Video: స్మార్ట్ గ్లాసెస్ తో థియేటర్‌కు.. నెటిజన్లు ఇచ్చిన క్లాస్ మామూలుగా లేదుగా!
థియేటర్‌లో పైరసీని అరికట్టేందుకు కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను లోపలికి అనుమతించరు. కెమెరాలు ఉన్న స్మార్ట్ కళ్లద్దాలు ఇప్పుడు థియేటర్లకు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి సినిమా చూడటానికి వెళ్లిన ఓ వ్యక్తిని సెక్యూరిటీ అడ్డుకున్నారు. కళ్లద్దాలు తీస్తే కనిపించదని అతడు వాదిస్తే.. నిబంధనలు అనుమతించవు అంటూ సిబ్బంది స్పష్టం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారగా.. చివరకు నెటిజన్లు ఆ వ్యక్తికే క్లాస్ తీసుకున్నారు.

ఓ ఎక్స్ యూజర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి థియేటర్ సెక్యూరిటీ సిబ్బందితో తీవ్రంగా వాదించడం కనిపించింది. రాత్రి 11.50 గంటల షోకు తాను టికెట్ కొనుగోలు చేశానని, అయినా లోపలికి అనుమతించడం లేదని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన కళ్లద్దాల్లో సాధారణ లెన్స్‌లు కాకుండా చూపు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లు ఉన్నాయని వివరించాడు. వాటిని తీసేస్తే తనకు సరిగా కనిపించదని, అలాంటప్పుడు సినిమా ఎలా చూడాలని ప్రశ్నించాడు. టికెట్ డబ్బులు చెల్లించిన తర్వాత కూడా షోకు అనుమతించకపోవడం ఏంటంటూ సిబ్బందితో వాదనకు దిగాడు.
మేనేజర్ చెప్పినా వినకుండా.. తోడొచ్చిన మహిళ కూడా ప్రశ్నించడంతో!
ఈ గొడవను గమనించిన ఓ వ్యక్తి మేనేజర్‌లా కనిపిస్తూ అతడిని గొంతు తగ్గించి మాట్లాడాలని సూచించాడు. థియేటర్‌లో మెటా గ్లాసెస్‌కు అనుమతి లేదని, అది యాజమాన్యం తీసుకున్న నిర్ణయమని వివరించాడు. తాము ఆ నిబంధనను ఉల్లంఘించి ఎవరికీ ప్రత్యేక అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశాడు.
అయినా ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ‘ఇందులో మా తప్పేముంది? కస్టమర్ తప్పు కూడా కాదు. మేం సినిమా టికెట్ కొన్నాం’ అంటూ తన వాదనను కొనసాగించాడు. అతడితో పాటు వచ్చిన మహిళ జోక్యం చేసుకుంది. థియేటర్‌లో మెటా గ్లాసెస్ అనుమతించరని ముందే స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. ‘అవి తీసేసి లోపలికి వెళ్లొచ్చు కదా. ఇంకా ఎందుకు వాదిస్తున్నారు?’ అంటూ అతడినే ప్రశ్నించింది.
దీంతో మేనేజర్ తన ఫోన్‌లో థియేటర్ నిబంధనలను చూపించాడు. అయినప్పటికీ తన కళ్లద్దాలు ప్రిస్క్రిప్షన్‌వని, వాటిని తీసేయడం సాధ్యం కాదని ఆ వ్యక్తి పట్టుబట్టాడు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కూడా తమ నిబంధనల విషయంలో వెనక్కి తగ్గలేదు.
A man went to watch a movie at PVR wearing Meta glasses, but security stopped him, saying they are not allowed.
Staff explained him that PVR has a policy against Meta glasses, which is also mentioned on a banner outside.
The man started arguing that he couldn’t remove them because they had prescription lenses.
But, I don’t understand why PVR has banned Meta glasses? Anyone who wants to record a movie can do so using a mobile phone too 🤷🏻♂️
— Lakshay Mehta (@lakshaymehta08) November 5, 2026
తానే రికార్డ్ చేస్తూ.. పైరసీ గురించి వాదన!
ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు రావడానికి మరో కారణం ఉంది. ఆ వ్యక్తి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సమయంలో తన మెటా గ్లాసెస్‌తోనే ఆ దృశ్యాలను రికార్డ్ చేస్తున్నాడు. అంటే.. థియేటర్‌లో కెమెరా ఉన్న కళ్లద్దాలకు అనుమతి లేదని సిబ్బంది చెబుతుండగా, అదే కళ్లద్దాలతో వారి వాదనను వీడియో తీస్తున్నాడు. ఈ విషయమే నెటిజన్లకు మరింత ఆగ్రహం తెప్పించింది.
థియేటర్ బయట కూడా మెటా గ్లాసెస్‌కు అనుమతి లేదని తెలిపే బ్యానర్ ఏర్పాటు చేశారు. అయినా ఆ వ్యక్తి నిబంధనలను పట్టించుకోకుండా సిబ్బందితో వాదనకు దిగాడు. సినిమా రికార్డ్ చేయాలనుకుంటే మొబైల్ ఫోన్‌తో కూడా చేయవచ్చు కదా.. మరి స్మార్ట్ గ్లాసెస్‌పైనే ఎందుకు నిషేధం విధించారంటూ ప్రశ్నించాడు.
అయితే కామెంట్ సెక్షన్‌లో మాత్రం అతడికి పెద్దగా మద్దతు లభించలేదు. థియేటర్ నిబంధనలు ముందే స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పాటించాల్సిందేనని పలువురు అభిప్రాయపడ్డారు. టికెట్ బుక్ చేసుకునే ముందే నిబంధనలు చూసుకోవాల్సిందని మరో యూజర్ సూచించారు. సిబ్బందితో వాదిస్తూ, అదే సమయంలో తన కళ్లద్దాలతో వీడియో రికార్డ్ చేయడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నించారు.
అసలు మెటా గ్లాసెస్‌తో సమస్య ఏంటి?
Meta Glasses అంటే Meta కంపెనీ, ప్రముఖ కళ్లద్దాల బ్రాండ్ Ray-Ban భాగస్వామ్యంతో రూపొందించిన స్మార్ట్ కళ్లద్దాలు. వీటిని సాధారణ కళ్లద్దాల్లాగే ధరించవచ్చు. కానీ వీటిలో చిన్న కెమెరా, మైక్రోఫోన్లు, స్పీకర్లు, AI టెక్నాలజీ ఉంటాయి. వీటితో ఫోన్ బయటకు తీయకుండానే ఫోటోలు తీయవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు,’Hey Meta’ అని అడిగి AI ద్వారా సమాధానాలు పొందవచ్చు. అన్ని మోడళ్లలో భాషలను అనువదించవచ్చు.
అయితే వీటిలో కెమెరాలు ఉండటంతో సినిమా థియేటర్లలో పైరసీకి అవకాశం ఉందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే కొన్ని థియేటర్లు మెటా గ్లాసెస్‌ను లోపలికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి, థియేటర్ సిబ్బంది మధ్య జరిగిన ఈ చిన్నపాటి గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.