Viral: ఆకలి అవ్వడం లేదంటూ ఆస్పత్రికి వచ్చిన యువతి – స్కాన్ తీసి అవాక్కయిన వైద్యులు
ఆ యువతి కొద్ది రోజులుగా తరచూ కడుపునొప్పి వస్తోంది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా తగ్గలేదు. ఈ మధ్య కాలంలో వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. రోజురోజుకు నీరసంగా మారిపోతుంది. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి ఓ అరుదైన మానసిక రోగం కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో చిక్కుకుంది. చిన్ననాటి నుంచే జుట్టు తినే అలవాటు పెంచుకున్న ఆమె కడుపులో 1.5 అడుగుల పొడవైన భారీ జుట్టు బంతి ఏర్పడింది. వికారమైన అలవాటు కారణంగా ఆ జుట్టు కడుపులో పేరుకుపోయి ‘ట్రికోబీజోర్’ అనే పరిస్థితికి దారితీసింది. దాంతో యువతికి కడుపునొప్పి, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం మొదలయ్యాయి. అయితే, ఆమె పలుచోట్ల స్కాన్లు, పరీక్షలు చేయించుకున్నా.. అసలు కారణం ఏంటనేది ఎవరూ గుర్తించలేకపోయారు. ఇటీవల ఆమెను ప్రయాగ్‌రాజ్‌లోని నారాయణ స్వరూప్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్లు పూర్తి చెకప్ చేసిన తర్వాత కడుపులో హెయిర్ బాల్ ఉన్న విషయం గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
డాక్టర్ రాజీవ్ సింగ్, డాక్టర్ విషాల్ కేవలాని, డాక్టర్ యోగేంద్ర, డాక్టర్ రాజ్ మౌర్యల బృందం కలిసి రెండు గంటలపాటు శస్త్రచికిత్స జరిపారు. కడుపు ఓపెన్ చేయగా 1.5 అడుగుల పొడవు, 10 సెం.మీ వెడల్పు, సుమారు 500 గ్రాముల బరువు ఉన్న హెయిర్ బాల్ కనిపించింది. దాన్ని జాగ్రత్తగా తీసి, పేగులన్నీ శుభ్రం చేసి, దెబ్బతిన్న భాగాలకు చికిత్స చేశారు.
ఈ యువతికి ట్రికోఫేజియ అనే అరుదైన మానసిక రుగ్మత ఉంది. ఈ వ్యాధితో బాధపడే వాళ్లు జుట్టు, మట్టి, గాజు వంటివి తినే అలవాటు కలిగిఉంటారు. చిన్నప్పటి నుంచి తన జుట్టు, కొన్నిసార్లు ఇతరుల జుట్టూ ఆమె తినేదని.. ఆ జుట్టు కడుపులో ఓ బాల్ మాదిరిగా పేరుకుపోయిందని వైద్యులు తెలిపారు. ఈ హెయిర్ బాల్ సమయానికి తీసేయకపోతే.. పేగుల్లో అడ్డంకులు ఏర్పడి.. లోపల విష పదార్థాలు పేరకుపోయి..జీర్ణక్రియ వైఫల్యం, చివరికి మరణం కూడా సంభవించేదట.
ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యంగా ఉంది. ఆహారం సాధారణంగా తీసుకుంటోంది. అయితే మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఆమెకు మానసిక వైద్యం అందిస్తున్నారు.
