Yoga Day: విశాఖలో యోగాంధ్ర వేడుకలు.. 5 లక్షల మందితో యోగాసానాలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డే నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం కోసం ఆసనాలు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంతో విశాఖ ఆర్కే బీచ్ సందడిగా మారింది. విశాఖ సాగరతీరం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాప్రదర్శన జరుగుతోంది. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేస్తారు.
యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని INS చోళ నుంచి ఆర్కే బీచ్ దగ్గరకు చేరుకున్న మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోపాటు మంత్రులు ఘనస్వాగతం పలికారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. 45 నిమిషాలపాటు యోగాసనాల్లో పాల్గొంటారు.
విశాఖ RK బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమానికి AP ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానితో పాటు మూడు లక్షల మంది పాల్గొని యోగాసనాలు చేస్తారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లొకేషన్స్‌లో 2 లక్షల మంది ఆసనాలు వేసేలా ఏర్పాట్లు జరిగాయి. ఇందులో 50 లక్షల మందికి యోగా సర్టిఫికెట్స్ అందజేస్తారు. ఈ ఫీట్… గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాబోతోంది. బీచ్ రోడ్‌లో 12 వేల మంది పోలీసులతో, రెండు వేల కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటైంది.
యోగాసనాల కోసం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల మేర 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్లో వెయ్యిమందిని అనుమతిస్తారు. ఒక్కో కంపార్ట్మెంట్‌లో ముగ్గురు యోగా ట్రైనర్లు, 10 మంది వాలంటీర్లు ఉంటారు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక వైద్య శిబిరం, 200 అంబులెన్స్ లు, 4 వేల మొబైల్ టాయిలెట్లు ఏర్పాటయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




