Hyderabad: ఐటీ ఉద్యోగులకు ఇది కదా కావాల్సింది.. ఇకపై వర్క్ ఫ్రమ్ పార్క్.. అధికారుల క్రేజీ ఐడియా..
నాలుగు గోడల మధ్య ఆఫీస్ పనితో బోర్ కొట్టేస్తోందా? అయితే మీ ల్యాప్‌టాప్ పట్టుకుని నేరుగా పార్కుకు వెళ్లిపోవచ్చు.. గ్రీన్ ఎన్విరాన్‌మెంట్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పని చేసుకునేలా సైబరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ పార్క్ కాన్సెప్ట్ రాబోతోంది. రాబోయే 90 రోజుల్లో ఏకంగా 300 నయా పార్కులను సిద్ధం చేస్తూ, కొబ్బరి డొక్కలతో రోడ్ల నిర్మాణం వరకు సైబరాబాద్ కార్పొరేషన్ వేస్తున్న సరికొత్త అడుగుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో కూర్చుని ల్యాప్‌టాప్‌పై ఆఫీస్ పనులు చేస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా.. సరిగ్గా ఇలాంటి వెసులుబాటును సైబరాబాద్ వాసులకు అందించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. పర్యావరణహిత విధానాలతో పాటు అత్యాధునిక జీవన ప్రమాణాలను స్థానిక ప్రజలకు అందించడమే ధ్యేయంగా బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు చిన్నారులకు పూర్తి భరోసానిచ్చే నగరంగా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆమె భరోసా ఇచ్చారు. రాబోయే 90 రోజుల్లోనే కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 300 కొత్త పార్కులను ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోజువారీ ఆఫీస్ ఒత్తిళ్లతో సతమతమయ్యే టెక్కీలను దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రమ్ పార్క్ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి మధ్య ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలు, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాలతో ఈ పార్కులను తీర్చిదిద్దనున్నారు.
వ్యర్థాల నుంచి రోడ్ల నిర్మాణం.. నిబంధనలు మీరితే కొరడా
నగరంలో పేరుకుపోతున్న వ్యర్థాలను శాస్త్రీయంగా వినియోగంలోకి తెచ్చేందుకు వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా రోడ్ల పక్కన పారబోసే కొబ్బరి బొండాల డొక్కలను ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసి, ఆ మెటీరియల్‌ను నాణ్యమైన తారు రోడ్ల నిర్మాణానికి వాడుతున్నారు. తడి-పొడి చెత్తతో పాటు పచ్చని వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి వార్డులోనూ ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పుతున్నారు. కాగా చేపల దాణా పేరిట నిబంధనలకు విరుద్ధంగా చికెన్ వేస్ట్‌ను సేకరిస్తున్న మాఫియాపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చుక్క నీరు నిలవని రోడ్లు.. గ్రౌండ్ వాటర్‌కు నోటీసులు
కుండపోత వర్షాలు పడినా సైబరాబాద్ రహదారులపై అడుగు కూడా నీరు నిలబడకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను విస్తరిస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పార్కుల్లోని బోరు బావులను మూసివేసి, రోజుకు 1.60 లక్షల లీటర్ల శుద్ధి చేసిన రీసైకిల్డ్ నీటితోనే పచ్చదనాన్ని కాపాడుతున్నారు. అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మించే బిల్డర్లు కూడా బోరు నీటికి బదులు ట్రీటెడ్ వాటర్‌నే తప్పనిసరిగా వాడాలని, నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశామని వివరించారు.
అక్రమ కట్టడాలపై రాజీలేని పోరు
అనుమతులు లేకుండా వెలసిన అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి త్వరలోనే కూల్చివేతలు చేపడతామని కమిషనర్ తెలిపారు. ఈ విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని, కేవలం న్యాయపరమైన చిక్కుల వల్లనే ప్రక్రియ ఆలస్యమవుతోందని, కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అక్రమ కట్టడాల ఆట కట్టిస్తామని ఆమె స్పష్టం చేశారు.
