AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌తో మాట పోయింది.. AIతో గొంతు వినిపించింది!

ఒక్కసారి ఊహించుకోండి.. మనసులో ఎన్నో మాటలు ఉన్నాయి. ఎదుటివారికి ఏదైనా చెప్పాలని ఉంది. కానీ నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. అవసరం వచ్చిన ప్రతిసారీ చేత్తో రాసి చూపించాలి. కొన్నిసార్లు ఆ రాతను ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు 70 ఏళ్ల రఘునాథ్ ఏఎస్. నోటి క్యాన్సర్ కారణంగా 2015లో మాటను కోల్పోయిన ఆయనకి ఏఐ కొత్త ఆశ అందించింది. అయితే ఆ సేవలను రోజూ ఉపయోగించుకోవడానికి అయ్యే ఖర్చు ఆయనకు భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న సర్వమ్ ఏఐ సీఈవో నిర్ణయం ఇప్పుడు అందరి మనసులు గెలుచుకుంటోంది.

క్యాన్సర్‌తో మాట పోయింది.. AIతో గొంతు వినిపించింది!
Sarvam Ceo Gifts Ai Lifetime Free Access To Cancer Survivor Who Lost His Voice
Sharada V
|

Updated on: Nov 07, 2026 | 11:30 AM

Share

రఘునాథ్ ఏఎస్‌కు 2015లో నోటి క్యాన్సర్ సోకింది. ఆ వ్యాధితో పోరాడుతున్న క్రమంలో ఆయన మాట్లాడే శక్తిని కోల్పోయారు. అప్పటి నుంచి తన అవసరాలు, ఆలోచనలు ఇతరులకు చెప్పాలంటే కాగితంపై రాసి చూపిస్తారు. ఆసుపత్రికి వెళ్లినా, బ్యాంకుకు వెళ్లినా, బయట ఏదైనా పని ఉన్నా ఆయన తరఫున భార్యే మాట్లాడాల్సిన పరిస్థితి. తనకు ఏమి కావాలో, ఏం చెప్పాలనుకుంటున్నారో వివరించేందుకు ఆమెపై ఆధారపడాల్సి వస్తోంది.

తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్న రఘునాథ్ ఎన్నో ఏళ్లుగా పేపర్ పై రాతతో ఇతరులతో సంభాషిస్తున్నానని తెలిపారు. అయితే  రాసిన విషయాలను చాలా సార్లు ఎవరూ చదివరని, స్పందించరని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ ఆసుపత్రుల్లో తనలాంటి ఎంతోమంది రోగులు తమ బాధను  చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు.

టైప్ చేస్తే చాలు.. మన మాటను వినిపిస్తున్న ఏఐ!

ఇలాంటి సమయంలో టెక్స్ట్ టు స్పీచ్ (Text-to-Speech) టెక్నాలజీ రఘునాథ్‌కు ఎంతో ఉపయోగపడింది. మనం టైప్ చేసిన పదాలను ఈ టెక్నాలజీ వాయిస్ రూపంలో వినిపిస్తుంది. అంటే మాట్లాడలేని వారు తమ మాటలను టైప్ చేస్తే.. ఏఐ వాటిని ఇతరులకు వినిపిస్తుంది.

దీంతో రఘునాథ్ కి తన ఆలోచనలను స్వయంగా వ్యక్తం చేసే అవకాశం లభించింది. ఇన్నాళ్లూ రాత ద్వారా చెప్పాల్సిన విషయాలను ఇప్పుడు ఏఐ సాయంతో వినిపిస్తున్నారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఎందుకంటే ఈ సేవలను ఉపయోగించుకోవడానికి అక్షరాల సంఖ్య ఆధారంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. రోజూ మాట్లాడాల్సిన విషయాలకు కూడా ఖర్చు పెరుగుతుండటంతో ఆయనకు ఇబ్బందిగా మారింది. భారత్‌లో మాట సంబంధిత వైకల్యం ఉన్నవారు దాదాపు 20 లక్షల మంది ఉన్నారని రఘునాథ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి వారికి ఏఐ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని, కానీ అధిక ఖర్చు కారణంగా చాలామందికి అది అందుబాటులో ఉండటం లేదని తెలిపారు.

‘మాకు దానం వద్దు.. మా గొంతుతో మేమే మాట్లాడాలి!’

ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రఘునాథ్ సర్వమ్ ఏఐను కోరారు. దివ్యాంగుల కోసం తక్కువ ధరలో అపరిమితంగా ఉపయోగించుకునే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘మాకు దాతృత్వం అవసరం లేదు. మా తరఫున మేమే మాట్లాడుకునే గౌరవం కావాలి,’ అన్న ఆయన అభ్యర్థన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వమ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రత్యుష్ కుమార్ స్పందించారు.

జీవితకాలం ఉచిత యాక్సెస్.. సీఈవో మనసును తాకిన విజ్ఞప్తి!

ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఏఐ ఉత్పత్తిని రూపొందించామని తెలిపారు. ఏఐ సేవలను ఉపయోగించేందుకు అక్షరాలను లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదని.. రఘునాథ్ సర్వమ్ ఏఐను జీవితకాలం ఉచితంగా ఉపయోగించుకునేలా అవకాశం కల్పించారు. ఇలాంటి అవసరాలు ఉన్న మరికొందరు తమను ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని ప్రత్యుష్ కోరారు. ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించే లోపే వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం!

రఘునాథ్‌కు జీవితకాల ఉచిత సేవలు అందించాలన్న సర్వమ్ ఏఐ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు. అవసరంలో ఉన్న వ్యక్తి సమస్యను గుర్తించి వెంటనే స్పందించడం గొప్ప విషయమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ ఘటనను ఏఐ టెక్నాలజీకి ఉన్న అసలైన ప్రయోజనానికి ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.

ఏఐ అంటే కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, పనులను వేగంగా పూర్తి చేయడం కాదు.  అవకాశాలు దూరమైనప్పుడు వాటిని తిరిగి అందించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్‌తో మాట కోల్పోయిన రఘునాథ్‌కు తన భావాలను ఇతరులకు వినిపించే అవకాశం కల్పించిన ఈ ఘటనే ఇందుకు ఓ మంచి ఉదాహరణ.

Follow Us