AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ బొమ్మతో వన్ డాలర్ కాయిన్.. చట్టబద్ధమేనా?

Trump One Dollar Coin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవం వేళ విడుదల చేసిన కొత్త వన్ డాలర్‌ కాయిన్‌పై ట్రంప్ చిత్రం కనిపించింది. దీంతో ఓ ప్రశ్న తెరపైకి వచ్చింది. జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని అమెరికా కరెన్సీపై ముద్రించవచ్చా? అసలు ఈ కాయిన్ చట్టబద్ధమేనా?

ట్రంప్ బొమ్మతో వన్ డాలర్ కాయిన్.. చట్టబద్ధమేనా?
Us Mint Releases $1 Coin Featuring Trump To Commemorate The 250th Anniversary
Sharada V
|

Updated on: Sep 24, 2026 | 10:07 PM

Share

అమెరికా మింట్ బంగారు రంగులో కనిపించే వన్‌ డాలర్‌ కాయిన్‌ను బుధవారం విక్రయించడం ప్రారంభించింది. 1776-2026 మధ్య అమెరికా 250 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసేందుకు ఈ నాణేన్ని రూపొందించారు. ఈ కాయిన్ ముందు భాగంలో ట్రంప్ చిత్రం ఉంది. దాని చుట్టూ “LIBERTY”, “IN GOD WE TRUST”, “1776~2026” అనే పదాలు ఉన్నాయి. వెనుక భాగంలో అమెరికా అధ్యక్షుడి అధికారిక ముద్ర (Presidential Seal), దానిపై “250” అనే సంఖ్య కనిపిస్తుంది. అయితే వివాదం ఏంటంటే..అమెరికా కరెన్సీపై జీవించి ఉన్న వ్యక్తి చిత్రం ఉండకూడదు అన్నది చాలా కాలంగా ఉన్న నిబంధన. మరి ట్రంప్ ఇంకా జీవించి ఉండగానే ఆయన బొమ్మతో కాయిన్ ఎలా వచ్చింది?

ఈ నాణేంపై విలువ ఒక డాలరుగానే ఉంది. కానీ అమెరికా మింట్ వీటిని అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తోంది. 25 నాణేలున్న ఒక రోల్‌ను 61 డాలర్లకు, 100 నాణేల బ్యాగ్‌ను 154.50 డాలర్లకు అమ్ముతోంది. దీంతో ఇవి సాధారణంగా చెలామణిలో ఉండే నాణేలతో పాటు స్మారక నాణేలు, కలెక్షన్ వస్తువులుగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా మింట్ వెబ్‌సైట్ ప్రకారం.. విక్రయాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ నాణేల రోల్స్, బ్యాగ్స్ స్టాక్ అయిపోయాయి. ట్రంప్ చిత్రం ఉండటంతో పాటు.. అమెరికా 250వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసే నాణెం కావడంతో ప్రజలు, కలెక్టర్ల నుంచి వీటికి భారీ ఆసక్తి కనిపించింది.

1866 నాటి చట్టం ఏం చెబుతోంది?

అమెరికాలో 1866లో తీసుకొచ్చిన నిబంధన ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని అమెరికా నోట్లపై ముద్రించడంపై ఆంక్షలు ఉన్నాయి. అప్పట్లో నేషనల్ కరెన్సీ బ్యూరోకు చెందిన స్పెన్సర్ ఎం. క్లార్క్ తన చిత్రాన్ని ఐదు సెంట్ విలువైన ఫ్రాక్షనల్ నోట్‌పై ముద్రించడంతో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలను అమెరికా కరెన్సీపై ఉపయోగించకుండా నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఈ నిబంధన నోట్లకు వర్తించినా.. కాయిన్ల విషయంలో వర్తించదు.

2020లో ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలంలో Circulating Collection Coin Redesign Act of 2020 (CCRA) అనే చట్టంపై సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా అమెరికా 250వ వార్షికోత్సవాన్ని సూచించే వన్ డాలర్ నాణేలను ముద్రించేందుకు ట్రెజరీకి అధికారం లభించింది. అయితే ఆ చట్టంలో ఒక ముఖ్యమైన షరతు ఉంది. నాణెం వెనుక భాగంలో జీవించి ఉన్నా, మరణించినా ఏ వ్యక్తి చిత్రాన్ని ముద్రించకూడదు. ఇక్కడ ట్రంప్ చిత్రాన్ని గమనిస్తే.. అది కాయిన్ ముందు భాగంలో ఉంది. వెనుక భాగంలో మాత్రం అమెరికా అధ్యక్షుడి అధికారిక ముద్రను ఉపయోగించారు.అందువల్ల అందుబాటులో ఉన్న చట్టపరమైన వివరాల ప్రకారం ఈ $1 కాయిన్‌ను చట్టబద్ధమే.

మరో ఆసక్తికర చరిత్ర

అమెరికా కాయిన్‌పై జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రం కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 1926లో అమెరికా 150వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రం ఉన్న స్మారక నాణెం విడుదలైంది. దాదాపు శతాబ్దం తర్వాత మరోసారి పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రం అమెరికా కాయిన్‌పై కనిపించింది.తాజా కాయిన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన వన్ డాలర్ నాణెం కావడం.

కాయిన్‌పై ట్రంప్.. ఎందుకు వివాదం?

అమెరికా కరెన్సీపై ట్రంప్ చిత్రాన్ని ఉపయోగించడంపై రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని కరెన్సీపై ఉపయోగించకూడదన్న సంప్రదాయాన్ని ఇది మార్చుతోందా? అనే ప్రశ్నలు వచ్చాయి. మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్‌లో జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలకు ప్రత్యేక మినహాయింపు కల్పించేలా చట్ట ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారు. అయితే ఆ ప్రతిపాదన ప్రస్తుతం ముందుకు సాగలేదు. అంతిమంగా చూస్తే.. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ కొత్త వన్‌ డాలర్‌ కాయిన్ వివాదాస్పదంగా మారినప్పటికీ, 2020లో తీసుకొచ్చిన ప్రత్యేక చట్టంలోని నిబంధనల కారణంగా ఇది చట్టబద్ధమైనదే. అంటే.. కాయిన్ చేతిలోకి తీసుకున్నప్పుడు కనిపించేది ట్రంప్ చిత్రమే అయినా, దాని వెనుక దాగి ఉంది మాత్రం అ మెరికా కరెన్సీ చట్టాల ఆసక్తికర కథ!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us