Viral: అర్థరాత్రి రైలు ప్రయాణంలో ఉండగా గర్భిణీకి నొప్పులు.. ఈ యువకుడు చేసిన పని తెలిస్తే..
సమయం అర్ధరాత్రి ఒంటిగంట..చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ వంద కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకుపోతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఓ మహిళకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, ప్రయాణికుల్లో టెన్షన్ స్టార్టయింది. అప్పుడే జరిగింది ఓ విచిత్రం. రైల్వే స్టేషన్ ఆస్పత్రి బెడ్‌గా మారగా.ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ వైద్యుడయ్యాడు. దాంతో 3 ఇడియట్స్‌లోని రీల్ సీన్ కాస్తా..ఫ్లాట్‌ఫామ్‌పై రియల్ సీన్ అయింది.

త్రీ-ఇడియట్స్ సినిమాను తలపించే ఘటన..ముంబైలో జరిగింది. అనుకోని పరిస్థితుల్లో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారమ్‌పై ఓమహిళకు ప్రసవం చేశాడు యువకుడు. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. ఉన్నట్టుండి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ముంబైలోని రామ్‌మందిర్ స్టేషన్‌కు రాగానే ఆమె పరిస్థితి గమనించిన వికాస్ అనే యువకుడు..చైన్‌లాగి ట్రైన్ ఆపాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయితే ఆ ప్రాంతానికి అంబులెన్స్ చేరుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. మరో వైపు మహిళ పరిస్థితి చూస్తే విషమంగా మారుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రయాణికుల్లో కూడా టెన్షన్ మొదలయింది.
ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తనకు తెలిసిన ఓ మహిళా డాక్టర్‌కు ఫోన్ చేశాడు వికాస్. వీడియో కాల్‌లో ఆమె చెప్పిన విధంగా గర్భిణి సురక్షితంగా ప్రసవించేలా చర్యలు తీసుకున్నాడు. స్టేషన్‌లోని ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కూడా అతడికి సహకరించారు. దీంతో మహిళకు సుఖ ప్రసవం అయింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సురక్షితంగా తల్లి, బిడ్డ.. ఆస్పత్రికి తరలింపు
ప్రసవం తర్వాత ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది సహాయంతో తల్లి, బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మరోవైపు ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆపత్కాలంలో ధైర్యంగా వ్యవహరించి ప్రసవం చేసిన వికాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
