AndhraPradesh: ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. కిలో ఉల్లి రూ.35కే ఇస్తారు.. నేటి నుంచే అందుబాటులోకి..
దీపావళి వేళ ఏపీ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కిలో ఉల్లి రూ.35కే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా వీటిని అందించనుంది. నేటి నుంచి వీటిని విక్రయించనున్నారు. వీటిని తీసుకోవాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఏపీ ప్రజలకు దీపావళి వేళ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ప్రతీ ఇంట్లో ఉల్లిపాయలు అనేది అత్యంత అవసరం. ఎందుకంటే ప్రతీ వంటలోనూ వీటిని వినియోగిస్తారు. పండుగ వేళ పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రజలకు పండుగ వేళ ఇంటి ఖర్చు తగ్గించేందుకు నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.35కే అందించనుంది. బహిరంగ మార్కెట్లో ధరల కంటే సగం ధరకే ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రైతు బజార్‌లోనూ ఇవి నవంబర్ 7 నుంచి అందుబాటులో ఉంచుతారు. దీంతో ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు.
రూ.35 కిలో ఉల్లి
ఏపీ ప్రజలకు నేటి నుంచి తక్కువ ధరకు రైతు బజార్లలో ఉల్లిపాయలు అందించనున్నట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లబ్ది పొందాలని సూచించారు. ఈ పంపిణీ కోసం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 800 టన్నుల ఉల్లిని రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. రైల్వే వ్యాగన్ల ద్వారా వీటిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లకు వీటిని పంపిణీ కోసం ఇప్పటికే తరలించారు. రైతు బజార్లలో తగినన్నీ ఉల్లి నిల్వలు అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
సబ్సిడీ ధరకే సన్నబియ్యం
ఇక ఎల్‌నివో ప్రభావంతో దేశవ్యాప్తంగా సన్నబియ్యం ధరలు పెరిగాయి. దీంతో ఏపీలో కూడా బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. ఇవి సామాన్యులకు భారంగా మారగా.. ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందిస్తోంది. రైతు బజార్లలో ధరణి బ్రాండ్ బియ్యంను రాయితీ ధరలకు అందిస్తోంది. ధరణి బ్రాండ్ 26 కేజీల బియ్యం బస్తాను రూ.1300కే విక్రయిస్తోంది. ఇక బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.49 నుంచి 52కు ఇస్తోంది. ఇక కేన్ఎం, నెల్లూరు సన్నాలను కిలో రూ.50కి ప్రజలకు అందిస్తోంది. రైతు బజార్లతో పాటు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేస్తోంది. ప్రజలు తమ ఆధార్ కార్డు చూపించి వీటిని తీసుకోవచ్చు. అలాగే రేషన్ షాపుల్లో తక్కువ ధరకు పామాయిల్, గోధుమ పిండి, షుగర్, కారం వంటి నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎల్‌నివో ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో రాయితీ ధరలకు అందించనుంది. రేషన్ కార్డులు ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు.
