LPG, CNG, PNG, LNG మధ్య తేడా ఏంటి? వీటి గురించి పూర్తి వివరాలు..
ఇంధన కొరత చర్చల నేపథ్యంలో, సహజ వాయువు, ఎల్పీజీ, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ, బయోగ్యాస్, బయో-సీఎన్‌జీ వంటి వివిధ గ్యాస్ రకాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. వాటి మూలం, తయారీ పద్ధతులు, ఉపయోగాలు.. వాటి మధ్య ఉన్న తేడాలను ఈ కథనం వివరిస్తుంది. ఇది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి అవగాహన కల్పిస్తుంది.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా తగ్గింది. దీనివల్ల భారత్‌లో ఎల్పీజీ కొరత గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి మాట్లాడుకుంటున్నారు. గ్యాస్ గురించి మాట్లాడేటప్పుడు సహజ వాయువు, ఎల్పీజీ, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ వంటి పదాలు తరచుగా వినబడుతుంటాయి. ఈ గ్యాస్ రకాలు ఒకటేనా, వీటి తయారీలో తేడాలు ఏమిటి, వాటి ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సహజ వాయువు అంటే ఏంటి?
సహజ వాయువు అనేది బొగ్గు, చమురు లాగే ఒక శిలాజ ఇంధనం. దీనిలో ప్రధానంగా మీథేన్ అనే సమ్మేళనం (ఒక కార్బన్, నాలుగు హైడ్రోజన్ పరమాణువులు) ఉంటుంది. దీనితో పాటు తక్కువ మొత్తంలో సహజ వాయు ద్రవాలు, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా కలిసి ఉంటాయి. దీనిని కేవలం ఇంధనంగానే కాకుండా రసాయనాలు, వివిధ వస్తువుల తయారీలోనూ ఉపయోగిస్తారు. చనిపోయిన మొక్కలు, సూక్ష్మజీవుల అవశేషాలు భూమి లోపల తీవ్రమైన పీడనం, ఉష్ణోగ్రతలకు గురై కాలక్రమేణా సహజ వాయువుగా రూపాంతరం చెందాయి.
భూగర్భంలో సహజ వాయువు లభించే విధానాన్ని బట్టి దీనిని రెండు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు:
1.సాంప్రదాయ నిల్వలు: ఇవి సాధారణంగా ముడి చమురు నిల్వలతో కలిసి ఉంటాయి లేదా దానిపై ఒక పొరలా తేలుతూ కనిపిస్తాయి. వీటిని వెలికితీయడం సులభం.
2. సాంప్రదాయేతర నిల్వలు: ఇవి భూమి లోపల కఠినమైన శిలా పొరల మధ్య ఉంటాయి. ఉదాహరణకు షెల్ గ్యాస్, టైట్ గ్యాస్ శాండ్ స్టోన్, కోల్ బెడ్ మీథేన్. వీటిని వెలికితీయడానికి అధునాతన సాంకేతికత అవసరం. సాధారణంగా ముడి చమురు పైన ఉన్న గ్యాస్ ను పైపుల ద్వారా సేకరిస్తారు. భూమి లోపల నుంచి వచ్చే గ్యాస్‌లో మీథేన్‌తో పాటు నీటి ఆవిరి, మలినాలు ఉంటాయి. వీటిని తొలగించి, స్వచ్ఛమైన మీథేన్‌ను వేరు చేస్తారు. ఈ ప్రక్రియలోనే ఎల్పీజీ ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. ఇలా శుద్ధి చేసిన గ్యాస్‌ను సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ రూపంలో ఉపయోగిస్తారు.
వివిధ గ్యాస్ రకాలు:
- LPG(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్):ఇది ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఎల్పీజీ రెండు ప్రధాన మార్గాల ద్వారా లభిస్తుంది. మొదటిది రిఫైనరీ టవర్‌లో ముడి చమురును మరిగించినప్పుడు తేలికపాటి వాయువులైన ప్రోపేన్, బ్యూటేన్ విడిపోతాయి. వీటిని సిలిండర్లలో నింపి ఎల్పీజీగా వాడుతారు. రెండోది, సహజ వాయువును వెలికి తీసినప్పుడు మీథేన్‌తో పాటు కొంత ప్రోపేన్, బ్యూటేన్ కూడా కలిసి ఉంటాయి. సహజ వాయువు శుద్ధి ప్రక్రియలో మీథేన్‌ను వేరు చేసేటప్పుడు, ప్రోపేన్, బ్యూటేన్‌లను కూడా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన వాయువులే ఎల్పీజీ. నీలం రంగులో స్వచ్ఛంగా మండే దీనిని ప్రధానంగా వంట గ్యాస్‌గా వినియోగిస్తారు.
- CNG (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్): ఇది ప్రధానంగా మీథేన్ వాయువు. సహజ వాయువును అత్యంత అధిక పీడనం వద్ద కంప్రెస్ చేసి ట్యాంకుల్లో నింపుతారు. ఇది పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీనిని కార్లు, బస్సులు, ఆటోలు వంటి వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు.
- LNG (లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్): సహజ వాయువును 162 డిగ్రీస్ సెల్సియస్ వద్ద అతిగా చల్లబరిస్తే అది ద్రవంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. గ్యాస్ పైప్‌లైన్లు లేని సుదూర దేశాలకు భారీ నౌకల ద్వారా గ్యాస్ ను పంపాలంటే ఎల్ఎన్జీ రూపంలోనే రవాణా చేస్తారు.
- PNG (పైప్డ్ నాచురల్ గ్యాస్): ఇది కూడా సహజ వాయువే కానీ దీనికి సిలిండర్ల అవసరం ఉండదు. భూగర్భ పైపుల ద్వారా నేరుగా వంటగది వరకు వస్తుంది. మెట్రో నగరాల్లో దీనిని వంట గ్యాస్‌గా వినియోగిస్తారు. వినియోగించిన పరిమాణం ఆధారంగా విద్యుత్ బిల్లు మాదిరిగానే బిల్లు చెల్లించవచ్చు.
బయోగ్యాస్ వర్సెస్ బయో-సీఎన్జీ: సహజ వాయువును భూగర్భం నుంచి వెలికి తీస్తుండగా, పర్యావరణ వ్యర్థాల నుంచి కూడా ఇదే తరహా ఇంధనాన్ని సృష్టించవచ్చు. దీనినే బయోగ్యాస్ అంటారు. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడను గాలి తగలకుండా కుళ్ళింపజేయడం ద్వారా ఇది తయారవుతుంది. ఈ బయోగ్యాస్‌ను అధునాతన పద్ధతుల్లో శుద్ధి చేసి, అందులోని మలినాలను తొలగించినప్పుడు మీథేన్ శాతం 90% పైగా పెరుగుతుంది. ఇలా శుద్ధి చేసిన వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేసి సిలిండర్లలో నింపితే దానిని బయో-సీఎన్‌జీ అంటారు. దీని లక్షణాలు సహజ వాయువుతో సమానంగా ఉండటం వల్ల వాహనాల్లో ఇంధనంగా వాడుతుంటారు.
