ఈ నెల 24న ఆకాశంలో అద్భుత దృశ్యం..! ఈ సారి మిస్సైతే 2040 వరకు ఇక లేనట్టే!!
ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం అతి త్వరలో రానుంది. ఈ నెలలోనే ఈ ఖగోళ విన్యాసం కనువిందు చేయనుంది.
ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించే అరుదైన దృశ్యం చూసే అవకాశం అతి త్వరలో రానుంది. ఈ నెలలోనే ఈ ఖగోళ విన్యాసం కనువిందు చేయనుంది. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి. వీటిని ఏ బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ సహాయం లేకుండా నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్లవారడానికి కొద్ది గంటల ముందు ఈ అద్భుతాన్ని చూడొచ్చు.
సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. కానీ ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడం చాలా అరుదు. 2004లో ఇలా ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో ఉన్నట్లు కన్పించాయి. అయితే ఈ అద్భుతమైన దృశ్యాన్ని సూర్యుడు ఉదయించకముందే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే, సూర్యుడికి అతి దగ్గరగా బుధగ్రహం ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే ఆ కాంతిముందు బుధగ్రహం కన్పించదు. అందువల్ల బుధగ్రహంతోపాటు ఐదు గ్రహాలను చూడాలంటే తెల్లవారుఝూమునే తూర్పువైపున, ఎత్తయిన ప్రాంతంపై నిల్చుని చూడాల్సి ఉంటుంది.
ఈనెల 3-4 తేదీలనుంచి 24వ తేదీ వరకు ఈ అద్భుతాన్ని వీక్షించొచ్చు. కొన్నిరోజుల్లో ఆ గ్రహాలు మిరుమిట్లు గొలుపుతూ మరింత కాంతివంతంగా కన్పిస్తాయి కూడా. ప్రత్యేకించి 24న ఇదో అద్భుత దృశ్యమే. ప్రతిసారి దాదాపు ఒక గంటసేపు ఇలా గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పిస్తాయి. ఇక్కడ మరో విశేషం కూడా కన్పిస్తుంది. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చన్నారు ఎడిన్‌బరో యూనివర్శిటీ ఖగోళశాస్త్ర విభాగానికి చెందిన ఉన్నతాధికారి ప్రొ. బెత్ బిల్లర్. ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలంటే సూర్యోదయానికి ముందే మేల్కొవాలని గుర్తుంచుకోండి. లేదంటే మిస్ అవుతారు.