ట్రంప్‌కు ఎన్నికల షాక్.. అమెరికా న్యాయశాఖలో వరుస రాజీనామాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల ప్రభావం ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోని కీలక విభాగాలపై కనిపిస్తోందా? అమెరికా న్యాయశాఖలో వరుసగా సీనియర్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పౌర హక్కుల విభాగం అధిపతి నుంచి జాతీయ భద్రతా విభాగం ఉన్నతాధికారి వరకు పలువురు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షించిన ప్రాసిక్యూటర్ కూడా ఈ జాబితాలో ఉండటం ఆసక్తి రేపుతోంది.

పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ ధిల్లాన్ రాజీనామా చేసారు. మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు 30 రాష్ట్రాల ఓటర్ల నమోదు జాబితాలను పొందేందుకు న్యాయశాఖ ప్రయత్నించింది. ఈ వ్యవహారంలో ధిల్లాన్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ధిల్లాన్ రాజీనామా నిర్ణయం ఎన్నికల తర్వాత తీసుకుంది కాదు. ఆమె అక్టోబర్‌లోనే తన రాజీనామా లేఖను సమర్పించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగేందుకు అంగీకరించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
మరో ఇద్దరు ఉన్నతాధికారులు తప్పుకున్నారు
ధిల్లాన్ రాజీనామా తర్వాతి రోజే మరో ఇద్దరు కీలక అధికారుల రాజీనామాలు చేసారు. జాతీయ భద్రతా విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ ఐసెన్‌బర్గ్, ఫ్లోరిడాలోని సదరన్ డిస్ట్రిక్ట్ అమెరికా అటార్నీ జేసన్ క్వినోన్స్ తమ పదవుల నుంచి తప్పుకున్నారు.
వీరిలో క్వినోన్స్ పర్యవేక్షించిన దర్యాప్తు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. ట్రంప్‌ను అధికార పీఠం నుంచి తొలగించేందుకు మాజీ నిఘా అధికారులు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఆయన దర్యాప్తును పర్యవేక్షించారు.
ట్రంప్ ప్రత్యర్థులపై కేసులు.. ప్రాసిక్యూటర్లకు ఇబ్బందులు
ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా న్యాయశాఖ వ్యవహరిస్తున్న తీరుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ తన ప్రత్యర్థులుగా భావించిన పలువురిపై న్యాయపరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు, కేసులు నమోదు చేయడంలో ఆసక్తి చూపకపోవడం లేదా అభియోగాలు మోపలేకపోవడం వంటి కారణాలతో కొందరు ప్రాసిక్యూటర్లు తమ ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు న్యాయశాఖలోనే కీలక అధికారులు వరుసగా తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ ఎఫ్‌బీఐ చీఫ్ జేమ్స్ కోమీపై కేసు
ట్రంప్ ప్రభుత్వ హయాంలో నమోదైన మరో హైప్రొఫైల్ కేసు మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీకి సంబంధించింది. ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా ట్రంప్‌ను చంపుతానని బెదిరించారనే ఆరోపణలతో ఏప్రిల్‌లో కోమీపై అభియోగాలు నమోదు చేశారు.
మొత్తంగా చూస్తే.. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన పరాజయాల తర్వాత అమెరికా రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా న్యాయశాఖలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు రాజీనామా చేయడం, గతంలో నమోదైన కేసులు మరోసారి తెరపైకి రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి