Iran: ఇరాన్ లో చెలరేగుతున్న వివాదం.. ఘర్షణల్లో 31 మంది మృతి
హిజాబ్ అంశంపై చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలకు దారి తీస్తోంది. పోలీసు కస్టడీలో ఓ యువతి మృతి చెందిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో ఓ యువతిని..
హిజాబ్ అంశంపై చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలకు దారి తీస్తోంది. పోలీసు కస్టడీలో ఓ యువతి మృతి చెందిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యువతి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పౌరులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఆందోళనకారులతోపాటు పోలీసులు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ కఠిన చట్టాలు, పోలీసు జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్ సహా 17 నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఆందోళనల కారణంగా భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఘర్షణలుగా మారి తీవ్ర హింసాత్మకంగా తయారవుతున్నాయి.
దేశంలో పరిస్థితులు అదుపు తప్పడం, నిరసనలు చేపట్టడంతో అధికార బృందం అప్రమత్తమైంది. సమాచారం విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండేందుకు ఇన్‌స్టాగ్రామ్ సేవలను నిలిపివేసింది. రాన్‌లో ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు మినహా ఇతరులెవరూ సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. ‘‘మేము చనిపోతే చనిపోతాం కానీ.. ఇరాన్ ను తిరిగి పొందుతాం’’ అని ప్రజలు నినాదాలు చేస్తున్నారు.
గతవారం మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని టెహ్రాన్ లో పర్యటించింది. ఆ సమయంలో ఆమె హిజాబ్ ధరించలేదంటూ మోరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేస్తున్న సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో ఇరాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..