AI మొసలి ఫొటోతో కలకలం.. నిజమేనని నమ్మి రిజర్వాయర్‌లో గాలింపు
ఓ ఫొటో అధికారులను పరుగులు పెట్టించింది. రిజర్వాయర్‌లో మొసలి ఉందంటూ వచ్చిన సమాచారంతో రెండు రోజులు రిజర్వాయర్ ను మూసి వేశారు. రంగంలోకి దిగిన అధికారులు మొసలి కోసం గాలించారు. చివరకు జెమినీ ఏఐతో సృష్టించిన ఫొటో అని అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. సింగపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొసలి ఉందంటూ నకిలీ AI ఫొటోను తయారు చేసి ఓ సహోద్యోగికి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల మయన్మార్ జాతీయుడు యే లిన్‌పై కేసు నమోదైంది.

ఆగస్టు 20వ తేదీన సింగపూర్‌లోని పాండన్ రిజర్వాయర్‌లో మొసలి కనిపించిందన్న సమాచారం అధికారులకు అందింది. దానికి ఆధారంగా ఓ ఫొటో కూడా జత చేసి పంపారు. పౌరుల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో సింగపూర్ జాతీయ నీటి సంస్థ PUB, నేషనల్ పార్క్స్ బోర్డు NParks వెంటనే రంగంలోకి దిగాయి. రిజర్వాయర్ చుట్టుపక్కల మొసలి కోసం గాలింపు చేపట్టాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
రెండు రోజులు నీటి కార్యకలాపాలు బంద్
మొసలిని వెతికే క్రమంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రిజర్వాయర్‌లో ఎలాంటి క్రీడలకు రెండు రోజులు అనుమతివ్వలేదు. దీంతో సింగపూర్ రోయింగ్ అసోసియేషన్, సింగపూర్ కానో ఫెడరేషన్ తమ కార్యక్రమాలు రద్దు చేసుకున్నాయి. అధికారులు మొసలి కోసం తీవ్రంగా గాలించారు. కానీ ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు.
చివరకు అసలు ట్విస్ట్!
ఆ తర్వాత PUB ఫొటోను నిశితంగా పరిశీలించేందుకు పలు AI డిటెక్షన్ టూల్స్‌ను ఉపయోగించింది. అయితే ఆ టూల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఫొటో నిజమైనదా, AIతో రూపొందించిందా అనే విషయాన్ని అవి ఖచ్చితంగా తేల్చలేకపోయాయి. చివరకు ఫొటో నకిలీదని నిర్ధారించుకున్న తర్వాత గాలింపు చర్యలను నిలిపివేశారు. ఆగస్టు 22 నుంచి నీటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో ఫొటో వెనుక ఉన్న వ్యక్తి యే లిన్‌గా గుర్తించారు. రిజర్వాయర్ నిర్వహణా కాంట్రాక్టర్ కింది పనిచేస్తున్న యే లిన్, AI ఫొటోను కాంట్రాక్టర్ కు పంపగా అతను ఈ ఫొటోను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నం
సెప్టెంబర్ 29న యే లిన్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చాడనేది ఒక అభియోగం కాగా ఆధారాలను చెరిపేందుకు ప్రయత్నించాడన్న మరో అభియోగం మోపారు. యే లిన్ తన మొబైల్‌లో Gemini AI యాప్‌లో ఉన్న AI ఫొటోలు, వాటికి సంబంధించిన లాగ్ హిస్టరీని తొలగించినట్లు పోలీసులు ఆరోపించారు. తప్పుడు సమాచారం పంపిన నేరానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు, 10 వేల సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించిన నేరానికి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సెప్టెంబర్ 29న సింగపూర్ స్టేట్ కోర్టులో యే లిన్ హాజరయ్యాడు. అనువాదకుడి ద్వారా తాను నేరాన్ని అంగీకరించాడు. తన తరఫున న్యాయవాదిని నియమించుకోలేదు. అతడి కేసు తదుపరి విచారణ నవంబర్ 10న జరగనుంది. AIతో తయారు చేసిన నకిలీ ఫొటోను నిజమని నమ్మిస్తే.. అది ప్రజల్లో ఎంతటి భయాందోళనలు సృష్టిస్తుందో ఈ ఘటన స్పష్టం చేసింది. ఏఐ సాంకేతికతను బాధ్యత లేకుండా ఉపయోగిస్తే అందరి ముందు నేరస్తుడిలా తలదించాల్సి వస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.