా ఆ ప్రభుత్వ పరిపాలనలో వున్న ప్రాంతం చాలా తక్కువ. ఉగ్రవాద ముఠాల్లో తాలిబన్లదే ఇప్పటికీ పైచేయి అనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ జోన్ పేరిట కొంత ఏరియాను గిరిగీసుకుని అందులోనే వుంటున్నాయి నాటో దళాలు. నాటో దళాల దగ్గర శిక్షణ పొందిన స్థానిక పోలీసులు, సైనికులు ఆ గ్రీన్ జోన్‌ను రక్షణ కవచంగా వుంటూ వున్నారు. అయితే.. అలాంటి గ్రీన్ జోన్‌పై కూడా పలు మార్లు తాలిబన్లు దాడులు జరపడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే అఫ్ఘానిస్తాన్‌పై నిర్వహించిన దాష్టీకంతో అమెరికా అన్నిరకాలుగా భంగపడిందనే చెప్పాలి. చివరికి తమ దేశంపై దాడి జరిగిన రోజే (సెప్టెంబర్ 11) అమెరికన్ దళాలు పూర్తిగా అఫ్ఘానిస్తాన్‌ను బయటికి రావాలని అమెరికా నిర్ణయించడం కూడా యాదృచ్ఛికం కాదు.

ఏదో ఒక సాకుతో దేశాలను దురాక్రమించటం అంతర్జాతీయ నేరంగానే పరిగణించాలి. కానీ అగ్రరాజ్యానికి ఎదురు లేదు కాబట్టి ఎవరూ ఆమేరకు అమెరికాను తప్పు పట్టకపోవచ్చు. ఆ కోణంలో అమెరికా దళాల ఉప సంహరణ సరైందే అయినా.. దళాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలమని మాత్రం చెప్పాలేం. ఈ మేరకు బైడెన్ చేసిన ప్రకటన తర్కంలో నిలువలేదు. అఫ్ఘానిస్తాన్ విషయంలో అమెరికా ఐక్యరాజ్యసమితిని కలుపుకుని పోవాల్సిందని చాలా దేశాలు అభిప్రాయపడ్డాయి. కానీ తమ అహాన్ని దెబ్బకొట్టిన తాలిబన్లతో తామే యుద్ధం జరపాలన్న పట్టుదలతో అమెరికా అఫ్ఘానిస్తాన్‌లో రెండు దశాబ్దాల పాటు దాడులకు పాల్పడింది. ప్రస్తుతం అమెరికా దళాలు వైదొలగి, తాలిబన్‌ల ఏలుబడి మొదలైతే ఎలాంటి అరాచకాలు చోటుచేసుకుంటాయో అన్న భయాందోళనలు ఆ దేశంలోని మైనారిటీల్లోను, మహిళల్లోను వ్యక్తమవుతోంది. ఇరుగు పొరుగు దేశాలకు తాలిబన్ల ముప్పు వాటిల్లే అవకాశాలు వున్నాయి. మరీ ముఖ్యంగా భారత్‌కు తాలిబన్లు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. భారత్‌కు తాలిబన్‌లతో చాలా చేదు అనుభవాలున్నాయి. అన్నిటినీ బేఖాతరుచేసి, ఇప్పటికీ హింసను విడనాడని తాలిబన్‌ల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం అమెరికా బాధ్యతారాహిత్యానికి చిహ్నంగా అంతర్జాతీయ అంశాల్లో రాటు దేలిన వారంటున్న మాట.

ALSO READ: త్వరలో నీరవ్ మోదీ అప్పగింత.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యుకే.. డిపోర్టేషన్‌కు రంగం సిద్ధం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu